Rekha Singh: దేశభక్తిని వారసత్వంగా అందుకొని..
ఆస్తులని వారసత్వంగా కోరుకొనే వాళ్లని చూసి ఉంటారు.. కానీ దేశభక్తిని వారసత్వంగా కోరుకొనేవాళ్లని చూశారా? సరిహద్దులో దేశం కోసం ప్రాణాలొదిలిన భర్త ఆశయాన్ని నిలబెట్టడం కోసం రేఖాసింగ్ భారత శతఘ్ని విభాగంలోకి అడుగుపెట్టారు.
ఆస్తులని వారసత్వంగా కోరుకొనే వాళ్లని చూసి ఉంటారు.. కానీ దేశభక్తిని వారసత్వంగా కోరుకొనేవాళ్లని చూశారా? సరిహద్దులో దేశం కోసం ప్రాణాలొదిలిన భర్త ఆశయాన్ని నిలబెట్టడం కోసం రేఖాసింగ్ భారత శతఘ్ని విభాగంలోకి అడుగుపెట్టారు. ఆమెతోపాటు మరో నలుగురు మహిళలు ఈ విభాగంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు...
చరిత్రలో తొలిసారిగా భారత సైన్యంలోని శతఘ్ని విభాగం (ఆర్టిలరీ రెజిమెంట్)లో ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. అందులో తండ్రి కోరికపై ఒకరు.. భర్త ఆశయం కోసం మరొకరు సైన్యంలోకి వచ్చారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా ముగించుకుని ఐదుగురు మహిళలు భారత సైన్యంలో చేరారు. లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్ ఫీల్డ్ రెజిమెంటుల్లో.. లెఫ్టినెంట్ పయస్ ముద్గిల్ మీడియం రెజిమెంట్‌గా, లెఫ్టినెంట్ ఆకాంక్ష రాకెట్ రెజిమెంట్ విభాగంలో చేరారు. భారత సైన్యంలో ఆర్టిలరీ రెజిమెంట్ కీలకమైన విభాగం. క్షిపణులు, తుపాకులు, మోర్టార్‌లు, రాకెట్ లాంచర్లు, మానవరహిత వైమానిక వాహనాలతో ఆర్టిలరీ మందుగుండు సామగ్రి అక్కడ ఉంటాయి. అలాంటి కీలక విభాగంలోకి మహిళా అధికారులు రావడం గర్వంగా ఉందంటున్నారీ అమ్మాయిలు. ‘ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ప్రోత్సహించారు. ఆయన కల నెరవేర్చడం కోసమే నేనీ రంగంలోకి వచ్చా’ అంటున్నారు లెఫ్టినెంట్ సాక్షి దుబే. ‘నా భర్త దీపక్ సింగ్ 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. నేను ఆర్మీలోకి వచ్చి దేశానికి సేవ చేయడమే నేనిచ్చే నిజమైన నివాళి అనుకున్నా. అందుకోసం చాలా కష్టపడ్డాను. నా శిక్షణ పూర్తయింది. నేను లెఫ్టినెంట్ అయ్యాను. చాలా గర్వపడుతున్నాను. నేనే కాదు సైన్యంలోకి రావాలనుకున్న ప్రతి మహిళా తమని తాము విశ్వసించాలి.. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించవద్దు. మీరు చేయాలనుకున్నది చేయండి అంటున్నారు’ లెఫ్టినెంట్ రేఖా సింగ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.