సేంద్రియంతో... వ్యాపారమస్తు!

నల్లబియ్యం, ఎర్రబియ్యం వంటివి ఆరోగ్యానికి మంచిదని తెలిసినా అవి ఎక్కడ దొరుకుతాయి? తృణధాన్యాలతో చేసిన వంటకాలు తినాలనున్నా వండుకొనే ఓపిక కూడా ఉండాలిగా!

Updated : 13 Jul 2023 04:35 IST

నల్లబియ్యం, ఎర్రబియ్యం వంటివి ఆరోగ్యానికి మంచిదని తెలిసినా అవి ఎక్కడ దొరుకుతాయి? తృణధాన్యాలతో చేసిన వంటకాలు తినాలనున్నా వండుకొనే ఓపిక కూడా ఉండాలిగా! అరుదైన ఆహార ధాన్యాలనీ, స్వచ్ఛమైన సేంద్రియ పదార్థాలనీ, తృణధాన్య వంటకాలని అందిస్తూ.. వ్యాపారంలో ముందుకెళ్తోంది విశాఖపట్నానికి చెందిన నాత్ర లక్ష్మీ తేజస్వి. గోవుల్ని కాపాడే క్రమంలో వచ్చిన ఈ వ్యాపార ఆలోచన గురించి వసుంధరతో పంచుకున్నారిలా.

‘తానొకటి తలిస్తే, దైవమొకటి తలిచింది’ అంటారు కదా. నా విషయంలోనూ అలానే జరిగింది. నేనో జంతు ప్రేమికురాలిని. వీధుల్లో తిరిగే జంతువుల్ని చేర దీసేదాన్ని. ఈ క్రమంలోనే ఆర్గానిక్‌ ఉత్పత్తుల గురించి తెలుసుకున్నా. అదే నా వ్యాపారానికి నాందైంది. మాది విశాఖపట్నం దగ్గర మధురవాడ. నాన్న రఘునాథ రాజు లెక్చరర్‌. అమ్మ సుజాత. నాకో అక్క. ఎంటెక్‌ పూర్తిచేసి బెంగళూరుకు చెందిన సంస్థలో ఆపరేషనల్‌ మేనేజర్‌గా పని చేసేదాన్ని. ఖాళీ సమయాల్లో జంతు సంరక్షణ చేసేదాన్ని. ఒక రోజు ఆఫీస్‌కి వెళ్లే దారిలో ఆవులను కబేళాకు తరలించే వ్యాన్‌ ఒకటి కనిపించింది. వెంటనే పోలీసులకి సమాచారమిచ్చా. గోవులను సురక్షిత ప్రదేశానికి పంపించా. కొన్ని రోజుల తర్వాత వెళ్తే అవి అక్కడ లేవు. అడిగితే చనిపోయాయన్నారు. వీళ్లూ ఆవుల్ని చంపేవాళ్లతో ఏకమయ్యారని అర్థమైంది. పోలీసులకు చెబితే పట్టించుకోలేదు. అప్పుడే వీటిని అమ్మే ప్రాంతం గురించి తెలుసుకున్నా. విజయనగరం దగ్గర ఆల్లమండ గ్రామంలో విక్రయిస్తున్నారని తెలిసి అక్కడకి వెళ్లాను. రైతులతో మాట్లాడితే.. పెంచలేకపోతున్నామని కొందరు, ముసలివి అయిపోయాయని ఇంకొందరు చెప్పారు. అప్పుడే వాళ్లకి పశు వ్యర్థాలతో చేసే పంచగవ్య ఉత్పత్తుల గురించి చెప్పి.. అవగాహన కల్పించా. అంతావిని.. మార్కెటింగ్‌ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవుల విక్రయాల్ని ఎలానూ ఆపలేకపోయా... కనీసం ఆసక్తి ఉన్న వీళ్లనైనా ప్రోత్సహిస్తే కొన్ని గోవులనైనా రక్షించొచ్చు అనిపించింది. అలా పంచగవ్య ఉత్పత్తులతో నా వ్యాపారం ప్రారంభమైంది.

నేనే అందుకు సాక్ష్యం..

19 ఏళ్లకే నాకు థైరాయిడ్‌, పీసీఓడీ సమస్య ఉన్నాయి. దాంతో అధిక బరువు. చాలా ఒత్తిడికి లోనయ్యా. మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో పరిష్కార మార్గాలు వెతికా. అప్పుడే నాకు రసాయనాలు వాడని సేంద్రియ ఉత్పత్తుల గురించి తెలిసింది. సిద్ద జొన్నలను నా ఆహారంలో భాగంగా చేసుకున్నాక మంచి ఫలితాలు వచ్చాయి. ఆ ప్రయోజనాలని అందరికీ చెప్పాలనుకున్నా. అప్పుడే స్టోర్‌ పెట్టాలన్న ఆలోచన వచ్చింది.

బంకమట్టితో కట్టా..

మా దుకాణాన్ని పర్యావరణహితంగా ఉండేలా బంకమట్టి, గాజుసీసాలు, గడ్డి ఉపయోగించి నిర్మించా. దీనికి ఆరునెలలు పట్టింది. నేను ఉద్యోగం చేసి దాచిపెట్టిన మొత్తాన్ని దీనిపైనే పెట్టా. నాన్న కొంత మొత్తం ఇచ్చినా సరిపోలేదు. నా స్నేహితులతో చెబితే... ఇద్దరు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. రూ.25 లక్షలతో 2021లో స్వచ్ఛా నేచురల్స్‌ ప్రారంభమైంది. అన్నిరకాల చిరుధాన్యాలు, ఎర్ర, నల్ల, చిట్టి ముత్యాలు, సిద్ద జొన్నలు ఇలా అరుదైన ఆహారధాన్యాల్ని దుకాణంలో ఉంచాం. డ్రైప్రూట్‌ లడ్డూలు, తృణధాన్యాలతో చేసిన నూడుల్స్‌, చపాతీలు, పరోటా వంటి రెడీటుకుక్‌ వంటకాలు అమ్మేవాళ్లం. మొదటి ఆరునెలలూ అంతగా కొనుగోళ్లు లేవు. నేను డీలా పడిన ప్రతిసారి అక్క, నాన్న ధైర్యం చెప్పారు. అన్ని ఒడుదొడుకులు దాటి... సంవత్సరం తిరిగేలోపే మా పెట్టుబడి మాకు వచ్చేసింది. ప్రస్తుతం రూ.60 లక్షల వరకూ టర్నోవర్‌ చేస్తున్నాం. స్టోర్‌కి వచ్చిన పెద్దవాళ్లు ‘అప్పట్లో మా ఇళ్లు ఇలానే బంకమట్టితో ఉండే’వంటూ గుర్తుచేసుకుని నాకు చెబుతుంటే సంతోషంగా అనిపించేది. వాళ్ల ప్రశంసలే నాకు కొత్త ఉత్తేజాన్నిస్తున్నాయి. దీనంతటకి కారణమైన గోవులను రక్షించడానికి మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ఇప్పటికే చుట్టుపక్కల ఏడు గ్రామాల్లో వీటిని రక్షించడానికి అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని