బామ్మల సేవోత్సాహం
జీవితమంతా చదువు, కెరియర్.. కుటుంబం, పిల్లలంటూ క్షణం తీరిక లేకుండా సాగిపోయాక.. సమాజానికి ఇంకా ఏదైనా చేద్దాం అన్న తపన, ఓపిక ఉంటాయా? ‘ఎందుకు ఉండవు.. అందుకు మేమే ఉదాహరణ’ అంటున్నారు 30 ఏళ్లుగా సేవామార్గంలో అలుపెరగకుండా సాగిపోతున్న భానుమతి అండ్ బృందం.
జీవితమంతా చదువు, కెరియర్.. కుటుంబం, పిల్లలంటూ క్షణం తీరిక లేకుండా సాగిపోయాక.. సమాజానికి ఇంకా ఏదైనా చేద్దాం అన్న తపన, ఓపిక ఉంటాయా? ‘ఎందుకు ఉండవు.. అందుకు మేమే ఉదాహరణ’ అంటున్నారు 30 ఏళ్లుగా సేవామార్గంలో అలుపెరగకుండా సాగిపోతున్న భానుమతి అండ్ బృందం... వాళ్ల నేస్తుల గురించి ఆవిడేం చెబుతున్నారో వినండి..
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగినులం మేమంతా. మాలో కొందరు సాధారణ గృహిణులూ ఉన్నారు. రిటైర్ అయ్యాక.. బాధ్యతల నుంచి కాస్త గట్టెక్కాక జీవితంలో ఇక చేయడానికి ఏమీ లేనట్టే అంటే మేం ఒప్పుకోం! చేతనైనంతే చేద్దాం అని చిన్నగా మొదలుపెట్టిన మా సేవా ప్రయాణం 30 ఏళ్లుగా సాగిపోతుండటం సంతోషంగా అనిపిస్తుంది. మా జీవితానుభవాలని నలుగురికీ పంచాలనుకుంటున్న సమయంలో 1988 కాకినాడలో ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (ఎఐడబ్ల్యూఎస్)వేదికగా కొంతమంది ఆడవాళ్లం కలిశాం. మహిళా సాధికారత కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తుందీ సంస్థ.
ప్రకృతి కోసం..
ప్రకృతి మనకి దేవుడిచ్చిన వరం. స్వార్థంతోనో, తెలిసో తెలియకో దానికి నష్టం కలిగిస్తున్నాం. కనీసం మా చుట్టుపక్కలైనా సహజ వనరుల్ని కాపాడాలనుకున్నాం. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కట్టెల పొయ్యిపై వంటచేసి ఆ పొగకి అనారోగ్యం పాలవుతున్న ఆడవాళ్లని చూశాం. వాళ్లకి సబ్సిడీపై పొగరాని పొయ్యిలను అందించాం. అమలాపురం, కోటిపల్లి, విలస, అయినవిల్లి మొదలైన గ్రామాల్లో కట్టెల పొయ్యి అనేది లేకుండా కృషి చేశాం. 2009లో తాగునీటి కొరత ఎదుర్కొంటున్న కొమరగిరి గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. అక్కడ మంచినీటిని అందుబాటులోకి తెచ్చాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సాయంతో నీటి పొదుపుపై పాఠాలు చెబుతున్నాం. మత్స్యకారులు, కళాశాల విద్యార్థినుల సాయంతో బీచ్‌లోని వ్యర్థాలను శుభ్రం చేస్తున్నాం. మాకు సాయపడుతున్న నలుగురు మత్స్యకారులకు నెలకు రూ.8వేలు గౌరవభృతి ఇస్తున్నాం. కృషి విజ్ఞాన్ కేంద్రం ద్వారా.. రసాయన ఎరువుల వినియోగాన్ని నియంత్రిస్తున్నాం. కొంతమందినైనా ఉపాధి బాట పట్టించాలని 8 మంది నేత కార్మికులకు మగ్గాలనీ, కొబ్బరి విరివిగా ఉండే ప్రాంతం కాబట్టి 10 మందికి కొబ్బరి నూనె తయారీ యంత్రాలనూ అందజేశాం. ఇలా చిన్నగా మొదలైన మా కార్యక్రమాలు నెమ్మదిగా ఊపందుకొన్నాయి. బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. పేదపిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. ఉప్పాడ కొత్తపల్లిలో సుమారు 30 మంది మహిళలతో పదో తరగతి పరీక్షలు రాయిస్తే.. వీరిలో కొందరు చదువు కొనసాగించి అంగన్‌వాడీ టీచర్లుగా, ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు.
సాంకేతికత సాయంతో..
పాలెంపు చిరంజీవిని గారికి 91 ఏళ్లు. రిటైర్డ్ లెక్చరర్. ఈ వయసులో కూడా ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. ఇప్పటి తరాలకు సేవాగుణం, మహిళల హక్కుల పట్ల అవగాహన కల్పిస్తుంటారు. పసుమర్తి పద్మజా వాణి.. 35 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. చదువులు, బాధ్యతలు అంటూ సగం జీవితం గడిచిపోయినా ఇప్పటికీ సమాజానికి ఏదో చేయాలన్న తపన ఆమెది. మేమంతా అంతే! మనవలు, మనవరాళ్ల నుంచి సాంకేతికత తెలుసుకుని ఫోన్లు, వాట్సప్‌లు వాడుతున్నాం. వాటి సాయంతో మరికొంతమందికి సాయం చేయాలన్నది మా తపన. మత్స్యకారుల జీవన విధానంపై డాక్యుమెంటరీ రూపొందించి స్పెయిన్‌లో ప్రదర్శించి ఎన్నో ప్రశంసలు అందుకున్నాం. టైలరింగ్ వచ్చిన పేద మహిళలకు కుట్టు బాధ్యతలను అప్పగించి పాత చీరలతో సంచులు తయారుచేస్తున్నాం. రూ.అయిదు నాణెం వేస్తే ఈ వస్త్రపు సంచులు బయటకు వచ్చేలా మెషీన్లు ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్‌ని నియంత్రించడానికే ఇదంతా! ఇదే ప్రాజెక్టును డెన్మార్క్‌లోని ఇన్ఫార్సీ రీసైకిల్ రీయూజ్ అనే సంస్థకు వివరిస్తే.. దీన్ని రిసెర్చ్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇంకా మరెన్నో మంచి పనులు చేసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలన్నది మా ఆశయం.
- నాగేంద్ర, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.