ఇంజినీరింగ్ చదివి ఇదేం పనన్నారు..
ఆమె కలగన్న లక్ష్యం ఒకటైతే, విద్యార్హత మరొకటి. ఆపై ఆసక్తిని పెంచుకున్న రంగం ఇంకొకటి. అందరూ భావించేటట్లు ఈ గమనం తనని కుంగుబాటుకి గురిచేయలేదు. కొత్త కలలకు రూపాన్నిచ్చింది. అంతిమంగా... అవకాశాలెన్నో సృష్టించుకునే శక్తినిచ్చింది.
ఆమె కలగన్న లక్ష్యం ఒకటైతే, విద్యార్హత మరొకటి. ఆపై ఆసక్తిని పెంచుకున్న రంగం ఇంకొకటి. అందరూ భావించేటట్లు ఈ గమనం తనని కుంగుబాటుకి గురిచేయలేదు. కొత్త కలలకు రూపాన్నిచ్చింది. అంతిమంగా... అవకాశాలెన్నో సృష్టించుకునే శక్తినిచ్చింది. ఇదంతా వర్మీకంపోస్ట్ తయారీతో కోట్ల రూపాయల టర్నోవర్ అందుకుంటోన్న 32 ఏళ్ల సనాఖాన్ గురించే.
‘చేసే పని మనసుకు నచ్చితే, దాన్ని చేరుకోవడానికీ, స్ఫూర్తి పొందడానికీ ‘సూది మొన’ కూడా సాయం చేస్తుందనేది నా నమ్మకం’ అదే నన్ను నడిపించింది అని అంటారు సనా. ఆమెది ఉత్తర్ ప్రదేశ్‌లోని మేరఠ్. తండ్రి టైలర్. అమ్మానాన్నలతో పాటు అన్నయ్య జునైద్‌ఖాన్... తనని బాగా చదివించాలని భావించేవారు. దాంతో ఊహ తెలియని వయసు నుంచే సనా డాక్టరు చదువు చదవాలని కలలు కనేవారు. అయితే అనుకున్నట్లు సీటు రాకపోవడంతో....బీటెక్‌లో చేరాల్సివచ్చింది. ఘజియాబాద్‌లోని ఐఎమ్మెఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక మొదటిసారి వర్మీకంపోస్ట్ తయారీని గమనించారు. అక్కడ శిక్షణ పొందే అవకాశం ఉందని తెలియడంతో సరదాగా చేరారు. ‘ఇక్కడ చెప్పిన పాఠాల్లో సేంద్రియ వ్యవసాయ విధానాలు ఆకట్టుకోవడంతో ఇందులోనే కెరియర్‌ని వెతుక్కోవాలనుకున్నా. ఈ శిక్షణతోపాటు ఇంజినీరింగ్ పూర్తిచేశా. ఈ రంగాన్ని ఎంచుకున్న విషయాన్ని ఇంట్లో చెబితే అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంజినీరింగ్ చదివి, ఇదేం పనని తిట్టిపోశారు. మల్టీ నేషనల్ కంపెనీలో పని చేయాల్సినదానివి, మట్టిలో దిగుతావా అన్నారు. ఏడాదిలో చేసి చూపిస్తా. లాభదాయకంగా లేకపోతే ఉద్యోగానికి వెళతానని వారికి మాటిచ్చా. ఎలాగో చివరకు ఒప్పించాన’ని గుర్తు చేసుకుంటారు సనా.
విఫలమైనా..
‘ఏ పనైనా ఆలోచన వరకూ చాలా సులువుగా అనిపిస్తుంది. ఆచరణలోనే ఇబ్బందులు తెలుస్తాయి. వర్మీకంపోస్ట్ తయారీకి అవసరమైన పేడ సేకరణ పెద్ద సమస్య. డెయిరీలకు వెళ్లి వారికి మా ఆలోచన చెప్పి...దాన్ని తీసుకొచ్చేవాళ్లం. అలా వానపాముల పెంపకం మొదలుపెట్టాం. నా స్టార్టప్‌కి ప్రారంభ పెట్టుబడి అన్నయ్యే ఇచ్చాడు. దాంతోనే ‘ఎస్‌జే ఆర్గానిక్స్’ ప్రారంభించాం’ అంటూ తన ప్రయాణాన్ని వివరించారు సనా. మొదటి ప్రయత్నంలో కంపోస్ట్ తయారీ సరిగా రాకపోవడంతో దానిపై మరింత పరిశోధన చేశారామె. అప్పుడామెకు ఘజియాబాద్ నుంచి మేరఠ్‌లోని ప్రభుత్వ కాలేజీలోని వర్మీకంపోస్ట్ కేంద్రానికి గృహ, పశుశాలల వ్యర్థాలను తరలించే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ల గురించి తెలిసి వారిని సంప్రదించారీమె. వారి నుంచి కొన్ని వ్యర్థాలను తెప్పించి ఎరువులా తయారుచేసి ఆ మిశ్రమానికి ఆవు మూత్రం కలిపి కంపోస్ట్ తయారు చేసేవారు. ‘ఇలా చేసిందాన్ని సహజ ఎరువుగా, పురుగుల మందుగా పని చేస్తుందని తెలిశాక ల్యాబ్ టెస్టింగ్‌కి పంపించి ఒకే అనుకున్నాకే రైతులకు అందించడం మొదలుపెట్టాం. ఈ ప్రయోగం ఫలించడంతో మార్కెట్‌కీ, నర్సరీలు, ఎరువుల దుకాణాలకూ అందజేసేవాళ్లం. ఈ విక్రయాలు క్రమంగా పెరిగాయి’ అని చెబుతారామె.
అవగాహన కల్పిస్తూ...
‘రసాయనిక ఎరువుల వినియోగానికి అలవాటు పడిన రైతులు వర్మీ కంపోస్టు వాడేలా చేయడం పెద్ద సవాల్. అందుకే ఊరూరా తిరిగి అవగాహన కల్పించేదాన్ని. భూసారం పెరిగితే... సహజంగానే దిగుబడి మెరుగ్గా ఉంటుందని ఒప్పించేదాన్ని. క్రమంగా వారిలో మార్పు వచ్చింది. ఇప్పుడు నెలకు 150 టన్నుల కంపోస్ట్‌కు ఆర్డర్లు వస్తున్నాయి. సంస్థను ప్రారంభించిన తక్కువ కాలంలోనే రూ.కోటి టర్నోవర్ సాధించాం. ఖతార్, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. టెడెక్స్ వంటి వేదికలపై ప్రసంగించే అవకాశంతో పాటు... 2018లో మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ నుంచి అందుకున్న ప్రశంస నాలో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు రైతులే స్వయంగా ఈ ఎరువుని తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నా. వంద మందికి ఉపాధీ కల్పిస్తున్నా. మా సహకారంతో మేరఠ్‌లోని 104 పాఠశాలలు వర్మీ కంపోస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. మార్పుకి ముందుడుగు మొదలైంది అనడానికి ఇదే నిదర్శనం’ అంటారు సనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.