వందల ఏళ్ల నేత కళలకుప్రాణం పోస్తున్నారు

కళలు సంస్కృతికి ప్రతిబింబాలు. అలాంటి అద్భుత కళా రూపాల్లో చేనేత కూడా ఒకటి. మగువల మనసు దోచుకునే ఈ పనితనం వెనుక ఎంతో చరిత్ర దాగుంది. మరెన్నో కథలనూ తనలో ఇముడ్చుకుంది. దాన్నే వెలికి తీయాలనుకున్నారు ఫ్యాబ్రిక్‌ స్పెషలిస్ట్‌ హేమలత.

Published : 16 Jun 2023 06:17 IST

కళలు సంస్కృతికి ప్రతిబింబాలు. అలాంటి అద్భుత కళా రూపాల్లో చేనేత కూడా ఒకటి. మగువల మనసు దోచుకునే ఈ పనితనం వెనుక ఎంతో చరిత్ర దాగుంది. మరెన్నో కథలనూ తనలో ఇముడ్చుకుంది. దాన్నే వెలికి తీయాలనుకున్నారు ఫ్యాబ్రిక్‌ స్పెషలిస్ట్‌ హేమలత. ‘పునరుజ్జీవన ట్రస్ట్‌’ని స్థాపించి అరుదైన నేత పనితనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

‘భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రతి కళకూ చరిత్ర ఉంటుంది. ఇందులో చీర ఓ సంప్రదాయం’ అంటారు హేమలత. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆమెకు సంప్రదాయాలన్నా, కళారూపాలన్నా ఎనలేని మక్కువ. అదే ఆమెను కర్ణాటకలోని పురాతన నేత కళ పునరుద్ధరణపై దృష్టి సారించేలా చేసింది. యూఎస్‌లోని కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో పనిచేసి 2014లో భారత్‌కి తిరిగి వచ్చారావిడ. చేనేత కళలపై ఆసక్తితో ‘ఫ్యాబ్రిక్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌’లో డాక్టరేట్‌ చేశారు. ఆ సమయంలో చేనేత గ్రామాల్లోని నేత కార్మికులతో మాట్లాడినప్పుడు... ఎంతో మంది నేతన్నలు వృత్తిని వదిలేసిన తీరూ, ఎన్నెన్నో కళారూపాలూ, నైపుణ్యాలూ మరుగున పడిపోతున్న వైనం ఆమెను కదిలించాయి. ఆ తర్వాతే... కళాకారులు, స్థానిక చేతి వృత్తి నిపుణులకు చేయూతనిస్తూ, అవసాన దశకు చేరుకున్న నేత నైపుణ్యాలకు ఆదరణ కల్పించాలనుకున్నారు. దాని కోసమే ‘పునరుజ్జీవన ట్రస్ట్‌’ని ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని చేనేత కార్మికులు, కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు.

శిక్షణా ఇస్తున్నారు...

జీఐ ట్యాగ్‌ ఉన్న మైసూరు సిల్క్‌, సంప్రదాయ ఇల్కల్‌ వంటి చేనేత వస్త్ర రకాలకు దక్షిణాది రాష్ట్రాల్లో గొప్ప పేరు. అయితే, అవి అందరికీ అందుబాటులో లేవని తెలుసుకున్నారు హేమ. పురాతన చీరల శైలులూ, పనితనం వంటి వాటి గురించి విచారిస్తుంటే... 250 ఏళ్ల నాటి ‘పట్టెడ అంచు’ చీర ప్రాధాన్యత తెలిసింది. ఇది గజేంద్రగఢ్‌, బెల్గాం, రాయచూర్‌, కోడల్‌, బీదర్‌, బళ్లారి, గుల్బర్గా, ధార్వాడ్‌ ప్రాంతాలలో బాగా ప్రసిద్ధి చెందింది. చీర అంచుతోనే విశిష్ట లక్షణాన్ని ప్రోది చేసుకున్న ఈ పనితనానికి మళ్లీ పేరు తేవాలనుకున్నారు. అలానే ‘సుధా కడి, గోమితేని, హుబ్లీ చీర’ వంటివెన్నో శైలులు వెలుగులోకి వచ్చాయి. పవర్‌ లూమ్‌ పై చేయి సాధించడంతో... వీటిని నేసే నేతన్నల సంఖ్య తగ్గిపోయింది. వారిని అతికష్టం మీద వెతికి పట్టుకున్నారు హేమ. మరో 20 రకాల పురాతన చేనేత పద్ధతుల్లోనూ నేసే పనిలో పడ్డారు. ఇందుకోసం నిపుణులైన పనివారూ, నూలు వడికేవారు, రంగులద్దే వారు, ఎంబ్రాయిడరీలు చేసే వారు, క్విల్టర్స్‌, బ్లాక్‌ ప్రింటర్స్‌... వంటి కళాకారులందరినీ ఈ వేదికపైకి తెచ్చి ఆ ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తున్నారు.  తర్వాతి తరం వారికి ఈ కళల్ని పరిచయమూ చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో నాబార్డు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఔత్సాహికులకు వీవింగ్‌ టెక్నిక్స్‌నూ నేర్పిస్తున్నారు.

ఇబ్బందులెన్నో...

ప్రాభవం కోల్పోతోన్న చేనేత చీరలకు వైభవం తీసుకు రావడం అంత సులువైన పనేమీ కాదు. ఎందరో చేనేత కార్మికులు పని దొరక్క వృత్తిని వదిలేశారు. తిరిగి వారిని ఆ వృత్తిలో కొనసాగేలా చేయడానికి చాలా కాలమే పట్టిందామెకు. తరచూ చేనేత చీరలతో వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఆధునిక తరాలను ఆకట్టుకోవడం కోసం శతాబ్దాల నాటి చీరలకు ఫ్యాషన్‌ టచ్‌ ఇస్తున్నారు. తాజాగా భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం స్వర్ణోత్సవ వేడుకలో 37 మంది సీనియర్‌ శాస్త్రవేత్తలు వీటిని ధరించి వేదికపై సందడి చేయడంతో మరోసారి ఈ ట్రస్ట్‌ పేరు, హేమ కృషి వార్తల్లో నిలిచాయి. ఇద్దరితో ఆరంభమైన వీరి ప్రయాణంలో 55 మంది నేతన్నలూ, 20 మంది రంగులద్దే కార్మికులూ తోడయ్యారు. వందల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఎగుమతులతో కోట్ల రూపాయల టర్నోవర్‌నీ అందుకుంటోంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా అంతరించి పోయాయనుకున్న నైపుణ్యాలను కాపాడగలగడం ఎక్కువ తృప్తిని ఇస్తోందంటారు హేమ.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని