చదువు కోసం ఆస్తి అమ్మేశారు!

భర్తతో జీవితం మాత్రమే పంచుకోలేదావిడ. ఆయన సేవనీ పంచుకున్నారు. అందుకే ఆయన చనిపోయినా ఆ ఆశయాన్ని బతికిస్తున్నారామె. ఉన్నదాంట్లో కాదు.. ఉన్నదంతా సేవకే వెచ్చిస్తున్నారు.

Updated : 05 Jul 2023 06:07 IST

భర్తతో జీవితం మాత్రమే పంచుకోలేదావిడ. ఆయన సేవనీ పంచుకున్నారు. అందుకే ఆయన చనిపోయినా ఆ ఆశయాన్ని బతికిస్తున్నారామె. ఉన్నదాంట్లో కాదు.. ఉన్నదంతా సేవకే వెచ్చిస్తున్నారు. ‘పిల్లలు బాగుంటే.. సమాజానికే కదా మేలంటూ విద్యాభివృద్ధికి పాటుపడుతున్నారు.. ఇరుకు గిరిజాదేవి.

పేదరికం కారణంగా ఎవరూ చదువుకు దూరమవ్వకూడదు. వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులూ రాణిస్తారని బలంగా నమ్ముతారు గిరిజాదేవి. అందుకే విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈవిడది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆదుర్రు గ్రామం. ఆర్టీసీలో సూపర్‌వైజర్‌గా చేసి, ఉద్యోగ విరమణ చేశారు. ఈమె భర్త ఐ.ఎల్‌.నారాయణ ఏఎస్పీగా పనిచేశారు. సంపాదనలో కొంతభాగం సేవకి ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థికసాయం చేసేవారు. పదవీ విరమణ అనంతరం కూడా సాయాన్ని ఆపలేదు. అప్పటిదాకా ఆయన నిర్ణయానికి తోడ్పాటు నిస్తున్న గిరిజాదేవి 2013లో భర్త చనిపోయాక ఆ బృహత్కార్యాన్ని తను కొనసాగిస్తూ వచ్చారు.

ఇల్లు అమ్మి..

ఈ దంపతులకు పిల్లల్లేరు. పేద విద్యార్థులనే కన్నబిడ్డలుగా భావిస్తున్నారామె. ఆయన సంపాదనలో కొంత వెచ్చిస్తే గిరిజాదేవి మాత్రం ఉన్నదంతా ధారపోస్తున్నారు. కాకినాడలో ఉన్న డాబా ఇల్లు, బంగారం, ఆస్తి అమ్మేసి, అద్దె ఇంటికి మారారు. ఆ వచ్చిన సొమ్ము మొత్తాన్ని సేవకే వినియోగిస్తున్నారు. భర్త పేరిట ‘ఐ.ఎల్‌.నారాయణ ట్రస్టు’ ప్రారంభించి.. సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఇటీవల రూ.40 లక్షలతో ఆరు తరగతి గదులతో అదనపు భవనాన్ని నిర్మించారు. గతంలోనూ రూ.10 లక్షలతో సైన్సు బోధన కోసం ఓ భవనాన్ని కట్టించి ఇచ్చారు. ఏలూరు పోలీస్‌ క్వార్టర్స్‌లో రూ.16 లక్షలతో విద్యార్థుల కోసం శాశ్వత వసతి సౌకర్యాన్ని కల్పించారు. కాకినాడలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి రూ.12 లక్షలు విరాళం ఇచ్చారు. ఏటా కొంతమంది పేద విద్యార్థులను ఎంపిక చేసి, వారి విద్యాభ్యాసానికయ్యే ఖర్చు భరిస్తున్నారు.

విద్యా సేవకే..

‘మావారు విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచారు. ఆయన చలవతో కొందరు చదువు పూర్తిచేసి మంచి స్థాయికి చేరగలిగారు! మా వారి ఆశయాన్ని నేను కొనసాగిస్తున్నా. ప్రతి నెలా వచ్చే పింఛనులో కొంత భాగాన్ని కూడా విద్యాభివృద్ధికే వెచ్చిస్తున్నా. మావారి స్వగ్రామంలోనూ, ఉద్యోగ విరమణ చేసిన ప్రాంతంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కోసం శాశ్వత భవనాల నిర్మాణాలు చేపట్టా. నా నిర్ణయానికి అందరి సహకారమూ తోడవ్వడం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నా. విద్యార్థులకు సాయం చేస్తే అది వారొక్కరికే ఉపయోగపడదు.. సమాజాభివృద్ధికీ సాయమవుతుందని నమ్ముతా. విద్యకే కాదు.. మానసిక ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కూడా కొంత వెచ్చిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకూ విద్యాభివృద్ధికి నిరంతరాయంగా సేవలందించడానికి నా వంతు కృషి చేస్తా’నంటారు 63 ఏళ్ల గిరిజాదేవి.

విరాళాలు, భవనాలు కట్టించి ఊరుకోరామె. పాఠశాలకొచ్చి పిల్లలతో గడుపుతుంటారు. వారితో ప్రేమగా మాట్లాడుతూ చదువు గొప్పదనాన్ని చెబుతారు. వారి కలలు, ఇబ్బందుల గురించి తెలుసుకుంటారు. లక్ష్యాలు ఏర్పరుచుకొని వాటిని సాకారం చేసుకోవాలంటూ ప్రేరణ కలిగిస్తుంటారు. వారి అవసరాలను తెలుసుకొని ఎవరికీ తెలియకుండా చేసే సాయాలూ ఎన్నో. ఇంత చేస్తున్నారు కదా అని ఎవరైనా పొగడబోతే మాత్రం ‘ఇదంతా నా పిల్లల శ్రేయస్సు కోసమే కదా’ అనేస్తారు. నిరాడంబరతకు ప్రాధాన్యమిచ్చే గిరిజాదేవి ఆ సేవల గురించి ఎక్కడా ప్రస్తావించడానికీ ఇష్టపడరు. ‘సేవకు ప్రచారమెందుకు? నా భర్త ఆశయాలను ఇలా నెరవేరుస్తున్నానంతే.. ఇందులో నా గొప్పదనం ఏముంది’ అనే ఆవిడ సత్కారాలు చేస్తామంటూ ఎందరొచ్చినా సున్నితంగా తిరస్కరిస్తారు.

- కడియం త్రినాథస్వామి, మామిడికుదురు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని