ఆ మారథాన్ అంత ఈజీ కాదు!
పైన.. బుర్రని గిర్రుమనిపించే దక్షిణాఫ్రికా మండుటెండలు. కింద.. పాదాలకు కఠినంగా తగిలే కొండలోయబాటలు. ప్రపంచంలోనే అత్యంత పురాతన కామ్రేడ్స్ మారథాన్‌లో పాల్గొనడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. వేలమంది పాల్గొన్నా లక్ష్యాన్ని చేరేది కొందరే.
పైన.. బుర్రని గిర్రుమనిపించే దక్షిణాఫ్రికా మండుటెండలు. కింద.. పాదాలకు కఠినంగా తగిలే కొండలోయబాటలు. ప్రపంచంలోనే అత్యంత పురాతన కామ్రేడ్స్ మారథాన్‌లో పాల్గొనడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. వేలమంది పాల్గొన్నా లక్ష్యాన్ని చేరేది కొందరే. విశాఖపట్నానికి చెందిన 46 ఏళ్లు మాధురి పల్లి ఈ మారథాన్‌ని పూర్తిచేసి ఈ విశేషాలని మనతో పంచుకున్నారు..
దక్షిణాఫ్రికాలో ఏటా నిర్వహించే కామ్రేడ్స్ మారథాన్‌లో పాల్గొనాలంటే ఎంత గొప్ప మారథాన్ రన్నర్ అయినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కారణం అదంత కష్టమైంది. పన్నెండు గంటల సమయంలో 88.47 కిలోమీటర్ల దూరం.. మండుటెండలో ఎక్కడా విరామం లేకుండా పరుగెట్టాలి. కొండలూ, ఎత్తుపల్లాలు..ఒంపులు తిరిగిన మార్గమిది. ఇలాంటి మారథాన్ నా లక్ష్యమెలా అయ్యిందో చెబుతా. మాది వైజాగ్. నాన్న ఆర్మీలో పనిచేసేవారు. చిన్నతనం నుంచీ ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఎక్కువే. ఎంబీబీఎస్, పీజీ చేసేటప్పుడూ నడక, యోగాని వదల్లేదు. ఆ తర్వాత మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియోలజిస్ట్‌గా చేరా. డాక్టర్ సురేంద్రకుమార్‌తో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు. కుటుంబ బాధ్యతలు మొదలయ్యాక వ్యాయామాలకు దూరమయ్యా.
పరుగు కోసం సొసైటీ.. తిరిగి ఫిట్‌నెస్ కోసమని జిమ్‌లో చేరా. కాస్త ఆత్మవిశ్వాసం రాగానే నా 37వ ఏట వైజాగ్‌లో 5 కి.మీ నేవీ మారథాన్‌లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచా. నమ్మకం రావడంతో.. అక్కడ నుంచి 25, 50 కి.మీ మారథాన్‌లకు వెళ్లి మొదటి రెండు స్థానాల్లో ఉండేదాన్ని. కానీ చాలామందిలో పరుగుపై పెద్దగా ఆసక్తి లేకపోవడం గమనించి 2021లో ‘వైజాగ్ రన్నర్స్ సొసైటీ’ స్థాపించా. మొదట్లో 45 మంది ఉండే ఈ సొసైటీలో ప్రస్తుతం 500మందికిపైగా సభ్యులున్నారు.
అర్హత సాధించి.. దక్షిణాఫ్రికాలో జరిగే ప్రతిష్ఠాత్మక కామ్రేడ్స్ మారథాన్‌నే అల్టిమేట్ హ్యూమన్ రేస్ అనీ పిలుస్తారు. దీనిలో పాల్గొనాలంటే చాలా శిక్షణ ఉండాలన్నారు తెలిసిన వాళ్లు. ఎంత ఫిట్‌గా ఉన్నా మొదట్లో చిన్న పరుగుకే కాళ్లు నొప్పెట్టేవి. దాంతో శిక్షణ అవసరమని కోచింగ్‌లో చేరా. అర్హత సాధించడానికి క్వాలిఫై రన్స్‌లో పాల్గొనాలి. 50 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయంలోపు పూర్తిచేయాలి. వైజాగ్‌లో ప్రయత్నించి విఫలం అయ్యా. కోల్‌కతాలో మరోసారి ప్రయత్నించి విజయం సాధించా.
శిక్షణతో.. ఈ మారథాన్ శిక్షణలో భాగంగా.. 6వారాలపాటు వేగం తక్కువగా, దూరం ఎక్కువగా పరుగుపెట్టా. ఆ తర్వాత వేగం పెంచి, దూరాన్ని తగ్గించా. నెమ్మదిగా వేగం, దూరం రెండూ పెంచా. ఆపై కొండల్లో మిట్ట మధ్యాహ్నం సాధన చేసి 12 గంటల మారథాన్‌ను 10.25 గంటల్లోనే పూర్తిచేయగలిగా. మొత్తం 27 వేలమంది పాల్గొన్న ఈ రేసులో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా దేశాల నుంచీ పాల్గొన్నారు. మనదేశం నుంచి నలభైమంది మహిళలు పాల్గొంటే 20 మంది మాత్రమే రేసుని పూర్తిచేయగలిగారు.
ఫిట్‌నెస్ రహస్యం.. దిల్లీలో ఒక మారథాన్ కోసం సాధనెక్కువ చేస్తే.. తీరా ఆ రోజు కాళ్లు కదల్లేని పరిస్థితి. మారథాన్ పూర్తిచేసినా, అయిదారునెలలు ఇంటికే పరిమితం అయ్యా. అందుకే గాయాలైతే విశ్రాంతి తప్పనిసరి. వేకువజామున 4 గంటలకే నిద్రలేచి రన్నింగ్, వర్కవుట్లు, పూజ, వంట పూర్తిచేసి విధులకెళతా. త్వరగా నిద్రపోతా. మా పాప కోవైలో ఇంజినీరింగ్ చేస్తోంది. బాబు ఇంటర్. వాళ్లూ నన్ను చూసి స్ఫూర్తి పొందుతుంటారు.
పరుగువల్ల అధిక బరువు, హృద్రోగ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 40 ఏళ్లపైబడిన మహిళల్లో కండరాలు బలహీనపడితే ఎముకలపై ఆ ప్రభావం పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.