వ్యర్థాలతో ప్యాచ్‌ వర్క్‌ చేస్తాం..

కుంబయాని మధ్యప్రదేశ్‌లోని నీమ్‌ఖేడ్‌ గ్రామ ప్రజలు  దేవాలయంలా భావిస్తారు. మహిళలను ఆర్థిక కష్టాలు, లైంగిక వేధింపుల నుంచి రక్షించిన సామాజిక భవనమిది. దీన్ని ప్రారంభించింది నివేదితా బెనర్జీ.

Updated : 28 Jun 2023 02:24 IST

కుంబయాని మధ్యప్రదేశ్‌లోని నీమ్‌ఖేడ్‌ గ్రామ ప్రజలు  దేవాలయంలా భావిస్తారు. మహిళలను ఆర్థిక కష్టాలు, లైంగిక వేధింపుల నుంచి రక్షించిన సామాజిక భవనమిది. దీన్ని ప్రారంభించింది నివేదితా బెనర్జీ. వేల మంది గిరిజన మహిళల జీవనోపాధికి కారణమయిన నివేదిత మనోగతమిది..

మాది దేవాస్‌ జిల్లా. దిల్లీ జేఎన్‌టీయూలో చదువుకున్నా. విద్యార్థినిగా ఉన్నప్పుడే మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేదాన్ని. చదువు పూర్తై బయటికి వచ్చాకా.. 20 మంది స్నేహితులం కలిసి సామాజ్‌ ప్రగతి సహయోగ్‌ను (ఎస్‌పిఎస్‌) స్థాపించాం. ‘నర్మదా బచావో’ ఉద్యమం జరుగుతున్న రోజులవి. నీటి నిల్వలు, నదుల సంరక్షణ వంటి వాటిపై ఊరూరా తిరిగి ప్రచారం చేసే వాళ్లం. ఆ క్రమంలోనే నీమ్‌ఖేడ్‌ను సందర్శించాం. అక్కడ మహిళల దుస్థితి చూసి నిద్ర పట్టలేదు. ఇంటికి వెళ్లినా అదే ఆలోచన. వాళ్లకు పనులు లేవు. కూలికి వెళ్తే యజమానులు అసభ్యంగా ప్రవర్తించేవారు. అన్నిటిని ఓర్చుకుని రోజంతా కష్టపడితే రూ.14 కూలీ. వ్యసనాలకు బానిసలై మద్యం కోసం ఆడవారిని అంగట్లో అమ్మడానికీ సిద్ధమైన మగ వారిని చూశా.

ఉపాధి చూపించాలని

మహిళలను ఆ దుస్థితి నుంచి బయట పడేయాలనుకున్నా. ఏం చేయాలి. నేనేం చేయగలను..? ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఒక రోజు కొంతమంది మా ఇంటికి వచ్చారు. పాత, చినిగి పోయిన బట్టలను ఉపయోగించి ప్యాచ్‌వర్క్‌తో కుట్టిన కుషన్లు, బెడ్‌షీట్లు చూపించారు. వారికి ఒక కుట్టు మెషిన్‌ ఇప్పించమని కోరారు. అప్పుడే ఒక ఆలోచన తట్టింది. దీన్నే వ్యాపారంగా మలచి వారికి ఒక దారి చూపించాలని. అనుకున్నదే తడవుగా మూడు మెషిన్లను అద్దెకు తీసుకున్నాను. దిల్లీలో నా స్నేహితుల దగ్గర నుంచి వస్త్రాలు, దారాలు రప్పించాను. మూడు నెలలు శిక్షణ ఇచ్చాం. నలుగురు కాస్తా 20 మందిగా మారారు.

రాళ్లతో కొట్టారు

పేదరికం, ఆకలి బాధలు ఉన్నా ఆడవారు బయటికి వచ్చి పనిచేయడానికి చాలా మంది ఒప్పుకోలేదు. వాళ్లని మేం తప్పు దోవ పట్టిస్తున్నామంటూ మాపై దాడులకు దిగారు. రాళ్లతో కొట్టారు. వారందరికీ అర్థమయ్యేట్లు చెప్పేవాళ్లం. వీరు చేస్తున్న పనిపట్ల అవగాహన కల్పించాం. మూడు నెలల శ్రమ తర్వాత ప్యాచ్‌వర్క్‌తో తీర్చిదిద్దిన ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. మంచి స్పందన వచ్చింది. తెలిసిన వారి సాయంతో అమెరికాకూ ఎగుమతులు ప్రారంభించాం. కుంబయాలో పనిచేసిన మహిళలకు రోజుకు రూ.100 వేతనం వచ్చేది. వీళ్లనే ఉదాహరణగా చూపిస్తూ అవగాహన కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు 100 గ్రామాల ప్రజలు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. సంవత్సరంలో 300 రోజులు ఇక్కడ పనిని కల్పిస్తున్నాం. ఎంత పని చేస్తే అంత ఆదాయం. ప్యాచ్‌వర్క్‌తో డ్రెస్‌లూ డిజైన్‌ చేస్తున్నాం. వస్త్రాల వ్యర్థాలు లేకుండా ప్రతిదీ ఇక్కడ వినియోగిస్తాం. వాటితోనూ దుస్తులు కుట్టడం మా సంస్థ ప్రత్యేకత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని