ఇంతా చదివి..ఇదేం పనన్నారు?
పదహారేళ్లప్పుడు తండ్రి చనిపోతే తల్లి అండతో చదువుకున్నారు. వ్యాపారం ప్రారంభించిన ఆరునెల్లకే భర్త దూరమైతే స్వశక్తినే నమ్ముకొని మరో ఇరవై కుటుంబాలకి అండగా నిలిచారు. చీరలపై ప్రింటింగ్ చేస్తూ ఆ రంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు 57 ఏళ్ల మంజులారాణి..
పదహారేళ్లప్పుడు తండ్రి చనిపోతే తల్లి అండతో చదువుకున్నారు. వ్యాపారం ప్రారంభించిన ఆరునెల్లకే భర్త దూరమైతే స్వశక్తినే నమ్ముకొని మరో ఇరవై కుటుంబాలకి అండగా నిలిచారు. చీరలపై ప్రింటింగ్ చేస్తూ ఆ రంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు 57 ఏళ్ల మంజులారాణి..
మాది గుంటూరు జిల్లా కొండపాటూరులోని వ్యవసాయ కుటుంబం. నాన్న పమిడి వెంకట్రావు. అమ్మ అరుణాదేవి. మేం ఐదుగురు సంతానం. ఓ రోజు హఠాత్తుగా గుండెపోటుతో నాన్న చనిపోయారు. అప్పటికి నాకు పదహారేళ్లు. అమ్మే కష్టపడి.. మా అయిదుగుర్నీ డిగ్రీ వరకూ చదివించింది. నేను బీఎల్, ఎమ్మే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాక పెదగొట్టిపాడుకు చెందిన గుంటుపల్లి వీరయ్య చౌదరితో వివాహమైంది. వాళ్లది విద్యావేత్తల కుటుంబం. అందరికీ మంచి విద్యను అందించాలని మావారు.. అత్తగారి పేరిట పుష్ప పబ్లిక్ స్కూలు నడిపేవారు. నాలుగేళ్లు నడిపాక కొన్ని కారణాల వల్ల విద్యా సంస్థను మూసేసి 1992లో హైదరాబాద్ వచ్చాం. అక్కడ మావారు ఇన్సూరెన్స్ సర్వేయర్‌గా పని చేసేవారు. నేను స్థానిక పాఠశాలలో టీచరుగా చేసేదాన్ని. నాకు స్క్రీన్, బ్లాక్, బాతిక్, కలంకారీ ప్రింట్ చేసిన నేత చీరలంటే ఇష్టం. కాటన్ చీరలపై ఎంబ్రాయిడరీ, జర్దోసీ పనులు, మిర్రర్, థ్రెడ్ వర్క్‌లను ఇష్టంగా చేయించుకునేదాన్ని. అవిచూసి తోటి ఉపాధ్యాయినులంతా ముచ్చటపడేవారు. మాకూ అలాంటి చీరలు కొనుక్కురమ్మనేవారు. దాంతో భారతీయత ఉట్టిపడే సంప్రదాయ, కళాత్మక చీరలు తయారు చేయించాలనే కోరిక కలిగింది. మావారితో అంటే... ‘ఇంత చదువుకుని చీరల వ్యాపారమా?’ అన్నారు. ఆయన ఉత్సాహం చూపించలేదు. కానీ నా ఆసక్తిని కాదనలేకపోయారు.
రూ.30వేల పెట్టుబడితో...
‘ఎంప్రెస్’ పేరుతో ఈసీఐఎల్‌లో 2002లో బొటిక్ తెరిచా. రూ.30వేల పెట్టుబడి. సూరత్, కోల్‌కతా, కోయంబత్తూరు, చీరాల నుంచి ముడిసరకు తెప్పించి స్థానిక కళాకారులతో జర్దోసీ పని చేయించేదాన్ని. టైలర్లను కూడా నియమించుకుని వినియోగదారులకు నచ్చినట్టుగా కుట్టించడంతో మంచి పేరొచ్చింది. దుకాణం ప్రారంభించిన ఆర్నెల్లకే వ్యాపారం పుంజుకుంటే చాలా సంతోషించా. అది కాస్తా.. మావారు హఠాత్తుగా కామెర్లతో చనిపోవడంతో ఆవిరైపోయింది. అప్పటికి బాబుకి పదకొండేళ్లు. బాధను గుండెల్లో దాచుకుని బొటిక్ కొనసాగించా. పెళ్లి, శుభకార్యాలకు పెద్దఎత్తున ఆర్డర్లు వచ్చేవి. ఆ సమయంలో తీరిక ఉండేది కాదు. 2011లో డైయింగ్, ప్రింటింగ్ యూనిట్‌ను అమ్ముతామంటూ ఒకరు సంప్రదించారు. అందులో శిక్షణ ఇస్తానంటే కొంటానని షరతు పెట్టి కొనుగోలు చేశా. అలా ‘సాయి ముద్రిక డిజైనర్స్’ ప్రారంభించా. వాళ్లు పది రోజులు ట్రైనింగిచ్చి వెళ్లి పోయారు. దాంతో మరింత నైపుణ్యం కోసం చేనేత భవన్‌లో సంప్రదించి ట్రైనర్‌ను తీసుకొచ్చి మా సిబ్బందికి మళ్లీ శిక్షణ ఇచ్చా. కానీ రంగుల వల్ల ఇళ్లు అద్దెకిచ్చిన వాళ్లు పదేపదే ఖాళీ చేయించేవాళ్లు. ప్రస్తుతం చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్‌టైల్ పార్కులో ఓ షెడ్డు అద్దెకు తీసుకుని యూనిట్‌ని కొనసాగిస్తున్నా. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ స్క్రీన్, బ్లాక్, బాతిక్ ప్రింట్, టై అండ్ డైలతో చీరలు, డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తున్నాం. మధ్యలో వెన్నునొప్పి బాధిస్తే శస్త్రచికిత్స చేయించుకున్నా. కొవిడ్ సమయంలోనూ నష్టాల బారిన పడ్డా. అవన్నీ దాటుకుని ప్రస్తుతం రోజుకి 150 వరకూ చీరలు తయారుచేస్తున్నాం. వీటిని హోల్‌సేల్ వ్యాపారులు, ఇళ్లలో చీరలు అమ్ముకొనేవారు వచ్చి కొనుక్కువెళ్తుంటారు. ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నాం. మా అబ్బాయి ఎంబీయే చదివి తోడుగా ఉంటున్నాడు. గత సంవత్సరం రూ.కోటి పైగా టర్నోవర్ జరిగింది. వ్యాపారంలో లాభాల కన్నా ఇరవై కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాననేదే ఎక్కువ సంతృప్తినిస్తూ ఉంటుంది. సహజరంగులు అద్దిన వస్త్రాలని విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికతో ఉన్నాం.
సూరపల్లి రఘుపతి, యాదాద్రి భువనగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.