లేఖలకు డాక్‌రూం డిజైన్‌ చేసి..

‘అమ్మా.. తాతయ్య ఉత్తరం రాశారు’, ‘నీకు ఉత్తరమొచ్చింది.. చదువుకున్నావా’ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఈ మాటలు వినిపించేవి. ప్రేమికులకు రాయబారం, మైళ్లదూరంలోని కొడుకు సమాచారమైనా ఉత్తరం ద్వారానే మన వాకిట్లో వాలేది.

Published : 08 May 2023 00:15 IST

‘అమ్మా.. తాతయ్య ఉత్తరం రాశారు’, ‘నీకు ఉత్తరమొచ్చింది.. చదువుకున్నావా’ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఈ మాటలు వినిపించేవి. ప్రేమికులకు రాయబారం, మైళ్లదూరంలోని కొడుకు సమాచారమైనా ఉత్తరం ద్వారానే మన వాకిట్లో వాలేది. మరిప్పుడో... కావాల్సిన వారిని ఫోన్‌లో చూస్తూ మాట్లాడుకోవచ్చు. దీంతో ఉత్తరం మరుగున పడింది. కానీ లేఖా రచన వల్ల ఉపయోగాలు తెలిసిన హర్నేమత్‌కౌర్‌, శివానీ మెహతా తిరిగి దీన్ని ఈ తరానికి దగ్గర చేయాలనుకున్నారు. ‘డాక్‌రూం’ పేరుతో సంస్థని స్థాపించి చిన్నారులకు ఉత్తరాలు రాయడమెలాగో నేర్పుతున్నారు. 

ర్నేమత్‌కౌర్‌, శివానీలు అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ)లో చదివేటప్పుడు స్నేహితులయ్యారు. ఉత్తరాలు రాయడమంటే వీరికి మహా ఇష్టం. కానీ ఇప్పటి పిల్లల్లో చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడం గుర్తించారు. ఎలాగైనా లేఖ రాయడంపై వీరందరికీ ఆసక్తి పెంచాలనుకున్నారు. 2013, అక్టోబరు 9, వరల్డ్‌ పోస్ట్‌ డే రోజున తమ కళాశాల ప్రాంగణంలోనే పోస్ట్‌కార్డు స్టాల్‌ ఏర్పాటు చేసి ఉత్తరం గురించి చెప్పారు. తపాలా విభాగం సాయంతో లేఖా రచనపై కార్యక్రమాలనూ ప్రారంభించారు.

పిల్లల్లో...

ఈతరం పిల్లలకి ఫోన్‌ పలకరింపులే తప్ప  పిల్లలకు ఉత్తరమంటే తెలియదంటున్నారీ మిత్రద్వయం. ‘చిన్నతనంలోనే లేఖలు రాయడం నేర్పించాలన్న ఆలోచనతో వారికోసం ‘డాక్‌రూం కార్నివాల్‌’ ప్రాజెక్ట్‌ను డిజైన్‌ చేశాం. హిందీలో డాక్‌ అంటే పోస్ట్‌. పిల్లలతో పలురకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఉత్తరం రాయడమెలాగో శిక్షణ ఇస్తున్నాం. పోటీలు, వర్క్‌షాపులూ ఏర్పాటు చేస్తున్నాం. పోస్ట్‌కార్డు తయారీ నుంచి స్టాంపుల సేకరణ, కాలిగ్రఫీసహా చేతిరాత శాస్త్రం (గ్రాఫాలజీ) అధ్యయనంలోనూ పిల్లలను పాలు పంచుకొనేలా చేస్తున్నాం. ఉత్తరం రాయడంలో తేలిక విధానాలతోపాటు, సందర్భాన్ని బట్టి రాయడమెలాగో చెబుతున్నాం. ఇందులో వాలంటీర్ల సాయాన్ని తీసుకుంటున్నాం. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చేలా ఆహ్వానిస్తున్నాం. ఉత్తరాల వల్ల ప్రయోజనాలు, మానసిక సంతోషం వంటివి పెద్దవాళ్లు తమ అనుభవాలను కలిపి మరీ పిల్లలకు చెబుతున్నారు. ఇది కూడా పిల్లల్లో ఈ అభిరుచిని పెంచుతుందంటున్నా’రు ఈ ఇద్దరూ.

5 లక్షలమంది...

కొందరు బాగా మాట్లాడితే, మరికొందరు తమ భావాలను కాగితంపై అద్భుతంగా పెట్టగలరంటున్నారు శివానీ. ‘అటువంటప్పుడే ఉత్తరం ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్‌ యుగంలో పిల్లల్లో భావోద్వేగాలు లోలోపలే ఉంటున్నాయి. అవన్నీ ప్రతికూల ఆలోచనలుగా మారి కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. మనసును ఉత్తరం రూపంలో పంచుకోవడంలో సానుకూలత అలవడుతుంది. ముఖ్యంగా జీవితంలో వారి సన్నిహితులను వారే ఎంచుకోగలుగుతారు. చేతి రాత మరవనివ్వదు. బహుభాషలు నేర్చుకోవచ్చు. పదాల వినియోగం, వాక్య నిర్మాణం వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలతో అనుసంధానమై, మా బృందాల సాయంతో డాక్‌రూం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలా దాదాపు 5 లక్షలమంది పిల్లలను కలుసుకోగలిగాం. త్వరలో హైదరాబాద్‌, బెంగళూరు, జయపుర, అహ్మదాబాద్‌, కోల్‌కతా వంటి నగరాల్లోనూ ఏర్పాటు చేయనున్నామ’ని చెబుతున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్