ఇన్‌స్టంట్‌ వంటలతో విజయబావుటా

అమ్మానాన్నలు ఉద్యోగమే లక్ష్యం అన్నారు. ఆమెకది సుతరామూ ఇష్టంలేదు. వ్యాపారం దిశగా అడుగులేసింది. అలసట ఆమె నిఘంటువులో లేదు. ముళ్లూ రాళ్లకు జంకలేదు.

Updated : 08 Jun 2023 04:10 IST

అమ్మానాన్నలు ఉద్యోగమే లక్ష్యం అన్నారు. ఆమెకది సుతరామూ ఇష్టంలేదు. వ్యాపారం దిశగా అడుగులేసింది. అలసట ఆమె నిఘంటువులో లేదు. ముళ్లూ రాళ్లకు జంకలేదు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ దూసుకుపోతోంది. అలా మైళ్లదూరం ప్రయాణించింది. ‘మీల్సుమ్‌’ పేరుతో ఆహార సంస్థను నెలకొల్పి ఎందరో స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తోన్న అజిత స్ఫూర్తి కథనం ఆమె మాటల్లోనే...

‘మాది భోపాల్‌. అమ్మానాన్నలు ప్రభుత్వోద్యోగులు. అన్ని మధ్యతరగతి కుటుంబాల్లాగే మావాళ్లు కూడా నాకు గవర్నమెంట్‌ ఉద్యోగం వస్తే జీవితం భద్రంగా ఉంటుందనుకున్నారు. వాళ్ల తర్ఫీదుతో డిగ్రీ కాగానే ఉద్యోగం వెతుక్కోవాలని తెలిసినా వ్యాపారంమీద మనసు పారేసుకున్నా. తొమ్మిదో తరగతిలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో చదివిన సంపాదకీయం అందుకు కారణం. ‘విమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌’ అవార్డుకు ఎంపికైన లిజ్జత్‌ పాపడ్స్‌ జస్వంతిబెన్‌, బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తదితరుల కథనాలు నామీద ఎంతగానో ప్రభావం చూపాయి.

ఇలా వ్యాపారం గురించి కలలు కంటుండగానే పెళ్లయిపోయింది. ఏం చేయాలో స్పష్టత లేనందున ట్రాన్‌స్క్రిప్షన్‌ శిక్షణకు వెళ్లాను. ఆ తర్వాత ‘మేవిల్‌’ పేరుతో మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌ ఆరంభించాలనుకున్నా, దానికైతే ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని. అందులో నైపుణ్యం సాధిస్తే అమెరికాలో ఉద్యోగాలు లభిస్తాయి కనుక చాలామంది మక్కువతో చేరేవారు. ‘మేవిల్‌’ సేవలు అలా మొదలయ్యాయి. ఇంటి నుంచి పనిచేసే పద్ధతి మన దగ్గర ప్రాచుర్యంలో లేని రోజుల్లోనే స్త్రీలకు ఆ అవకాశం కల్పించాను. ఆ వెసులుబాటుతో అంకితభావంతో పనిచేసే వాళ్లు. కొన్నాళ్లకి మా పక్కింట్లో కర్ణాటక సంగీత విద్వాంసుడు విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసి నేనే ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఆరంభించాను. ఇంట్లోంచే నేర్చుకునే సదవకాశం కావడంతో ఎక్కడెక్కడివాళ్లో ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. అయినా, నా ప్రయాణమంతా సాఫీగా ఏమీ సాగలేదు. ఎదురుదెబ్బలూ తగిలాయి. భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఆపేయడంతో సంస్థను మూసేయాల్సి వచ్చింది. అయినా నేనేమీ కుంగిపోలేదు. మరో లక్ష్యంపై గురిపెట్టాను. ఈ కాలంలో రెడీమేడ్‌ వంటలు ఎంత అవసరమో గుర్తించి ‘మీల్సుమ్‌’ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో కొత్త వెంచర్‌ మొదలుపెట్టాను. తీరిక, ఓపిక లేని పట్టణవాసులకు ఇన్‌స్టంట్‌ కర్రీమిక్స్‌లూ, సైడ్‌డిష్‌లూ అందిస్తున్నాం. ఇంటి భోజనం కరవైందనే నిరుత్సాహం లేకుండా క్షణాల్లో చేసుకోవచ్చు. ఇందులో సౌఖ్యం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పోషక విలువలు ఉండేలా చూస్తున్నాం. కొబ్బరిపచ్చడితో మొదలై సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, కుర్మా.. ఇలా ఎన్నో అందిస్తున్నాం. కస్టమర్లను నిరాశపరచొద్దనేదే నా ధ్యేయం. దానికి తగ్గట్టుగా కూరలూ, పచ్చళ్లలో ఎప్పటికప్పుడు అనేక వెరైటీలు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని మరింత వృద్ధిచేసి, దేశ విదేశాల్లో అసంఖ్యాక రుచులు అందించాలని ఉంది. మనమీద మనకు నమ్మకం ఉంటే ఆశలను వదులుకోనవసరం లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది’ అంటోన్న అజితా నాయర్‌ అతి కొద్ది పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి విజయవంతంగా పయనిస్తున్నారు. మరెందరో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. భోపాల్‌ శివారు గ్రామంలోని ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో అత్యధిక ఉద్యోగులు మహిళలే. వీటితో పాటు సంప్రదాయ పిండివంటలు, పచ్చళ్ల తయారీ నేర్పించే కార్యక్రమమూ చేపట్టారామె. ఇందులో పాల్గొనే మహిళలకు సగర్వంగా నిలబడి, ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించేలా తర్ఫీదిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని