హెలికాప్టర్‌తో47 మందిని రక్షించి..

అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో వాళ్లని రక్షించడానికి హెలికాప్టర్‌తో దేవతలా వచ్చారామె.

Updated : 16 Jul 2023 03:23 IST

అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో వాళ్లని రక్షించడానికి హెలికాప్టర్‌తో దేవతలా వచ్చారామె. దిగడానికి అంగుళం చోటు లేని చోట గాల్లోనే చక్కర్లు కొడుతూ 47 మందిని రక్షించారు. ఈ ధైర్యమే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన ‘వాయుసేన శౌర్య’ అవార్డు అందుకొనేలా చేసింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచారు ఎయిర్‌క్రాఫ్ట్‌ కమాండర్‌ దీపికామిశ్రా... 

రాజస్థాన్‌కు చెందిన దీపికా మిశ్రా చిన్నతనం నుంచీ వాయుసేనలో చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివారు. 2006లో వాయుసేన అకాడమీలో కమిషన్డ్‌ ఆఫీసర్‌గా ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలోనే భారత వాయుసేనకు సంబంధించిన ఓ పరేడ్‌కు వెళ్లారు. అక్కడ సారంగ్‌, సూర్య కిరణ్‌ బృందాలు చేసిన విన్యాసాలకు ఆమె ముగ్ధులయ్యారు. ఈ బృందాలు అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటాయి. దాంతో ఎప్పటికైనా ఆ బృందంలో చేరాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారామె. కానీ అప్పట్లో ఈ బృందంలో చేరడానికి మహిళలకు అవకాశం ఉండేది కాదు. మహిళలకు కేవలం సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ను మాత్రమే నడిపే అవకాశం ఉండేది. దాంతో చీతా, చేతక్‌ హెలికాప్టర్లు నడిపే బృందంలో చేరారు. అలా 1600 గంటలపాటు హెలికాప్టర్లను నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారామె. తర్వాత భారత వాయుసేన 2010లో కొన్ని నిబంధనలను మార్చింది. ఇందులో భాగంగా మహిళలు ట్విన్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ను నడపడానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆ నిర్ణయం దీపికకు వరంగా మారింది. 2013లో పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత సాధించిన ఆమె తన కలను సాకారం చేసుకున్నారు. సారంగ్‌ బృందంలో స్క్వాడ్రన్‌ లీడర్‌గా చేరారు. తద్వారా ఈ బృందంలో చేరిన మొదటి వాయుసేన మహిళగా ఘనత సాధించారు. దీపిక భర్త సౌరభ్‌ కక్కర్‌ కూడా స్క్వాడ్రన్‌ లీడర్‌ కావడం గమనార్హం.

వారిని రక్షించి...

‘2021లో భారీవర్షాలతో.. చంబల్‌, సింధ్‌ నదుల్లో వరద పోటెత్తి మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాను ముంచేసింది. నీట మునిగిన గ్రామ ప్రజలను రక్షించాలని నాకు ఆదేశాలు అందాయి. డ్యామ్‌లన్నీ పొంగుతున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. హెలికాప్టర్‌ని దించడానికి స్థలం లేదు. బాధితులు అరచేత ప్రాణాలతో మా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్‌ను గాలిలోనే ఉంచి కేబుల్‌ సాయంతో ఒక్కొక్కరినీ పైకి చేర్చాం. అక్కడే నీటిలో సగం మునిగిపోయిన భవనముంది. రెండో అంతస్తులో అయిదుగురున్నారు. వాళ్లు 3 రోజుల నుంచీ నిద్రాహారాల్లేకుండా ఉన్నారు. వారిని రక్షించడం మాకు పెద్ద సవాల్‌ అయ్యింది. చాకచక్యంతో హెలీకాప్టర్‌ని నడిపి 47 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాం. ఈ అనుభవాన్ని మరవలేను. ఈ సేవలకే ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘వాయుసేన శౌర్య’ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. ఆపద నుంచి బయటపడిన వారి కళ్లల్లో కనిపించే ఆనందం నా శ్రమను మర్చిపోయేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని