సీపీఆర్‌తో...ప్రాణాలు నిలబెడుతున్నా!

‘కాస్త ముందొచ్చి ఉంటే బతికించేవాళ్లం’.. అనేమాటలో వైద్యులు చెప్పే తేడా కొన్ని నిమిషాలే! కానీ ఆ ఆలస్యం ఖరీదు.. ఓ ప్రాణం! ఏటా ఇలా మరణిస్తున్న వాళ్లెందరో.

Updated : 14 Jul 2023 07:13 IST

‘కాస్త ముందొచ్చి ఉంటే బతికించేవాళ్లం’.. అనేమాటలో వైద్యులు చెప్పే తేడా కొన్ని నిమిషాలే! కానీ ఆ ఆలస్యం ఖరీదు.. ఓ ప్రాణం! ఏటా ఇలా మరణిస్తున్న వాళ్లెందరో. అయితే చుట్టూ ఉన్నవాళ్ల చొరవతో ఎంతోమంది ప్రాణాలు నిలపొచ్చు. దీనిపైనే 14 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌! ఆవిడను వసుంధర పలకరించింది.


పెద్దపాపకి అన్నం తినిపిస్తోందో అమ్మ. లోపల నిద్రలేచిన రెండోపాపది చిన్నగా మూలుగు వినిపించిందట. ఏడిస్తే వెళదామనుకొని పనిలో నిమగ్నమైంది. ఎంతసేపటికీ చప్పుడు వినిపించక పోయేసరికి లోపలికెళ్లిందట. చూస్తే పాప దుప్పటి ముఖానికి చుట్టేసుకుంది. తీసేసరికి ఊపిరాడట్లేదు. ఒళ్లూ నీలం రంగులోకి మారింది. వెంటనే సీపీఆర్‌ మొదలుపెడితే 31 ప్రయత్నాలయ్యాక పాప ఊపిరి తీసుకుంది. ఇన్‌స్టాలో నా వీడియో చూసి.. ప్రయత్నించిందట ఆమె.


ఏదో పెద్ద శబ్దం వచ్చిందని లోపలికెళ్లి చూస్తే భర్త పడిపోయి ఉన్నాడు. వెంటనే సీపీఆర్‌ గుర్తొచ్చి చేసిందట. తిరిగి గుండె కొట్టుకోవడం మొదలయ్యాక ఆసుపత్రికి తరలించింది. ‘నీ సీపీఆర్‌ వల్లే మీవారు నీకు దక్కాడ’న్నారట వైద్యులు. ఆమె ఇదంతా చెప్పి ‘మీవల్లే నా పిల్లలకు ఇప్పుడు నాన్న ఉన్నాడు. థాంక్యూ’ అంటూ మెసేజ్‌ పెట్టింది. ఇలాంటివి ఈ 14 ఏళ్లలో ఇంకెన్నో!


మాది తణుకు. నాన్న మిక్కిలినేని రామ్‌ప్రసాద్‌ డాక్టర్‌. తాతగారూ వైద్యులే.. అందుకే చిన్నతనం నుంచీ వైద్యంతప్ప మరో ఆలోచన లేదు. అమ్మ లక్ష్మీదేవి సంగీత కళాకారిణి. ఆల్‌ ఇండియా రేడియోలోనూ పాడారు. జిప్‌మర్‌-పుదుచ్చేరి నుంచి ఎంబీబీఎస్‌, ఎండీ పీడియాట్రిక్స్‌ చేశా. ప్రమాదాల్లో చాలా వరకూ సకాలంలో ప్రథమచికిత్స అందకే ప్రాణాలు కోల్పోతుంటారు. గొంతులో అడ్డుపడటం, గుండెనొప్పి, భయం.. కారణమేదైనా గుండె ఆగిపోయినా సీపీఆర్‌తో తిరిగి కొట్టుకునేలా చేయొచ్చు. ఇది సకాలంలో అందక మరణించిన సంఘటనలెన్నో చూశా. దీనిపై అవగాహన కల్పిస్తే 90శాతం ఇలాంటి మరణాలను అడ్డుకోవచ్చు అనుకున్నా.

దాని వల్లేనేమో!

ఎండీ చేస్తున్నప్పుడు నాకు విత్తనం గొంతులో ఇరుక్కుపోయింది. హౌస్‌ సర్జన్‌ త్వరగా స్పందించి ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడంతో బతకగలిగా. బహుశా మనసులో నాటుకుపోయిందో ఏమో.. ఆలోచన రాగానే అమల్లో పెట్టా. తొలిరోజుల్లో ఆసుపత్రిలోనే సెషన్లు నిర్వహించేవాళ్లం. తర్వాత స్కూళ్లు, వివిధ సంస్థలకూ వెళ్లడం ప్రారంభించా. సోషల్‌మీడియా ప్రభావం ఎక్కువయ్యాక అవగాహన లేనివారూ తోచిన సలహాలివ్వడం చూశా. దీంతో యూట్యూబ్‌, ఇన్‌స్టాల్లో డా.శివరంజని ఈజీ హెల్త్‌, డా.శివరంజని ఆన్‌లైన్‌ పేరుతోనూ వీడియోలు ఉంచడం ప్రారంభించా. వీటిని చూసి.. వర్క్‌షాప్‌లు నిర్వహించమని సంప్రదిస్తుంటారు. అలాగే, వాంతులు విరోచనాలైతే శక్తి పుంజుకోవడానికని ఓఆర్‌ఎస్‌ ఇస్తుంటాం. కానీ మార్కెట్‌లో ‘ఎల్‌’, ‘విట్‌’ అనిపెట్టి ఓఆర్‌ఎస్‌ పేరుతో అమ్మేస్తుంటారు. వీటితో కొన్నిసార్లు ప్రమాదం కూడా. ‘డబ్ల్యూహెచ్‌ఓ రెకమెండెడ్‌’వే వాడాలి. దీన్ని ప్రభుత్వం, ఎస్‌ఎస్‌ఎస్‌ఏఐ, సీడీఎస్‌సీఓ, ఆరోగ్య మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లా. ఏళ్ల ప్రయత్నం తర్వాత ‘ఓఆర్‌ఎస్‌ కాదు.. ఒకరకమైన డ్రింక్‌ మాత్రమే’నని రాస్తున్నారు. కానీ చిన్న అక్షరాల్లోనే! దీనిపైనా హైకోర్టులో పిల్‌ వేశా. అదింకా పెండింగ్‌లో ఉంది.


ఆ లక్ష్యం..

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని మాగ్నా సెంటర్స్‌లో పనిచేస్తున్నా. నెలకు మూడువరకూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటా. అతిగా యాంటీ బయాటిక్స్‌ వాడటం వల్ల వచ్చే నష్టాలు, బ్రెస్ట్‌ఫీడింగ్‌, ఓరల్‌ డీహైడ్రేషన్‌ థెరపీ, ప్రివెంటింగ్‌ యాంటీ బయాటిక్స్‌ అండ్‌ స్టెరాయిడ్స్‌, కరెక్ట్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌.. వంటివీ బోధిస్తుంటా. స్కూళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో సెషన్లు ఉచితమే. ఎన్‌జీవోల కోసం కార్పొరేట్‌ సంస్థల నుంచి నిధులు సేకరిస్తా. ఇప్పటివరకూ ఒక్కదాన్నే! చాలామంది వాలంటీర్లుగా చేస్తామంటూ ముందుకొస్తున్నారు. వాళ్లతో బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నా. మావారు సంతోష్‌.. ఎండోక్రెనాలజిస్ట్‌, మాకో పాప. వాళ్లు నన్ను చూసి గర్వపడుతున్నారు. నా సేవలకు మెచ్చి గత ఏడాది ఆంధ్ర ప్రభుత్వం పద్మశ్రీకీ సిఫారసు చేసింది. ఓపికున్నంత వరకూ ‘ప్రథమ చికిత్స’ అవసరాన్ని అందరికీ తెలియజేయాలి.. ఆలస్యం కారణంగా పోయే మరణాల సంఖ్యను తగ్గించాలన్నది లక్ష్యం.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని