అమెరికాలో ఆకలి తీరుస్తున్నారు...

చాలామంది జీవితాలు వృద్ధాప్యంలో నీరసంగా, నిస్పృహగా గడుస్తాయి. కానీ ఆ జంట అలా పేలవంగా జీవించదలచలేదు. ఇద్దరూ అమెరికాలో ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసి రిటైరయ్యారు. ఆ తర్వాత జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు సేవాబాట పట్టారు.  

Published : 06 Jun 2023 00:08 IST

చాలామంది జీవితాలు వృద్ధాప్యంలో నీరసంగా, నిస్పృహగా గడుస్తాయి. కానీ ఆ జంట అలా పేలవంగా జీవించదలచలేదు. ఇద్దరూ అమెరికాలో ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసి రిటైరయ్యారు. ఆ తర్వాత జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు సేవాబాట పట్టారు. పేదల కడుపు నింపుతూ మరెందరికో ప్రేరణ కలిగిస్తున్నారు.

రాజ్‌ రిటైరైన రోజున టెక్సాస్‌, ప్లానో మేయర్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ సంభాషణలో పరిసర ప్రాంతాలైన ప్లానో, కోలిన్‌ గ్రామాల్లో స్కూలు పిల్లలకు వారాంతంలో తిండి దొరకడంలేదని, అక్కడే కాదు, అమెరికాలో సుమారు 12 శాతం మంది ఆహార భద్రత లేక బాధపడుతున్నారని తెలిసి అల్లాడిపోయాడు. ఆ విషయాలు పంచుకోగా.. భార్య అన్నా (ఆరాధన) కూడా తల్లడిల్లిపోయింది. అంతే వాళ్లకి తమ లక్ష్యం ఏమిటో అర్థమైంది. కొడుకులిద్దరూ స్థిరపడటంతో వారికిప్పుడు బాధ్యతలేం లేవు. లబ్ధి పొందిన అక్కడి సమాజానికి తాము తిరిగివ్వాలనే సంకల్పానికి ఓ రూపం కల్పించేందుకు లోతుగా అధ్యయనం చేశారు. అన్ని లెక్కలూ రాశారు. ప్రణాళిక రచించుకున్నారు. శక్తియుక్తులు వినియోగించారు. పరిచయస్తులను సంప్రదించారు. యంత్రాంగాన్ని సమకూర్చారు. ఆర్థిక వనరులు విస్తృతం చేశారు.

ఉత్తర టెక్సాస్‌లో స్కూలుకెళ్లే ప్రతి నలుగురిలో ఒకరింట్లో క్షుద్బాధ అనుభవిస్తున్నవారే. ఎక్కువమంది స్కూళ్లలో ఉచితంగా లేదా తక్కువ రేటుకు దొరికే ఆహారం తిని బతుకుతున్నారు. వారాంతాల్లో స్కూల్లేక అభోజనంగానే ఉంటున్నారు. వాళ్లకెలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఉత్తర టెక్సాస్‌ ఫుడ్‌బ్యాంక్‌ పేదలకు ఒక డాలర్‌కే 3 పోషకాహార పొట్లాలను అందిస్తోందని తెలిసి, ఆరాధన, రాజ్‌ మద్దతు అందించారు. వాళ్లు ఆర్ద్రతతో కదిలిపోయి స్వచ్ఛందంగా పనిచేస్తున్నా, ఆకలి ఎంత భయానకమో స్థానికంగా ఎవరికీ పెద్దగా పట్టలేదు. అందుకే ఈ సమస్య పట్ల అవగాహన కలిగించడానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకోసం రోజంతా ప్రయాణిస్తూనే ఉంటారు. సేవలో పాలుపంచుకోమని, మన చుట్టుపక్కల ఎవరూ ఆకలితో ఉండకుండా చూడమని- చాటిచెబుతూ ఉంటారు. అంతా కలిసి కృషిచేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందని 2018 అక్టోబర్‌లో ‘హంగర్‌ మిటావో’ ఆరంభించారు. అది అంకురించిన ఐదేళ్లకే న్యూయార్క్‌, అట్లాంటా, మిచిగాన్‌ లాంటి భారతీయులు ఎక్కువగా ఉండే అనేక నగరాలకు విస్తరించింది. మానవతను పెంచి ఆకలిని నిర్మూలిస్తోంది. ఆ సంస్థ ఎంత గొప్ప ప్రాచుర్యం పొందిందంటే.. దాని ద్వారా ఇప్పటివరకు 5 కోట్లకు పైగా భోజనాలను ఫుడ్‌బ్యాంకులకు అందజేశారు. ‘మా కార్పొరేట్‌ ఉద్యోగాలు ప్రతిదానికీ ప్రణాళిక రచించి నేర్పుగా నిర్వహించుకోవడం నేర్పాయి. ఆ శిక్షణ వల్లే ఇదంతా చేయగలిగాం. స్థానికంగా ఫుడ్‌బ్యాంకులను పెంచడం, ప్రవాస భారతీయులుండే ప్రదేశాల్లో ఫుడ్‌ డ్రైవ్‌లు నిర్వహించడం, విరాళాలు సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. మొత్తం ఇండియన్‌ అమెరికన్‌ వర్గాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. లక్షల డాలర్లు సేకరించాం. ఏటా టన్నుల కొద్దీ ఆహారాన్ని వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా కూడా దానం చేస్తున్నారు. వేల గంటలు స్వచ్ఛంద సేవకు వినియోగిస్తున్నారు. మా ప్రేరణతో ఇతర దేశాలవారూ ముందు కొస్తున్నారు’ అంటూ తమ సేవాప్రయాణాన్ని క్లుప్తంగా వివరించారు ఆరాధన. ‘నేర్చుకోవడం, సంపాదించడం, తిరిగి ఇవ్వడం- ఈ మూడే జీవితానికి సార్థకతను తెచ్చిపెడతాయని నమ్మే ఈ జంట.. తమ సేవలకు గుర్తింపుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చేతుల మీదుగా జీవనసాఫల్య పురస్కారాన్నీ అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని