వయసు కాదు.. అందం పెరుగుతోంది!

హీరోయిన్ల హవా కొన్నేళ్లే! పెళ్లయ్యి, పిల్లలు పుట్టాక తెర మరుగయ్యేవారే ఎక్కువ. కొందరు మాత్రం చాలా విరామం తర్వాత తిరిగి కెరియర్‌ ప్రారంభిస్తున్నారు. అలాంటివారే వీళ్లూ!

Updated : 11 Jun 2023 08:34 IST

హీరోయిన్ల హవా కొన్నేళ్లే! పెళ్లయ్యి, పిల్లలు పుట్టాక తెర మరుగయ్యేవారే ఎక్కువ. కొందరు మాత్రం చాలా విరామం తర్వాత తిరిగి కెరియర్‌ ప్రారంభిస్తున్నారు. అలాంటివారే వీళ్లూ! తేడా అల్లా.. మునుపటి కంటే మరింత అందంగా తయారవ్వడమే కాదు.. ‘యువ నటీమణులకు పోటీనిస్తున్నార’న్న కితాబునీ అందుకుంటున్నారు. ఇంతకీ వాళ్ల రహస్యాలేంటో.. అడిగేద్దాం రండి!


నెగెటివిటీకి దూరం..

2001లో మలయాళ సినిమాతో కెరియర్‌ ప్రారంభించింది మీరా జాస్మిన్‌. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో రాణించింది. జాతీయ పురస్కారాన్నీ అందుకున్న ఆమె 2014లో పెళ్లయ్యాక సినిమాలకు దూరమైంది. తర్వాత బాగా లావైన మీరాను చూసి అందరూ అవాక్కయ్యారు. అలాంటిది గతఏడాది ఇన్‌స్టాలోకి అడుగుపెట్టి.. తన రూపంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్నగా అవడమే కాదు.. చాలా అందంగా తయారైన ఆమెను చూసి రహస్యమేంటని ప్రశ్నించడం మొదలు పెట్టారు నెటిజన్లు. దానికి ‘యోగాతో పాటు పిలాటస్‌ నాలో మార్పుకి కారణం. రోజూ ఇంట్లో వ్యాయామం చేస్తా. కాసేపు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు.. మొక్కల మధ్య పరుగు తీస్తా. దీంతో మనసుకీ ఆరోగ్యం. పోషకభరిత ఆహారానికే ప్రాధాన్యమిస్తా. నెగెటివిటీకి దూరంగా ఉంటా. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటే అందమూ అనుసరిస్తుంది’ అనే మీరా గతఏడాది మలయాళ సినిమాతో తిరిగి నటన ప్రారంభించి తాజాగా ‘విమానం’తో తెలుగు ప్రేక్షకులనీ పలకరించింది. ఓటీటీ, తమిళ అవకాశాలనూ చేజిక్కించుకున్న 41 ఏళ్ల మీరా.. అతి తక్కువ కాలంలోనే 8.5 లక్షలకిపైగా ఫాలోయర్లనూ సంపాదించుకుంది.


నవ్వే బలం..

‘లాఫింగ్‌ క్వీన్‌, సొట్టబుగ్గల సుందరి’గా లైలాకి పేరు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి ‘తెర’పై మెరిసింది. అరగేట్రం హిందీలో చేసినా.. దక్షిణాదినే గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాణిస్తున్న సమయంలోనే 2006లో పెళ్లి చేసుకొని సినీరంగానికి దూరమైంది. వదంతి, సర్దార్‌ సినిమాలతో తిరిగి రంగప్రవేశం చేసింది. 42 ఏళ్ల లైలాను చూసిన వారంతా ‘అప్పుడు.. ఇప్పుడు మీ అందంలో ఏ మార్పూ లేదు. అదెలా సాధ్య’మని అడిగే వారే! దానికామె ‘అందమంటే పైపూతల ద్వారానే వస్తుందనుకుంటారు చాలామంది. లోపలి నుంచీ రావాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటా. రోజూ వ్యాయామం తప్పనిసరి. నీటిని ఎక్కువగా తాగుతా. ముఖ్యంగా ఎప్పుడూ ఆనందంగా ఉంటా. పెదవి మీద చిరునవ్వు చెరగనీయను. మనసు ఆనందంగా ఉంటే ఎప్పుడూ యవ్వనంగా ఉంటాం. ఇంకా... ముఖంపై రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వేటినీ పెట్ట’నని చెబుతోంది. తనతోపాటు తోటివారినీ ఆనందంగా ఉంచడమూ లైలాకి ఇష్టమట. చుట్టూ వాతావరణం సంతోషంగా ఉంటే ప్రశాంత జీవనమూ సాధ్యమంటోంది.


సహజత్వానికి ప్రాధాన్యం..

మహారాష్ట్ర రాజవంశీకురాలు. సంప్రదాయ కుటుంబం. అయినా పట్టుబట్టి సినీరంగంలోకి అడుగుపెట్టింది భాగ్యశ్రీ. 20 ఏళ్లకే స్టార్‌డమ్‌.. దేశవ్యాప్త గుర్తింపు వచ్చినా నటనకు స్వస్తిచెప్పి కుటుంబానికే ప్రాధాన్యమిచ్చింది. గుర్తింపొచ్చింది ‘మైనే ప్యార్‌కియా’తోనైనా తెలుగు, కన్నడ, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ సినిమాలు, సీరియళ్లలో నటించింది. తాజాగా తలైవి, రాధేశ్యామ్‌లతో తిరిగి వెండితెర ప్రయాణం ప్రారంభించింది. 54ఏళ్లు.. ఇద్దరు పిల్లల తల్లంటే నమ్మలేని అందం ఆమె సొంతం. ‘కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా చేయి నొప్పి. వైద్యులేమో సర్జరీ తప్పనిసరి అన్నారు. ప్రత్యామ్నాయాల కోసం వెదికే క్రమంలో న్యూట్రిషన్‌, ఫిట్‌నెస్‌లపై దృష్టిపెట్టా. కోర్సులూ చేశా. వైద్యులనే ఆశ్చర్యపరుస్తూ కోలుకున్నా. ఖరీదైన ఉత్పత్తులతోనే అందం సాధ్యమనుకుంటారు కానీ.. ఇంట్లో దొరికే పాలు, తేనె, కలబంద, పెరుగు వంటివాటితోనూ అందంగా ఉండొచ్చు. దానికి తాజా కూరగాయలు, కొంచెం వ్యాయామాన్నీ జోడించండి. నిత్య యవ్వనం సాధ్యమే’ననే భాగ్యశ్రీ ఇన్‌స్టా వేదికగా తన అందం, ఆరోగ్య చిట్కాలను పంచుకుంటుంది. వాటికీ అభిమానులెక్కువే. దాదాపు 20 లక్షలమంది ఆమెను అనుసరిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్