వేలు విరిగినా... నవ్వుతూనే ఉన్నా!
కాస్త ఏమరుపాటుగా ఉన్నా నెత్తురు రుచిచూసే కత్తులు... కనురెప్పపాటు కాలం ఆదమరిచినా దహించే అగ్నిబరాటాలు... వీటితో ఆడుకోవడం ఐశ్వర్యకి కొత్తకాదు.
కాస్త ఏమరుపాటుగా ఉన్నా నెత్తురు రుచిచూసే కత్తులు... కనురెప్పపాటు కాలం ఆదమరిచినా దహించే అగ్నిబరాటాలు... వీటితో ఆడుకోవడం ఐశ్వర్యకి కొత్తకాదు. ఆ గొప్పతనం తనది కాదు మూడువేల సంవత్సరాల నాటి యుద్ధకళ ‘సిలంబం’ది అంటారామె. చీరకట్టులో సిలంబాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సాధించారు 33 ఏళ్ల ఐశ్వర్య మణివన్నన్..
మాది చెన్నై. చదువుకొనేటప్పుడు మెంటార్లు, ప్రొఫెసర్ల ప్రభావం నాపై ఎక్కువగా ఉండేది. వాళ్ల సూచనలతోనే ఆర్ట్ ఎగ్జిబిషన్లు, వర్క్‌షాపులు, ఫిల్మ్ స్క్రీనింగ్‌లు అంటూ తిరిగేదాన్ని. అలా మొదట.. గురువు ఐఏఎస్ కవితారాము వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నా. నా శరీరతీరు చూసి.. ‘నీకు యుద్ధకళ నేర్చుకోగల సామర్థ్యం ఉంది. సిలంబం ఎందుకు నేర్చుకోకూడద’ని అన్నారు. అదే నా జీవిత లక్ష్యమవుతుందని అనుకోలేదు. 3 వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ యుద్ధకళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాట.. దీనిని యుద్ధ సమయంలో శత్రువుపై పోరాటానికి వినియోగించేవారు. మా గురువు పవర్ పాండ్యన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిపి నాకీ విద్యలో శిక్షణ ఇచ్చారు. చూసినంత తేలిక కాదు దీని సాధన. చాలా కఠినంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదు. చేరిన 9 నెలల్లోనే వెన్నెముక ఫ్రాక్చర్ అయ్యింది. మూడున్నర నెలలు మంచానికి పరిమితమయ్యా. నాలుగు నెలలు విశ్రాంతి తప్పదన్నారు. తెలిసిన వాళ్లంతా ఎందుకొచ్చిన కష్టం అన్నారు. నాకు మాత్రం అదొక విద్యలా కాకుండా ధ్యానంలా అనిపించేది. ఆ విద్యకి శారీరకంగా దూరంగా ఉన్నానే కానీ మానసికంగా బాగా దగ్గరయ్యా. ఇది ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదు, అద్భుతమైన కళ కూడా. ఇంతటి పురాతనమైన, మన దేశ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలనిపించింది. కోలుకున్నాక మరిన్ని నైపుణ్యాలు సాధించా.
వేలు విరిగినా...
2016లో మలేసియాలో జరిగిన ‘దక్షిణాసియా సిలంబం ఛాంపియన్‌షిప్’ పోటీల్లో ఈ విద్యను ప్రదర్శిస్తుండగా ఓ ప్రమాదం. కాలి బొటనవేలు విరిగింది. ప్రాణం పోయినంత నొప్పి. అలాగని పోటీ మధ్యలోంచి వెనక్కి వెళ్లలేను. నా జీవిత లక్ష్యం ఇదే అని నిర్ణయించుకుని ఆ బాధని పంటి బిగువున భరించా. ముఖంపై చిరునవ్వును పులుముకున్నా. పట్టుదలతో ప్రదర్శన కొనసాగించి విజేతగా నిలిచా. అలా అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి బంగారు పతకాన్ని అందుకొన్నా. ఆ తర్వాత ఛాంపియన్‌గా ఎదిగా.
వేలమంది అమ్మాయిలకు..
కర్రలు, కత్తులు, దివిటీలు, లేడి కొమ్ములని పోలిన ఆయుధాల్ని ఈ విద్యలో ఉపయోగిస్తారు. అందుకే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నో వేదికలపై ఈ కళని ప్రదర్శించా. ఈ రంగంలో మహిళలు తక్కువ.. అందుకే వాళ్లలో ప్రత్యేకించి అవగాహన తీసుకొస్తూ, శిక్షణ ఇస్తున్నా. ఆ క్రమంలోనే 2016లో ‘నేషనల్ హ్యాండ్‌లూమ్ డే’ సందర్భంగా చేనేత చీరలోని సౌకర్యాన్ని, చేనేత కార్మికుల సృజనాత్మకతను చెప్పడానికి చీర ధరించి.. ఈ కళను ప్రదర్శించా. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ప్రభావంతో చాలామంది మహిళలు నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. ఆదరణ పెరగడంతో ‘మాయిషా స్డూడియో’ స్థాపించి... పాఠశాల, కళాశాల విద్యార్థినులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నా. కొన్ని వేలమంది ఇంతవరకూ శిక్షణ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కళను వ్యాప్తిలోకి తీసుకురావాలని విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ లెక్చరర్, ఫ్యాకల్టీగా ఉంటూ తరగతులు చెబుతున్నా.
వయసుతో పనిలేదు..
చాలామంది ఈ వయసులో ఎందుకీ సాధన.. దెబ్బలు తగులుతాయి కదా? ఈత, నడక, వ్యాయామాలు వంటివి చేయొచ్చు కదా అని సలహా ఇచ్చేవారు. కానీ సిలంబానికి వయసు అడ్డం కాదు. తెలుసుకోవాలనే తపన ఉంటే చాలు. 5 నుంచి 72 ఏళ్లవారు కూడా సాధన చేస్తున్నారు. శారీరక, మానసికారోగ్యాన్ని అందించే క్రీడ ఇది. మనలో ఉండే శక్తిని గుర్తించగలిగితే చాలు. మనల్ని మించిన యోధులు మరొకరుండరు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, ఆత్మరక్షణను కల్పించే ఈ కళను సజీవంగా ఉంచాలనేదే నా లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.