...అవి ఆడబిడ్డల్లాంటివి!
మన ఆడబిడ్డ ఇంటికొస్తే ఎంత అపురూపంగా చూసుకుంటాం. సారె..చీరె పెట్టి పంపిస్తాం. తాబేళ్లు కూడా ఆడబిడ్డల్లాంటివే! అవి మన ఊరొస్తే పెట్టకపోయినా పర్వాలేదు.. కొట్టి చంపకండి అంటారు డాక్టర్ సుప్రజ ధారిణి. ట్రీ ఫౌండేషన్‌ని స్థాపించి 33 లక్షల తాబేళ్లకి ఊపిరిపోసిన ఆమె.. వాటిని ఆడబిడ్డలతో ఎందుకు పోల్చారో చెబుతున్నారు...
మన ఆడబిడ్డ ఇంటికొస్తే ఎంత అపురూపంగా చూసుకుంటాం. సారె..చీరె పెట్టి పంపిస్తాం. తాబేళ్లు కూడా ఆడబిడ్డల్లాంటివే! అవి మన ఊరొస్తే పెట్టకపోయినా పర్వాలేదు.. కొట్టి చంపకండి అంటారు డాక్టర్ సుప్రజ ధారిణి. ట్రీ ఫౌండేషన్‌ని స్థాపించి 33 లక్షల తాబేళ్లకి ఊపిరిపోసిన ఆమె.. వాటిని ఆడబిడ్డలతో ఎందుకు పోల్చారో చెబుతున్నారు...
మాది మచిలీపట్నం. మూడు దశాబ్దాల క్రితమే మా పూర్వీకులు చెన్నైలో స్థిరపడ్డారు. జీవితాన్ని లోతుగా తెలుసుకుందామని ఫిలాసఫీలో పీహెచ్‌డీ చేశా. తర్వాత ఆర్ట్స్‌పై ఆసక్తితో చెన్నైలో కళాకృతి పేరుతో ఓ స్టూడియో తెరిచా. అది నడుపుతున్నప్పుడే ఓసారి నీలాంగరై బీచ్‌లో చనిపోయిన పెద్ద తాబేలుని చూశా. అక్కడ మత్స్యకారుల్ని అడిగితే వెటకారంగా నవ్వారు. ఆ ముందుకెళ్తే సముద్రపు ఇసుకలోని తాబేలు గుడ్లను తవ్వితీసి బంతుల్లా ఎగరేస్తూ, వాటితో క్రికెట్ ఆడుతున్నారు. బాధనిపించింది. ఒక్కో తాబేలూ 160 గుడ్లు వరకూ పెట్టినా, జనాల నిర్లక్ష్యం వల్ల అవన్నీ పాడవుతున్నాయి. ఇలా అయితే అవి అంతరించిపోతాయి. వాటిపై ఆధారపడ్డ ఇతర జీవులూ నశించి, జీవవైవిధ్యం దెబ్బతింటుంది. పరిష్కారం కోసం వెతికితే తాబేళ్లపై అవగాహన కల్పించే క్రొకొడైల్ బ్యాంక్ నీలాంగరై సమీపంలో ఉందని తెలుసుకున్నా. స్థానికుల్లో అవగాహన పెంచి వాళ్లని అక్కడికి తీసుకెళ్లా. అనుకున్నట్టుగానే వాళ్లలో మార్పు వచ్చింది. వాళ్లు మరికొందరిని మార్చారు. ఇలా తొలిసారి 5 గ్రామాల్లో యువతను తాబేళ్ల సంరక్షణకు ఒప్పించి.. 2001లో ‘ట్రీ ఫౌండేషన్’ ప్రారంభించా.
వాళ్లే రక్షకులుగా..
ఉదయం స్టూడియో పని. రాత్రి, తెల్లవారుజామున బృందాలతో కలిసి సముద్రతీరాల్లో ఎక్కడ గుడ్ల జాడలు కనిపించినా ఆ చోటుకు వెదురుబొంగులతో రక్షణ ఇచ్చేవాళ్లం. ఏం లాభం? తెల్లారేసరికి అవన్నీ మాయం. మత్స్యకారుల్ని సాయం అడిగితే.. ‘మీకు పనీపాటా లేదా?’అన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి, తాబేళ్ల రక్షణ చేసేవారికి ఐడీకార్డులు, గౌరవ వేతనం ఇప్పించగలిగాం. హాచరీస్‌లను తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించాం. నెల్లూరులోని రామచంద్రాపురం సమీపంలోని కొన్ని కుటుంబాలు తాబేళ్లని తినేవారు. వాళ్లలో మార్పు తీసుకురావడానికి తమిళ మత్స్యకారుల అనుభవాల్ని ఆ గ్రామస్థుల ముందుంచాం. ఈ వివరాల్నీ ఏపీ అటవీశాఖకు నివేదిస్తే వాళ్లూ కూర్మాల రక్షణకి ముందుకొచ్చి, తాబేళ్ల రక్షకులకు ఐడీకార్డులు, గౌరవవేతనాలు మంజూరుచేశారు. ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సముద్రతీరాల్లో మొత్తం 700కి.మీ. తీరంలో హాచరీస్‌ను పెట్టి వీటిని రక్షిస్తున్నాం. చేపల వేటలేని సమయాల్లో మత్స్యకారులు మద్యానికి, పేకాటకు బానిసయ్యేవారు. వారందరికీ దీన్నో ఉపాధిమార్గంగా చూపించాం. ఆయా రాష్ట్రాల అటవీ అధికారులు, మత్స్యశాఖలు, తీర గస్తీ దళాలు, మెరైన్ పోలీసులు, మత్స్యకార కుటుంబాల సహకారంతో ఇప్పటిదాకా 33లక్షల తాబేలు పిల్లల్ని రక్షించి సురక్షితంగా సముద్రంలోకి వదలగలిగా. మా ఫౌండేషన్ తరఫున 363 మంది ‘సముద్ర తాబేళ్ల రక్షణదళం’ సభ్యులున్నారు. 222 మత్స్యకార గ్రామాల్లో 182 హాచరీలు నడుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరుల్లో మడ అడవుల్నీ పెంచుతున్నాం.
సాంకేతికతకు జైకొట్టారు
ఈ క్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి సాయంతో ఆలివ్‌రిడ్లీలకు పరికరాలు అమర్చి శాటిలైట్తో అనుసరించాం. అలా సముద్రంలో వాటి గమనం ఎలా ఉంటుందో తెలిసింది. ఒకప్రాంతంలో పుట్టిన తాబేలు సముద్రంలోకి వెళ్లి.. గుడ్లు పెట్టేందుకు తిరిగి అదే తీరానికి వస్తుంది. ఆడబిడ్డ పుట్టింటికి ఎలా వస్తుందో.. అలా! తాబేళ్లు మన గ్రామ ఆడబిడ్డల్లాంటివని గ్రామాల్లో చాటిచెప్పాను. ఈ పరిశోధనలకు 2009లో యూకే నుంచి విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అవార్డు వచ్చింది. తాబేళ్లు వలల్లో చిక్కుకోకుండా ఊచలు ఏర్పాటు చేసి మూడేళ్లుగా కాపాడుతున్నాం. ఈ సేవలకుగానూ ఇండియా బయోడైవర్సిటీ అవార్డు, డిస్నీ కన్జర్వేషన్ అవార్డు, తమిళనాడులో శక్తి అవార్డులు అందాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన టెడ్‌టాక్స్‌కూ ఆహ్వానం అందింది.
- హిదాయతుల్లాహ్.బి, ఈనాడు, చెన్నై
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.