ఉప్పుతో జీవితాలను మార్చారు

ఎంత కష్టపడి వండినా పడాల్సిన దినుసు పడకపోతే రుచి రాదు కదా. అలానే తన చుట్టూ ఉన్న మహిళల జీవితాల్లో ఆర్థిక స్వాతంత్య్రం అనే దినుసు లేదని గ్రహించారావిడ.

Published : 03 May 2023 00:15 IST

ఎంత కష్టపడి వండినా పడాల్సిన దినుసు పడకపోతే రుచి రాదు కదా. అలానే తన చుట్టూ ఉన్న మహిళల జీవితాల్లో ఆర్థిక స్వాతంత్య్రం అనే దినుసు లేదని గ్రహించారావిడ. ఆ లోటును ‘ఉప్పు’తో భర్తీ చేశారు. అంతే వారి పేరు ఉత్తర భారతమంతా పాకిపోయింది.  ‘నమక్‌వాలీలు’గా, లక్షలు సంపాదిస్తోన్న మహిళలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఖ్యాతి వెనుక శశి బహుగుణ ఉదాత్త ఆశయం ఉంది. వారసత్వ సంపదను కాపాడుకోవాలనే తపన ఉంది... 30 ఏళ్ల ఆమె పోరాట ఫలితమే ఈ మార్పు.

కప్పుడు వీళ్లని ఘర్వాలీలు, పహాడీలు అనేవారు. ఇప్పుడు నమక్‌వాలీలు అంటున్నారు. ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగడానికి కారణం శశి. దాల్‌మఖనీ, పనీర్‌ కడాయ్‌, చట్నీ... ఇలా ఏ వంటకం తిన్నా... ఒకప్పటి రుచి రాకపోవడం ఆమెను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ ఉప్పుని ఈ కాలంలో వాడక పోవడమూ ఓ కారణమని గుర్తించారామె. ఉద్యోగాలు, చదువుల పేరుతో ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరికీ తమ వారసత్వ ఆహార శైలిని, ఆ వంటకాలకు ప్రత్యేక రుచిని తెచ్చిపెట్టే ఆ సంప్రదాయ ఉప్పుని పరిచయం చేయాలనుకున్నారు.

ఇందు కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. రుచి చూసిన వారంతా బాగున్నాయని మెచ్చుకునే వారు. అప్పుడే దీన్ని వ్యాపార మార్గంగా మలచుకోవాలనుకున్నారు. అదే సమయంలో ఇదంతా నాకే ఎందుకు పరిమితం అవ్వాలి? తోటి వాళ్లకూ ఉపయోగపడాలని ఆలోచించారామె. అయితే, ఇది అనుకున్నంత సులువుగా జరగలేదట. ఇంట్లో వాళ్లేమో చేస్తున్నది చాలు... ఇంకా కొత్త సవాళ్లు ఎందుకన్నారు. ఎందుకంటే అప్పటికే ఆమె బాల్యవివాహాల నిర్మూలన, వరకట్న వేధింపులు, మహిళలకు ఉపాధి కల్పన లాంటి సమస్యలపై పోరాడుతున్నారు.

ఇతర ప్రాంతాలకూ... ఎంతమంది కాదన్నా... శశి మాత్రం తన ఆలోచనను ఇరుగు పొరుగు మహిళలతో పంచుకున్నారు. వారికీ నచ్చడంతో అందరూ కలిసి దాన్ని ఉపాధి మార్గంగా మలచుకున్నారు. దశాబ్దాలుగా తెలిసిన పనే కాబట్టి వాళ్లకు పెద్దగా కష్టం అనిపించలేదు. అలా పిస్యూ లూన్‌, పహాడీ సాల్ట్‌ అంటూ 2018లో వ్యాపారం ప్రారంభించారు. రుచి జనాలకు నచ్చడంతో ఆదరణ పెరిగింది. పెద్ద హోటళ్ల నుంచి ఆర్డర్లు వచ్చాయి. వ్యాపారం చెన్నై, దిల్లీ, ముంబయిలకూ విస్తరించింది. నలుగురు మహిళలతో, పెద్దగా పెట్టుబడి లేకుండా, కేవలం వంటింటి సామాన్లతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు లక్షల రూపాయల లాభాలతో సాగుతోంది.  ఆ గ్రామంలో సగం మందికి పైగా ఉపాధినిస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా వందల మంది ఈ ఉప్పుతయారీతో ఉపాధి పొందుతున్నారు.

పోషకాల గని... మనకు తెలిసినవి రెండే రకాలు, తెల్లుప్పు నల్లుప్పు. వీళ్లు తయారు చేస్తున్నది పహాడీ సాల్ట్‌. పోషకాలు మెండుగా ఉండే ఉప్పు. మామూలు ఉప్పునే సన్నికల్లుపై నూరి, హిమాలయాల్లో దొరికే మూలికలను కలిపి చేస్తారు. పిస్యూ (నూరి) చేయడం వల్ల దీన్ని పిస్యూలూన్‌ సాల్ట్‌ అనీ అంటారు. అల్లం, వెల్లుల్లి వంటివీ కలిపి చేస్తారు.

మావయ్య స్ఫూర్తితో... శశిది దెహ్రాదూన్‌ దగ్గర బల్వారీ గ్రామం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. మావయ్య దగ్గరే పెరిగారు. ఆయన మరెవరో కాదు. చిప్కో ఉద్యమంతో దేశవ్యాప్తంగా సుపరిచితమైన సుందర్‌లాల్‌ బహుగుణ. ఆయన స్ఫూర్తితోనే 18 ఏళ్ల వయసు నుంచే శశి మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. 1992లోనే ఆమె ఊరంతా మరుగుదొడ్లు కట్టించేందుకు కృషి చేశారు. గృహహింస నుంచి ఎందరో మహిళలను కాపాడారు. చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినప్పుడు రాళ్ల దెబ్బలూ తిన్నా అని గుర్తు చేసుకుంటారామె. భర్త సంపాదనలో సగం ఉద్యమానికి కేటాయించారట. ఆమెకు ఇద్దరు మగపిల్లలు. ఇద్దరూ తన ఆశయానికి తోడుగా నిలుస్తున్నారని సంతోషంగా చెబుతారు శశి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని