పసుపు సంచితో.. మార్పు తెస్తున్నారు!

మనవైపు.. ‘ఏంటి ఎర్ర బస్సు ఎక్కొచ్చావా?’ అనడం వినే ఉంటారు. తమిళనాడులో అయితే ‘ఏంటి పసుపు సంచి చంకన పెట్టుకొచ్చావా?’ అంటారు. అక్కడి సంస్కృతిలో పసుపు సంచి ఒక భాగం. మధ్యలో.. ప్లాస్టిక్‌ ప్రభావంతో కనుమరుగైన ఆ పాత ఆచారాన్ని తిరిగి వాడుకలోకి తీసుకొస్తున్నారు తమిళ మహిళలు.

Updated : 29 Jun 2023 03:32 IST

మనవైపు.. ‘ఏంటి ఎర్ర బస్సు ఎక్కొచ్చావా?’ అనడం వినే ఉంటారు. తమిళనాడులో అయితే ‘ఏంటి పసుపు సంచి చంకన పెట్టుకొచ్చావా?’ అంటారు. అక్కడి సంస్కృతిలో పసుపు సంచి ఒక భాగం. మధ్యలో.. ప్లాస్టిక్‌ ప్రభావంతో కనుమరుగైన ఆ పాత ఆచారాన్ని తిరిగి వాడుకలోకి తీసుకొస్తున్నారు తమిళ మహిళలు. వందలమందికి మహిళలకు ఉపాధిమార్గంగా మారిన ‘మంజాపై’ ఉద్యమం గురించి తెలుసుకుందాం..

‘మీండుం మంజాపై’ (మళ్లీ పసుపు సంచి)తమిళనాడులో ఎక్కడ చూసినా ఈ ప్రచారమే ఇప్పుడు. చెన్నైలో రద్దీగా ఉండే కోయంబేడు మార్కెట్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకూ ఎక్కడకెళ్లినా ఓ పెద్ద పసుపు సంచీ కనిపిస్తుంది. అది వెండింగ్‌ మెషిన్‌. దానిలో ఓ పదిరూపాయలు వేస్తే చక్కని కాటన్‌ సంచి చేతికొస్తుంది. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని వాడుతున్నారు అక్కడి ప్రజలు. అవును మరి.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలినే స్వయంగా పసుపు సంచి చేత పట్టుకుని ప్రచారం చేస్తోంటే ప్రజలు అనుసరించకుండా ఉంటారా? ఇంతకీ ఈ పాత ఆచారాన్ని తిరిగి వాడుకలోకి తీసుకొచ్చిన గొప్పతనం ఎవరిదో తెలుసా? ఐఏఎస్‌ అధికారి సుప్రియ సాహుది. ఆమె చొరవతోనే ఈ పసుపు సంచీ ఉద్యమం ఊపందుకుంది. ‘మా ఇంట్లో పెద్దవాళ్లు ఈ సంచి లేకుండా బయటకు వెళ్లేవారు కాదు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల నుంచి.. నగలు కొనడానికైనా సరే ఇది ఉండాల్సిందే. బ్యాక్టీరియా ఉండకూడదని పసుపులో నానబెట్టి తయారు చేసేవారు. ప్లాస్టిక్‌ కారణంగా ఈ సంస్కృతి కాస్తా కనుమరుగైంది. కానీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించాక ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట మొదలైంది. ఆ దిశగా ఆలోచించినప్పుడే చిన్నప్పుడు నేను చూసిన ఈ పసుపు సంచులు గుర్తుకొచ్చాయి’ అంటారు ఆ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ విభాగ కార్యదర్శిగా పనిచేస్తున్న సుప్రియ సాహు. ‘నీలగిరి పర్వత ప్రాంత ప్రజలు 20 ఏళ్లుగా ప్లాస్టిక్‌ని దూరం పెట్టారు. ఈ మార్పు ప్రభుత్వ నిబంధనల వల్ల విజయవంతం కాలేదు.. వాళ్లు మనస్ఫూర్తిగా అనుకున్నారు కాబట్టి అయ్యింది. అందుకే ప్రజలకు ఇష్టమైన పసుపు సంచీ ద్వారానే ఈ మార్పుని తేవాలనుకుంటున్నా’ అనే సుప్రియ జిల్లాలవారీగా పర్యటిస్తూ.. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. 30 మంది ప్రత్యేక బృందంతో ప్లాస్టిక్‌ తయారీ సంస్థల నుంచి ఒక్క ఏడాదిలోనే 1700 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారామె. భవిష్యత్‌ తరాలకి ఈ విషయంపై అవగాహన తెస్తూ ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా పోరాడేందుకు 3వేలకు పైగా విద్యార్థి బృందాలను తయారు చేశారు. 


మూడు కోట్ల వ్యాపారంతో...

ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని చేతి సంచుల తయారీని ఓ ఉద్యమంగా నడుపుతున్నారు మదురైకి చెందిన గౌరి. ‘నా చిన్నప్పుడు మదురైలో ఎక్కడ చూసినా ఈ పసుపు సంచులే ఉండేవి. వాటిని కుట్టే మహిళలకు చేతినిండా పని ఉండేది. ప్లాస్టిక్‌ పుణ్యమాని కాలుష్యం పెరిగింది. మహిళలకు ఉపాధి కరవైంది. తిరిగి చేతి సంచికి పూర్వ వైభవం తీసుకురావాలని మావారు కృష్ణన్‌ సుబ్రమణియన్‌తో కలిసి 2014లో ఎల్లో బ్యాగ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించాం. పెద్దపెద్ద సంస్థలకే కాదు... చిన్నచిన్న పార్టీలకీ మేం చేతి సంచులను కావాల్సిన విధంగా తయారుచేసి ఇస్తాం. 250 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. రోజుకి మూడువేల బ్యాగులు తయారుచేయగలం. చాలామంది సంచులను డై చేసి ఇమ్మని అడుగుతారు. అలా చేస్తే నీటి వాడకం చాలా ఎక్కువ అవుతుంది. అలా కాదని.. లోగోలని మాత్రం ప్రింట్‌ చేస్తున్నాం. ప్రస్తుతం మా టర్నోవర్‌ రూ.మూడుకోట్ల వరకూ ఉంది. ఈ డబ్బులో కొంత భాగం మా దగ్గర పనిచేసే పిల్లల్ని చదివించడానికి ఉపయోగిస్తున్నాం’ అంటున్నారు గౌరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని