అప్పటివరకూ..యూట్యూబే తెలియదు!
ఏడాదిలో ఇరవై నాలుగు లక్షలమంది ఫాలోయర్లు! వంద కోట్లకుపైగా వీక్షణలు.. సెలబ్రిటీలకు మామూలే! కానీ ఒక సాధారణ గృహిణి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుందంటే ఆశ్చర్యమే కదూ! పైగా నటన ప్రారంభించేనాటికి యూట్యూబే పరిచయం లేదావిడకు.
ఏడాదిలో ఇరవై నాలుగు లక్షలమంది ఫాలోయర్లు! వంద కోట్లకుపైగా వీక్షణలు.. సెలబ్రిటీలకు మామూలే! కానీ ఒక సాధారణ గృహిణి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుందంటే ఆశ్చర్యమే కదూ! పైగా నటన ప్రారంభించేనాటికి యూట్యూబే పరిచయం లేదావిడకు. అలాంటి తనకి ఇదెలా సాధ్యమైందో అచ్యుతవల్లి సద్దికూటి.. వసుంధరతో పంచుకున్నారిలా..
పుట్టాం.. పెరిగాం.. పోయామన్నట్లు ఉండకూడదు. పేరు చెప్పగానే ఠక్కున గుర్తుపట్టేయాలి. అది కూడా ఫలానా వాళ్లమ్మాయి, భార్యగా కాదు.. నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనుకునేదాన్ని. దాని కోసం ఏదోకటి చేయాలనే తపన. పుట్టి పెరిగిందంతా ప్రకాశం జిల్లాలోని మొయిద్దీన్‌లో! నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయాలన్నది నాన్న కోరిక. కానీ డిగ్రీ పూర్తవడంతోనే పెళ్లయ్యి అనంతపురం వచ్చా. అలాగని నాన్నకిచ్చిన మాట మర్చిపోలేదు. మావారు సురేంద్ర రెడ్డి సాయంతో చదువు కొనసాగించా. గర్భవతినైనా పీజీ పరీక్షలు రాశా. పాప పుట్టాక ఉద్యోగం సాధించాలని బ్యాంకు కోచింగ్‌లో చేరా. దానికోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. కానీ పాప నన్ను విడిచి ఉండలేకపోయింది. దీంతో తిరిగొచ్చేశా. తర్వాత బాబు పుట్టడం, ఆడపడుచు పురుడు, అత్తగారి బాధ్యత, పిల్లల చదువులు.. ఇలా ఏదోకటి అడ్డురావడంతో ఉద్యోగం కలగానే మిగిలింది. అలాగని ఖాళీగా ఏమీలేను. బీఈడీ, డీఈడీ పూర్తిచేశా. పిల్లలు పెద్దయ్యాక ఎస్‌బీఐలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా చేరా. ఇంటి నుంచే పని! అయినా ఏదో అసంతృప్తి. ఆయన సలహాతో రెస్టారెంట్ ప్రారంభించా. కొందరికైనా ఉపాధి ఇవ్వొచ్చని ఆనందించా. వ్యాపారం బాగా సాగుతోందనగా కొవిడ్! దీంతో మూసేయాల్సి వచ్చింది.
సరదాగా మొదలుపెట్టి..
లాక్‌డౌన్‌లో ఏమీతోచక టిక్‌టాక్ వీడియోలు చేసేదాన్ని. అదీ బ్యాన్ అయ్యింది. యూట్యూబర్ ప్రషూ ఓసారి ‘నటనపై ఆసక్తి ఉంది కదా! నా ఛానెల్‌లో నటిస్తావా అక్కా’ అని అడిగాడు. మావారూ ‘ఆసక్తిగా ఉంటే ప్రయత్నించ’మన్నారు. అప్పుడు తన వీడియోలు చూశా. బాగుండటంతో నటించా. నిజానికి అప్పటివరకూ నాకు యూట్యూబ్ పరిచయమే లేదు. మాబాబుకీ ఛానెల్ ఉన్నా తనేదో చేసుకుంటున్నాడని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరైనా క్యారెక్టర్ ఉందంటే నటించడం.. లేదంటే ఊరుకోవడం. అదిచూసి మాఅబ్బాయి ‘ఆసక్తి ఉంది కాబట్టి.. నువ్వే ప్రయత్నించొచ్చుగా అమ్మా.. కావాలంటే నేను సాయం చేస్తా’నన్నాడు. అలా 2022 మేలో ‘అచ్యుత సద్దికూటి’పేరుతో ఛానెల్ ప్రారంభించా. ఇంట్లో జరిగే సరదా సంఘటనలే కథా వస్తువులు. నా క్యారెక్టర్ దగ్గర్నుంచి విషయాన్ని ఎలా చెప్పాలని ఊహించుకొని తర్వాతే షూటింగ్ మొదలుపెడతా. ‘తింగరి పెళ్లాం’, ‘అమ్మ కథ’, ‘వారానికో కథ’.. సిరీస్‌లకు మంచి ఆదరణ వచ్చింది. గోలీసోడా, పెళ్లిచూపులు స్కిట్లు యువతని బాగా ఆకట్టుకున్నాయి. మూణ్నాలుగు నెలల్లోనే పదిలక్షలమంది
సబ్‌స్క్రైబర్లు వచ్చారు. అంత ఆదరణ వస్తుందని ఊహించలేదు.
బాధపడతా కానీ..
హాస్యమే కాదు.. సందేశాన్నీ జోడిస్తుంటా. ప్రతి వీడియోకీ లక్షల్లో ఆదరణ. మొత్తంగా 166 కోట్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ నుంచి గోల్డ్‌బటన్ అందుకున్నప్పుడూ.. ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపట్టి ‘అక్కా’ అని పలకరించినప్పుడు నేను అనుకున్న గుర్తింపు తెచ్చుకున్నా అనిపించింది. ఇదంతా మావారు, పిల్లల ప్రోత్సాహం వల్లే. కంటెంట్ నేను రాస్తా.. వీడియో తీయడం, ఎడిటింగ్ మాబాబు చూసుకుంటాడు. ఇప్పుడు తను పదోతరగతి. తనకు కుదరట్లేదని వేరే వాళ్ల సాయం తీసుకుంటున్నా. మాఅమ్మ, అక్క నన్ను చూసి గర్వపడుతున్నారు. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా ఫోన్‌చేసి అడుగుతుంటారు. కానీ అడపాదడపా వచ్చే నెగెటివ్ కామెంట్లే బాధపెడతాయి. అప్పుడు మావారు, బాబు ‘వాటిని పట్టించుకుంటే ఒకడుగు వెనక్కి పోయినట్లే.. అయినా అందరూ అందరికీ నచ్చాలనేం లేదు. సపోర్ట్ చేస్తున్న వాళ్లని పట్టించుకో.. తిట్టే వాళ్లని కాద’నేవారు. అప్పట్నుంచి వాటిని పట్టించుకోవట్లేదు. ‘గుర్తింపొచ్చింది చాల’నీ అనుకోవట్లేదు.. ఈ పేరు నిలబెట్టుకుంటూనే కొత్త ప్రయోగాలు చేయాలనుంది. లా చదవాలనీ కోరిక!
సి.నల్లప్ప, అనంతపురం
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.