ఆ ఒక్క ఘటన మార్చేసింది...
‘ఎంత పంచినా తరిగిపోనివి విద్య, విజ్ఞానాలే..’ రాధిక అత్త ఆమెకు పెళ్లైన రోజు నుంచి నూరిపోసిన విషయమిది. ఆ మాటలు ఆమెను ప్రభావితం చేయడమే కాదు.. కరమ్ ట్రస్ట్ స్థాపనకు కారణమయ్యాయి. ఇదేం అంత సులువుగా జరగలేదు.
‘ఎంత పంచినా తరిగిపోనివి విద్య, విజ్ఞానాలే..’ రాధిక అత్త ఆమెకు పెళ్లైన రోజు నుంచి నూరిపోసిన విషయమిది. ఆ మాటలు ఆమెను ప్రభావితం చేయడమే కాదు.. కరమ్ ట్రస్ట్ స్థాపనకు కారణమయ్యాయి. ఇదేం అంత సులువుగా జరగలేదు. ఒక ఘటన దానికి కారణం అంటున్నారు రాధికా భరత్ రామ్. ఆ ఘటనేంటో అది ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో ఆమె మాటల్లోనే...
కరోనా... పేరు తలచుకున్నా అప్పటి పరిస్థితులన్నీ కళ్ల ముందు కదులుతుంటాయి. ముఖ్యంగా ఎన్జీఓలు. మహమ్మారి కారణంగా కార్పొరేట్ సంస్థలు ఇచ్చే ఫండింగ్ ఆగిపోయి నానా కష్టాలు పడ్డాయి. అనాథ, అంధ, దివ్యాంగులకు సరైన భోజన సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితినీ ఎదుర్కొన్నాయి. ఆ బాధలే కరమ్ ట్రస్ట్ స్థాపించడానికి కారణం. మాది దిల్లీ. వ్యాపారవేత్తల కుటుంబం. దేనికీ లోటూ లేకుండా పెరిగాను. మెట్టినిల్లూ ఆ కోవకు చెందినదే. కానీ మా అత్త కోరిక, ఆశయం పేదవారికీ విద్య చేరాలని. అందుకోసం ఆమె చేయని ప్రయత్నాలు లేవు. ఆమె తర్వాతి తరంగా నేను ఆ బాధ్యతలు చేపట్టాలని కోరుకున్నారు. మొదట ‘ఊ’కొట్టినా, అప్పటికి నా చుట్టూ ఉన్న వాతావరణం అందుకు సహకరించలేదు. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించేవారు. శ్రీరామ్ స్కూల్స్‌కి వైస్‌ఛైర్‌పర్సన్‌గా, అనంత అస్పైన్ సెంటర్ ట్రస్టీగా, సీఐఐ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కో-ఛైర్‌గా పనులతో సతమతమవుతున్న రోజులవి. ఇవి సరిపోవన్నట్టు కాన్సర్ అవగాహనా కార్యక్రమాలు, హస్తకళలను కాపాడే సంస్థలో వాలంటీర్‌ని కూడా. సమాజానికి నావంతు బాధ్యతగా ఇవన్నీ నిర్వహిస్తున్నా చాలనుకున్నాను. కొవిడ్ నా అభిప్రాయాన్ని మార్చింది. ఆ సమయంలో సీఎస్‌ఆర్ నిధులు ఆగిపోయాయి. అన్నీ కరోనా రిలీఫ్ ఫండ్స్‌కు తరలించారు. ఎన్జీఓలను పట్టించుకునే వారే లేకపోయారు. పరిస్థితులు తెలిసొచ్చాయి. ఈ ఫండ్స్ పేరుతో మా ఆదాయంలో, నా జీతంలో చాలా మొత్తం డొనేషన్లుగా ఇచ్చేవాళ్లం. అదే డబ్బును విద్య, నైపుణ్యాలను అందించడానికి వాడిఉంటే ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఇలా అయ్యుండేది కాదు కదా అనిపించింది.
ఫెలోషిప్ కోసం
అత్తగారి మాటలు గుర్తొచ్చాయి. ఎప్పటి నుంచో ఆమె ఏర్పాటు చేయాలనుకుంటున్న ట్రస్ట్ నా భర్త సహాయంతో అప్పుడు చేశాను. పేద, మధ్యతరగతి ఆడపిల్లల్ని చేరదీశాం. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ ప్రకటించాం. చదువుకోవాలని ఆసక్తి ఉండి ఆర్థిక కారణాల రీత్యా విద్యకు దూరమైన ఆడపిల్లల్ని చేరదీశాం. 40 మందికిపైగా యువతులు దీనిలో శిక్షణ పొందుతున్నారు.
ఆ కోవకు చెందినవారే
ట్రస్ట్ పిల్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. వీరిలో సమాజం వెలివేసిన వారు కొందరు. ఆడపిల్లలంటూ నిరాదరణకు గురైనవారు, రోజు కూలీల పిల్లలు, ఖైదీలకు పుట్టారన్న కారణంతో ఆదరణకు నోచుకోని వారు, ఇలాంటి భిన్న సామాజిక నేపథ్యాల వారే ఎక్కువ. వీరందరిని కలిపింది ఒకే విషయం. చదువుకోవాలనే కోరిక. ఇలాంటి వారికి సహాయపడుతూ ఒక కొత్త తరాన్ని రూపొందిస్తున్నా అన్న సంతృప్తి నాకు దక్కింది. ఈ సేవలు ఇంకా విస్తృతం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.