చిరుతను చూసి..డిజైన్‌ చేశా!

ప్రకృతి అందాలు.. శిల్పి సృజనాత్మకత.. చిరుత చురుకుదనం.. ఇవీ రామకృప అనంతన్‌కు స్ఫూర్తి. అలాగని ఆవిడ శిల్పో, చిత్రకారిణో కాదు.. వాహనాల డిజైనర్‌! దేశంలో తొలి మహిళా డిజైన్‌ చీఫ్‌ ఆవిడ! యువతను కట్టిపడేసిన మహీంద్ర థార్‌, ఎక్స్‌యూవీ 700 ఆమె సృజనాత్మకతకు ప్రతిరూపాలే!

Updated : 04 Jun 2023 07:59 IST

ప్రకృతి అందాలు.. శిల్పి సృజనాత్మకత.. చిరుత చురుకుదనం.. ఇవీ రామకృప అనంతన్‌కు స్ఫూర్తి. అలాగని ఆవిడ శిల్పో, చిత్రకారిణో కాదు.. వాహనాల డిజైనర్‌! దేశంలో తొలి మహిళా డిజైన్‌ చీఫ్‌ ఆవిడ! యువతను కట్టిపడేసిన మహీంద్ర థార్‌, ఎక్స్‌యూవీ 700 ఆమె సృజనాత్మకతకు ప్రతిరూపాలే! ఆటోమొబైల్‌ రంగానికీ, ప్రకృతికీ సంబంధమేంటని సందేహమా? ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.. రండి!

ట్రెక్కింగ్‌, పురాతన కట్టడాల సందర్శన, ఆలయాల్లో శిల్పకళను పరిశీలించడం నా అభిరుచులు. చిన్నప్పట్నుంచీ ఏటా ఏదోక ప్రాంతాన్ని చుట్టిరావడం అలవాటు. మాది తమిళనాడులోని మధురై. అక్కడి మీనాక్షి అమ్మవారి ఆలయం ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే తోస్తుంది. వెయ్యికాళ్ల మండపంలో ప్రతి స్తంభమూ ఓ కళాఖండమే. వేల ఏళ్లనాటి ఆ రాతి శిల్పాల్లో వస్త్రాలు, ఆభరణాలు చెక్కిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ట్రెక్కింగ్‌ చేసేటప్పుడు ప్రకృతి వర్ణాలు, వన్యమృగాలను పరిశీలించడం నా ఇష్టమైన వ్యాపకం. వీటన్నింటినీ కారు డిజైనింగ్‌లో ఉపయోగిస్తుంటా. ఆటోమొబైల్‌ రంగంలో అడుగు పెట్టాలనేది చిన్నప్పటి కల. బిట్స్‌- పిలానీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఐడీసీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌, ఐఐటీ- ముంబయి నుంచి డిజైనింగ్‌ కోర్సులు చేశా. 1997లో మహీంద్రా అండ్‌ మహీంద్రాలో చేరి.. బొలెరో, స్కార్పియో వంటి కార్లకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేశా. కారు ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండాలి.. చూడగానే మనసు దోచేయాలి.. అనేవి సూత్రాలుగా పెట్టుకున్నా.

నూతన శకానికి..

ఆటోమొబైల్‌ డిజైనర్‌లో ఓ కళాకారుడు ఉండాలి. అప్పుడే అభిరుచి, సృజనాత్మకతలను మేళవించగలం, వినియోగదారుడిని ఆకట్టుకోగలమని నమ్ముతాన్నేను. అందుకే నింగిలో మారే రంగులే నేను డిజైన్‌ చేసే వాహనాల వర్ణాలవుతాయి. శిల్పి సృజనాత్మకత, చిరుత వేగం, చురుకైన దాని కళ్లు.. వంటివన్నీ నా డిజైన్లలో ప్రతిఫలిస్తాయి. హెడ్‌ లైట్లు, హ్యాండిల్స్‌, వెనుక టెయిల్‌ సహా అన్నింటికీ చిరుతను స్ఫూర్తిగా తీసుకుంటా. అవే నాకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. 2019 నుంచి రెండేళ్లపాటు మహీంద్రాలో చీఫ్‌ డిజైనర్‌గా సేవలందించి, దేశంలోనే తొలి మహిళా డిజైన్‌ చీఫ్‌నయ్యా. 2021లో బయటికొచ్చి సొంతంగా ‘క్రక్స్‌ స్టూడియో’ ప్రారంభించా. ఆటోమొబైల్‌ పరిశ్రమలో నూతన శకాన్ని ఆవిష్కరించాలన్నది నా లక్ష్యం. అందుకే మైక్రో-మొబిలిటీ విధానంలో ‘టీడబ్ల్యూఓ2’ వాహనాలను డిజైన్‌ చేశా. ఆటోమొబైల్‌ పరిశ్రమలోని వృథానే వీటికి ఆధారం. ప్రస్తుతం వీటిని అభివృద్ధి చేసే పనిలో ఉన్నా. ఓలా ఎలక్ట్రిక్‌లో హెడ్‌ ఆఫ్‌ డిజైనర్‌గానూ చేస్తున్నా. నేను డిజైన్‌ చేస్తున్న ఎలక్ట్రిక్‌ కారు, బైకు త్వరలో మార్కెట్‌లోకి విడుదలవనున్నాయి. తాము తక్కువన్న భావనతో అమ్మాయిలు కొత్త ప్రయత్నానికి జంకుతారు. ఇంట్లో చూపే భేదభావమూ దానికి కారణమే! వాటిని పక్కనపెట్టి మీ ప్రత్యేకతను గుర్తించండి. ఆ దారిలో సవాళ్లెన్ని ఎదురైనా ధైర్యంగా సాగండి. ఏ అడ్డంకులూ మిమ్మల్ని ఆపలేవు.


ఆ దారులే.. తెలిపాయి

మొదటిసారి వాహనాన్ని డిజైన్‌ చేసే అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా చేసి, నిరూపించుకోవాలనుకున్నా. ఎన్నో ఆలోచనలు చేశా. మహీంద్రా సంస్థ కూడా యువత ఏం కోరుకుంటోందన్న దానిపై సర్వే నిర్వహించింది. అది తెలిసి, నేనూ భాగస్వామిని అవుతానన్నా. అందులో భాగంగానే పర్వత ప్రాంతాలకు ఎలాంటి వాహనాలు అనువైనవో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలనిపించింది. అక్కడి రోడ్డు మార్గాన్ని పరిశీలించడానికి మనాలి నుంచి శ్రీనగర్‌కు దాదాపు 15 గంటలు బజాజ్‌ అవెంజర్‌ బైకుపై ప్రయాణించా. ఆ అనుభవం అలాంటి ప్రాంతాల్లో ఏవిధమైన కారు అనువైనదో తెలుసుకునేలా చేసింది. అలా మొదలైన నా మొదటి ప్రాజెక్టుకు నాలుగేళ్లు పట్టింది. వందల డిజైన్లు, 20 మంది బృందంతో రాత్రనకా పగలనకా కష్టపడి 2011లో ఎక్స్‌యూవీ 500 డిజైన్‌ చేశా. మార్కెట్‌లో అదో హిట్‌ డిజైన్‌గా నిలిచింది. ఆ తర్వాత చేసిన మహీంద్ర బొలెరో నియో, ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 700లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వచ్చింది. ‘థార్‌’ విజయంతో గుర్తింపూ తెచ్చుకున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్