అడవికే అమ్మ!

‘చిన్నీ.. రాజూ.. పాలు తాగారా’.. అన్న పిలుపుతో ఆ పసి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె కూడా అంతే.. ఏళ్లుగా పిల్లలను వదిలిన తల్లిలా వాటిని తడిమి మరీ చూసుకుంటారు. ఇంతకీ ఆమె ఆ ప్రేమ కురిపించేది ఎవరిపై అనుకుంటున్నారు? ఒక్క వేటుతో మనుషులను చంపే చిరుతలు, వన్య మృగాలు. తల్లిలేని చిరుత కూనలను కన్నబిడ్డలుగా సాకుతోంది సావిత్రమ్మ. ఆమె ప్రేమను చూసే అనాథ చిరుత పిల్లలను అధికారులు ఆమె సంరక్షణకే వదిలేస్తుంటారు.

Updated : 27 Jun 2023 04:42 IST

‘చిన్నీ.. రాజూ.. పాలు తాగారా’.. అన్న పిలుపుతో ఆ పసి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె కూడా అంతే.. ఏళ్లుగా పిల్లలను వదిలిన తల్లిలా వాటిని తడిమి మరీ చూసుకుంటారు. ఇంతకీ ఆమె ఆ ప్రేమ కురిపించేది ఎవరిపై అనుకుంటున్నారు? ఒక్క వేటుతో మనుషులను చంపే చిరుతలు, వన్య మృగాలు. తల్లిలేని చిరుత కూనలను కన్నబిడ్డలుగా సాకుతోంది సావిత్రమ్మ. ఆమె ప్రేమను చూసే అనాథ చిరుత పిల్లలను అధికారులు ఆమె సంరక్షణకే వదిలేస్తుంటారు. అనుకోకుండా ఈ పనిలో చేరినామె ఇంత పేరెలా తెచ్చుకున్నారో వసుంధరతో పంచుకున్నారిలా...

ల్లి చనిపోయిన, వదిలెళ్లిన వన్యమృగాల పసికూనలు పసి పిల్లల్లాంటివే! నెమ్మదిగా పాలు అలవాటు చేయాలి. ఓపికతో లాలించాలి. అందుకే అవీ నా కన్నబిడ్డల్లాంటివే. మాది కర్ణాటకలోని బన్నేరుఘట్ట. మావారు జంతు ప్రదర్శనశాలలో కాపలాదారుగా చేసేవారు. 2000లో అనారోగ్యంతో చనిపోయారు. ఇద్దరు చిన్నపిల్లలు.. నాకేమో ఇల్లు తప్ప మరోలోకం తెలియదు. స్కూల్లో చేర్చడం కాదుకదా.. తిండీ పెట్టలేని పరిస్థితి. అప్పుడు మావారి అన్నయ్య ఆదుకున్నారు. జంతు ప్రదర్శనశాల వాళ్లు ఆర్థికసాయం చేయబోతే నాకు ఉద్యోగం వచ్చేలా చూశారు. అక్కడ పర్యవేక్షకురాలిగా చేరా. రెండేళ్లు గడిచాయి. అంతా సజావుగా సాగుతోందనుకుంటే మరో కుదుపు. మాకు అండగా ఉన్న బావగారూ చనిపోయారు. దీంతో వాళ్లబ్బాయి బాధ్యతనీ నేనే తీసుకున్నా. ఈలోగా నాకు బన్నేరుఘట్ట జంతు సంరక్షణశాలకి బదిలీ అయ్యింది.

పిలుపు వింటే..

కేర్‌టేకర్‌ పని.. నాకేమో దాని గురించే తెలీదు.. అధికారికి అదే చెబితే.. ‘మీ పిల్లల్ని చూసుకుంటావు కదా.. ఇదీ అంతే!’ అన్నారు. చనిపోయిన, తల్లి నుంచి విడిపోయిన క్రూరమృగాల పిల్లలను మా వద్దకి పంపిస్తారు. వాటి సంరక్షణ నా పని. ఆయన చెప్పడంవల్లో ఏమో.. ఆ కూనలూ నాకు పసిపిల్లల్లానే కనిపించేవి. అందుకే కన్నా, బుజ్జీ అంటూ ముద్దు చేస్తుంటా. వీటిని పెంచడం అంత సులువేమీ కాదు. ప్రతి అరగంటకీ పాలు పట్టాలి. అవేమీ ముట్టుకోవు. బలవంతంగా పట్టిస్తే వాటి ప్రాణానికే ప్రమాదం. ఒళ్లో పడుకోబెట్టుకొని, శరీరాన్ని నిమురుతూ జాగ్రత్తగా తాగిస్తుంటా. నిపుణుల సూచనలూ గుర్తుంచుకోవాలి. క్రమంగా మాంసం అలవాటు చేయాలి. అలా ఓ కూనను ఆరునెలల నుంచి ఏడాది వరకు పెంచి సఫారీకి తరలిస్తాం. పెంపుడు జంతువులే కాదు.. వన్యమృగాలూ ప్రేమ, విశ్వాసాన్ని చూపిస్తాయి. నా గొంతు వినడం ఆలస్యం.. చుట్టూ చేరతాయి. అందుకే అవి ఆహారానికి అలవాటైతే ఎంత ఆనందంగా ఉంటుందో.. వాటిని సఫారీలకు తరలిస్తోంటే బిడ్డ దూరమైనంత బాధతో కన్నీరు ఉబుకుతుంది. నాకే కాదు.. వాటిదీ అలాంటి పరిస్థితే! ఓసారి చిరుతను సఫారీకి తరలిస్తే.. రోజులు తరబడి తిండే ముట్టలేదు. కంగారుపడిన అధికారులు ఫోన్‌ చేశారు. స్పీకర్‌ ఆన్‌చేయమని చెప్పి ‘చిన్నీ.. తిన్నావా’ అంటూ మాట్లాడా. వెంటనే తినేసింది. ఇలా కొద్దిరోజులు చేశాక కానీ అలవాటు పడలేదు. ఈ 22 ఏళ్లలో ఇలాంటి సంఘటనలెన్నో చూశా. ఇప్పటివరకు వందల్లో చిరుతలు, పులులు, సింహాలు, పక్షులు, జింకలను సంరక్షించి సఫారీకి తరలించాం. 8మంది బృందానికి ప్రధాన పర్యవేక్షకురాలిగా ఉన్నా.

ఏళ్ల అనుబంధం..

వన్య మృగాల శైలి భిన్నంగా ఉంటుంది. వీటి గోళ్లు, పళ్లకు పదునెక్కువ. నేను వాటి బోనులోకి వెళ్లడం ఆలస్యం చుట్టేసుకుంటాయి. లాలన కోరుతూ గీరడం, కొరకడం చేస్తాయి. బయటి వ్యక్తులొస్తే ఒక్కోసారి కోపంతోనూ దాడి చేస్తుంటాయి. అప్పుడేం అనిపించదు కానీ.. పడుకున్నాక మంట, నొప్పి మొదలవుతాయి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇది చూసి నువ్విక విశ్రాంతి తీసుకోవచ్చుగా అంటారు. ఏళ్ల అనుబంధం.. అవీ నా పిల్లలే! వదలాలంటే మనసొప్పదు. ‘సావిత్రమ్మ చూసుకుంటుంద’ని ధైర్యంగా ఆ కూనలను ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికే తీసుకొస్తుంటారు. అలా ఎన్నో జీవాలకు అమ్మనవుతున్నానన్న సంతృప్తి.. ఇంతకన్నా ఇంకేం కావాలి?

-కె.ముకుంద, బెంగళూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని