ఆ రాత్రిని మరవలేను..

మంత్రగత్తెవంటూ.. అవమానించి అమానుషంగా దాడికి పాల్పడితే ప్రాణాలకు తెగించి మైళ్లదూరం పరుగెత్తారామె. అప్పుడామె పేరు చుట్నీ మహతో. రెండు దశాబ్దాల తర్వాత అదే ఊరి జనంతో చుట్నీ దేవిగా ప్రశంసలందుకుంటున్నారు.

Updated : 18 May 2023 04:32 IST

మంత్రగత్తెవంటూ.. అవమానించి అమానుషంగా దాడికి పాల్పడితే ప్రాణాలకు తెగించి మైళ్లదూరం పరుగెత్తారామె. అప్పుడామె పేరు చుట్నీ మహతో. రెండు దశాబ్దాల తర్వాత అదే ఊరి జనంతో చుట్నీ దేవిగా ప్రశంసలందుకుంటున్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు.

చుట్నీ పుట్టింది పేదకుటుంబంలో. ఝార్ఖండ్‌లోని భోలాది గ్రామానికి చెందిన ఈమెకి అక్కడ చాలామందికి మల్లేనే బాల్య వివాహమైంది. రెండు పదుల్లోపే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ గ్రామంలో మంత్రవిద్యలు, మూఢనమ్మకాలూ ఎక్కువ. బంధువులమ్మాయి అనారోగ్యానికి చుట్నీ మంత్రాలే కారణమంటూ ఆరోపించారంతా. భూతవైద్యుడు ధృవీకరిస్తే చుట్నీని నిలదీశారు. తనకే పాపం తెలీదన్నా.. ఎవరూ నమ్మలేదు. రూ.500 అపరాధం చెల్లించమన్నారు గ్రామపెద్దలు.

ఒంటరిగా..

ఊరంతా అవమానిస్తుంటే చేయూతనివ్వాల్సిన భర్త, అత్తమామలు చుట్నీని దూరం పెట్టారు. మరుసటి రోజు (1995, సెప్టెంబరు 4వ తేదీ) కూడా ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో.. ఆ రాత్రి గ్రామస్తులు మూకుమ్మడిగా చుట్నీని ఇంట్లోంచి బయటకు లాగారు. ‘నాపై దాడి చేశారు. తూలనాడారు. చంపడానికీ ప్రయత్నించారు. ఒంటరిని చేసి దాడి చేయడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఆ రాత్రిని జీవితంలో మరవలేను. అక్కడే ఉంటే చంపేస్తారని అర్థమైంది. అడుగేయడానికి శక్తి లేకపోయినా పిల్లలను బతికించుకోవడం కోసం పరుగు ప్రారంభించా. ముగ్గురు పిల్లలతో మైళ్ల దూరం ప్రయాణించా’ అంటుందామె.

నీడ కోసం..

ఊరి నుంచి బయటకొచ్చిన చుట్నీ ప్రాణాలు అరచేతపెట్టుకొని నదిని దాటింది. ‘మొదట బంధువులింటికి వెళ్లాను. వాళ్లు నీడనివ్వలేమన్నారు. అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పుట్టింటికి వెళ్లాను.. కానీ నావల్ల వారికి ప్రమాదం జరగకూడదనుకున్నా.. అయితే చేతిలో పిల్లలతో ఎక్కడికెళ్లాలో తెలియక అక్కడే ఉండిపోయా. కొద్ది రోజులకే అమ్మ చనిపోయింది. దాంతో గ్రామశివారులో ఓ చెట్టు కింద చిన్న గుడిసె వేసుకుని పిల్లలతో ఉన్నా. కూలిపనులు చేసి పిల్లలను పోషించేదాన్ని. నెలలు గడిచాయి. నా సమస్యకు పరిష్కారం కోసం ‘ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ కమిటీ’ సభ్యులను కలిశా. అక్కడ మీడియా వల్ల బయటి ప్రపంచానికి నా గురించి తెలిసింది. నా జీవితాన్ని నేషనల్‌ జాగ్రఫిక్‌ ఛానెల్‌లో డాక్యుమెంటరీ చేశారు. సోషల్‌ అండ్‌ హ్యూమన్‌ అవేర్‌నెస్‌ ఎన్జీవో వాళ్లు వచ్చి నన్ను ప్రచారానికి తీసుకెళ్లడంతో బయటి ప్రపంచం తెలిసింది. మంత్రగత్తెల పేరుతో హత్యలకు గురవుతున్న, లేనిపోని ఆరోపణలతో ఊరి నుంచి వెలికి గురవుతున్న నాలాంటివారు చాలా మందే ఉన్నారని గుర్తించా. ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాలనుకున్నా. సామాజిక మార్పు వచ్చినప్పుడే నాలాంటి వారు అందరిలా జీవించగలరని అర్థమైంది. చట్టపరంగానూ పరిష్కరణకు ప్రయత్నించా. ఎన్జీవో సహకారంతో గ్రామాలన్నీ తిరిగి నాలాంటివారిని గుర్తించి వారి వద్ద ఫిర్యాదులు తీసుకొనేదాన్ని. చట్టపరమైన రక్షణే కాకుండా వారికి స్వయం ఉపాధి శిక్షణ అందేలా కృషి చేశా. కౌన్సెలింగ్‌తో పాటు ఆశా పునరావాస కేంద్రాన్ని ప్రారంభించి నీడను కల్పించా. ఇప్పటివరకు 500మందికి పైగా స్త్రీలకు రక్షణ కల్పించా. ఈ ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది’ అంటూ చెబుతున్న చుట్నీ మహతోను ఇప్పుడంతా చుట్నీ దేవి అని పిలుస్తున్నారు. తన సేవకుగాను 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారీమె. చుట్నీ జీవితచరిత్రను బాలీవుడ్‌లో ‘కాలా సచ్‌’ (ది డార్క్‌ ట్రూత్‌) చిత్రంగా మలచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని