పాఠశాల ప్రాంగణం వ్యవసాయ క్షేత్రమైంది...

అక్కడ అడుగుపెట్టినప్పుడు స్కూల్‌లా అనిపించదు. పిల్లలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఓ మంచి కుటుంబంలా ఉంటుంది. ఆ స్కూల్‌ డైరెక్టర్‌ను చూస్తే.. చిన్నారులకు నైపుణ్యాలను అందించే తల్లిలా అనిపిస్తారు.

Updated : 01 Jul 2023 05:12 IST

అక్కడ అడుగుపెట్టినప్పుడు స్కూల్‌లా అనిపించదు. పిల్లలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఓ మంచి కుటుంబంలా ఉంటుంది. ఆ స్కూల్‌ డైరెక్టర్‌ను చూస్తే.. చిన్నారులకు నైపుణ్యాలను అందించే తల్లిలా అనిపిస్తారు. వ్యవసాయాన్ని పరిచయం చేసి విద్యార్థులకు చదువుతో పాటు పలు నైపుణ్యాలనూ పరిచయం చేస్తున్నారీమె. బెంగళూరులోని విశ్వ విద్యపీఠ్‌ పాఠశాల నిర్వహణతో విద్యార్థులను నవ సమాజాన్ని నిర్మించే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సుశీల సంతోష్‌ స్ఫూర్తి కథనమిది.

బాల్యంలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమశిక్షణ వంటివే... విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయంటారు సుశీల. ‘జీవితాన్ని గెలవాలంటే చదువొక్కటే సరిపోదు. మిగతా నైపుణ్యాలనూ జత చేస్తేనే వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడటం, బాగా నడుచుకోవడం వంటి వాటినీ పిల్లలు నేర్చుకుంటారు. కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌తో స్కూల్‌ ప్రాంగణమంతా ఖాళీగా ఉండటంతో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ సహకారంతో పాఠశాల  వెనుకవైపు కూరగాయల పెంపకాన్ని చేపట్టాం. మూడునెలల్లోపే స్కూల్‌ ప్రాంగణంలో ఖాళీ ప్రదేశమంటూ లేకుండా మొత్తం మొక్కలతో నింపేశాం. చుట్టుపక్కల ఐసోలేషన్‌లో ఉండే కొవిడ్‌ పేషెంట్లకు ఇక్కడి కూరగాయలను అతి తక్కువ ఖరీదుకు పంపిణీ చేయడం మొదలుపెట్టాం’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారామె.

కొత్త విషయాలు నేర్చుకుంటూ...

స్కూల్‌ తెరిచే సమయానికి ప్రాంగణమంతా పచ్చదనంతో నిండిపోయింది. ఇక్కడ పండిన వాటిని సిబ్బందికి, విద్యార్థులకూ వంతుల వారీగా అందించడం మొదలుపెట్టారు. పిల్లలూ వాటిని ఆశ్చర్యంగా చూడటం, వాటి గురించి తెలుసుకోవాలనుకోవడం వంటివి గమనించాక... వారికి మొక్కల పెంపకంపై ఆసక్తి పెంచాలనుకున్నారు సుశీల. ‘పాఠశాల సమయం తర్వాత ప్రతి ఒక్కరూ తోటపనిలో పాల్గొనాలనే నియమం అప్పటి నుంచే అమలు చేశాం. వారందరికీ ఎవరెవరు ఏయే పనులు చేయాలో ఓ ప్రణాళికా ఇచ్చాం. కలసి పనిచేయడం, తమ స్వహస్తాలతో ఆకుకూరల్నీ, కాయగూరల్నీ పెంచడం వంటివన్నీ వారిలో రెట్టించిన ఉత్సాహాన్ని తెచ్చాయి. క్రమంగా కూరగాయలూ, పండ్ల సాగు మా విద్యావిధానంలో భాగమైంది. ఈ పనిలో భాగంగా సహజ ఎరువుల తయారీ, వర్షపునీటి నిల్వ, వృథా నీటిని మొక్కలకు మళ్లించడం వంటి కొత్త విషయాలెన్నో నేర్చుకుంటూ వ్యవసాయం చేస్తున్న రైతుల్లా మారారు. పంట చేతికొచ్చినప్పుడు వారి సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఒత్తిడికి దూరంగా ఉండటానికీ ఈ కార్యక్రమం ఎంతో సాయం చేస్తోంది. ఇప్పుడు నెలకు దాదాపు 40 నుంచి 50 కేజీల కూరగాయలు సహా చాలా రకాల పండ్లు పండుతున్నాయిక్కడ. 200కుపైగా అరటి చెట్లున్నాయి. స్కూల్‌లోని 1400మంది పిల్లలతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది మొత్తానికి ఉచితంగా పంపిణీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు వారికి ఏ ఫలితమైనా సరైన శ్రమతోనే సాధ్యమని అర్థమవుతోంది. పర్యావరణానికీ, ప్రపంచానికీ మొక్కల పెంపకం ఎంత అవసరమో తెలుసుకోగలుగుతున్నారు. ఆయా కూరగాయలూ, పండ్లతో వచ్చే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపైనా అవగాహన పెంచుకుంటున్నారు. ఈ నైపుణ్యాలన్నీ భవిష్యత్తులో వీరికెంతో ఉపయోగపడతాయి’ అంటోన్న ఈవిడ అమలు చేస్తోన్న విధానాలు ఎంతో స్ఫూర్తిదాయకం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని