కూలీలక్కడ విద్యావంతులవుతున్నారు...
ఉద్యోగబాధ్యతల తర్వాత గిరిజన మహిళలకు చేయూతనివ్వాలనుకుంది ఓ మహిళాబృందం. ఆ ఆశయమే ‘కమలి ట్రైబ్స్’ సేవాసంస్థగా మారింది. చదువుకోవాలనే కలను వీడి, ఉపాధి కోసం కూలీగా మారే యువతుల ఆశయాలను బతికిస్తోంది.
ఉద్యోగబాధ్యతల తర్వాత గిరిజన మహిళలకు చేయూతనివ్వాలనుకుంది ఓ మహిళాబృందం. ఆ ఆశయమే ‘కమలి ట్రైబ్స్’ సేవాసంస్థగా మారింది. చదువుకోవాలనే కలను వీడి, ఉపాధి కోసం కూలీగా మారే యువతుల ఆశయాలను బతికిస్తోంది. పేదరికంలో మగ్గుతున్న వేల మంది గిరిజన మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆ మహిళాబృందం స్ఫూర్తి కథనం ఇదీ...
రిచా ఖేర్వాడకు టీచర్ అవ్వాలని కల. రాళ్లు పగలగొట్టే చోట తండ్రి కూలీగా పనిచేసేవాడు. చదువుకొని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్న రిచాకు పదో తరగతిలోనే అనుకోని అవాంతరమెదురైంది. తీవ్ర అనారోగ్యానికి గురై తండ్రి మంచాన పడ్డాడు. దీంతో రిచా చదువు మానేసి కూలీగా మారింది. అప్పుడే తనకు ‘కమలి ట్రైబ్స్’ గురించి తెలిసింది. హస్తకళల్లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలుసుకొంది. 18 ఏళ్ల పూర్ణిమది కూడా ఇలాంటి కథే. తల్లిదండ్రుల సంపాదన కుటుంబానికి సరిపోక, చదువుకు దూరమైందీమె. ఉన్నతవిద్యాభ్యాస కలను పక్కనపెట్టి, కూలీ అయ్యింది. ఇలా చదువు మానేసి కూలీలుగా మారుతున్న మహిళలెందరికో చేయూతనిస్తోంది ‘కమలి ట్రైబ్స్’.
బృందంగా ఏర్పడి..
గిరిజన మహిళల సామాజికాభివృద్ధి కోసం తమవంతు సేవనందించాలనుకున్నారు కొందరు వదాన్యులు. వారే సరళ ముంద్ర, డాక్టర్ రాధిక, క్రాంతి మాధుర్, కుసుం బోర్డియా, శ్యామల వెర్డియా, విమలా ముంద్ర, సరోజ్‌బాప్నా. వీరంతా వివిధ వృత్తులు, వ్యాపారాల్లో రెండు దశాబ్దాలకుపైగా అనుభవజ్ఞులు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ గిరిజనప్రాంతంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్, వైద్యసేవలు, విద్య వంటివి అందించడంలో సేవలందిస్తున్న ‘రాజస్థాన్ వనవాసీ కల్యాణ్ పరిషద్ (ఆర్వీకేపీ)’ అనే ఎన్జీవోతో ఏడేళ్లక్రితం చేయి కలిపి, ‘కమలి ట్రైబ్స్’ ప్రారంభించారు. ఈ మహిళా బృందం చేయూతతో ఉదయ్‌పుర్ చుట్టుపక్కల భిల్, సహారియా, మీనా, గరాసియాస్, దామోర్ వంటి ప్రాంతాల్లో వెయ్యిమందికిపైగా మహిళలిప్పుడు ఆర్థికంగా నిలబడ్డారు. రిచా, పావెల్ వంటి యువతులు ఇక్కడ పని చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసాన్నీ.. పూర్తి చేస్తున్నారు. నచ్చిన రంగాల్లో అడుగు పెడుతున్నారు.
వర్క్‌షాపులతో..
ఫైన్‌ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేసిన సరళా ముంద్ర చీఫ్ డిజైనర్‌గా కమలి ట్రైబ్స్‌లో మహిళలకు పలురకాల హస్తకళల్లో శిక్షణనిస్తున్నారు. ‘కాగితాలతో బొమ్మలు, కవర్ల తయారీ, మట్టి పాత్రలపై పెయింటింగ్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, పోట్లీ బ్యాగులు కుట్టడం, కుషన్ కవర్లపై ఎంబ్రాయిడరీ, పూసల ఆభరణాలు వంటి 65రకాల ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తాం. వీరికందరికీ ముడిసరకును ఇప్పించడమే కాకుండా 15 మందిని ఒక బృందంగా చేసి దానికి వారిలోనే ఒకరిని నేతృత్వం వహించేలా శిక్షణనిస్తాం. అలా ప్రతి బృందాన్ని ఆ హెడ్ పర్యవేక్షిస్తుంటారు. తయారీ నుంచి మార్కెటింగ్ వరకు కావాల్సిన నైపుణ్యాలు అందిస్తున్నాం. పలు ప్రాంతాల్లో వర్క్‌షాపులు నిర్వహించి కాంతా, క్రాస్ స్టిచ్ తదితర ఎంబ్రాయిడరీల్లో శిక్షణనిస్తున్నాం. కమలి ట్రైబ్స్ ద్వారా ప్రతి మహిళ నెలకు కనీసం రూ.5 నుంచి రూ.10వేల ఆదాయాన్ని అందుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. చదువుపై ఆసక్తి ఉన్నవారు ఇందులో పనిచేస్తూనే ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఉత్పత్తులన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నాం. కమలి ట్రైబ్స్ వార్షికాదాయం రూ.50 లక్షలు. అలాగే కొత్తట్రెండ్ డిజైన్స్ కోసం నిఫ్ట్ డిజైనర్స్‌తో కలిసి పనిచేస్తూ, వాటిని గిరిజన మహిళలకు నేర్పుతున్నాం. ఈ సంస్థ ద్వారా మరెందరికో ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం’ అంటున్నారు సరళాముంద్ర.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.