బాస్ భార్యగా మిగలొద్దని..
నాకు 32 ఏళ్లు వచ్చేనాటికి 10, 7 ఏళ్లున్న ఇద్దరమ్మాయిలు. వాళ్లు స్కూలుకి, ఆయన ఆఫీసుకి వెళ్లేవారు. వాళ్లు వచ్చేవరకూ ఎదురు చూడటమేనా నా పని? ఆడవాళ్లంటే అందమైన దుస్తులు, ఖరీదైన బ్యాగులు, నగలతో మగవాళ్ల సంపదను చూపే చిహ్నాలుగానే ఎందుకుండాలి.. అన్న ఆలోచన వచ్చింది.
- దీపాలి గోయెంక, సీఈఓ, వెల్‌స్పన్
నాకు 32 ఏళ్లు వచ్చేనాటికి 10, 7 ఏళ్లున్న ఇద్దరమ్మాయిలు. వాళ్లు స్కూలుకి, ఆయన ఆఫీసుకి వెళ్లేవారు. వాళ్లు వచ్చేవరకూ ఎదురు చూడటమేనా నా పని? ఆడవాళ్లంటే అందమైన దుస్తులు, ఖరీదైన బ్యాగులు, నగలతో మగవాళ్ల సంపదను చూపే చిహ్నాలుగానే ఎందుకుండాలి.. అన్న ఆలోచన వచ్చింది. నాకంటూ ఓ ప్రత్యేకత కావాలనిపించింది. అదే మావారితో చెప్పా. ‘తోచట్లేదు కాబట్టి చేస్తానంటే ఇంకేదైనా వ్యాపకం చూసుకో. లేదూ నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంటావా.. సవాళ్లకు సిద్ధమవ్వు. నా నుంచి మాత్రం ఆఫీసులో ఏ సాయమూ అంద’దన్నారు. నాకు కావాల్సిందీ అదే.. బాస్ భార్యగా మిగిలిపోవడం కాదు.. నాకంటూ స్థానం సంపాదించుకోవాలనే! అదే చెప్పి వెల్‌స్పన్‌లో అడుగుపెట్టా. ఏ అభిప్రాయం చెప్పినా.. బాధ్యత తీసుకోవడానికి ముందుకెళ్లినా ‘మహిళవి కదా’ అనేవారు. చేయలేననే అనుమానం వెలిబుచ్చేవారు. నేను మాత్రం అధైర్యపడలేదు. ఇది నేర్చుకునే క్రమం.. నేనింకా తెలుసుకుంటున్నా అనుకుంటూ సాగేదాన్ని. ఇప్పటికీ ఇలాగే ఆలోచిస్తా. దీంతో నాకన్నీ తెలుసన్న గర్వం ఉండదు. నేర్చుకోవడంలోనూ తెలియని ఉత్సాహం. అయితే తగ్గట్టుగా పరీక్షించే సందర్భాలూ ఎదురవుతాయి. విధుల్లో భాగంగా విదేశమెళ్లాను. పాపకి ఆరోగ్యం బాలేదు. తట్టుకోలేక వచ్చేద్దామనుకున్నా. అప్పుడు మావారు ‘నేనున్నా.. తనను చూసుకుంటా’నని భరోసానిచ్చారు. ఇంకేం ధైర్యంగా పని పూర్తి చేసుకొచ్చా. అలా కెరియర్‌లో ముందుకు వెళ్లా. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి.. ప్రతిరోజూ ఉత్సాహంగా సాగుతుంది. మీకంటూ ఓ గుర్తింపూ వస్తుంది. దానికి తగ్గ కుటుంబ ప్రోత్సాహమూ తోడైతే ఇంకాస్త వేగంగా, ధైర్యంగా అనుకున్న తీరాలను చేరగలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.