రాత్రవుతుంటే భయం వేసేది...

బాల్యం అంటే మరవలేని మధురమైన జ్ఞాపకం. ఆమెకు మాత్రం ఓ పీడ కల. వైవాహిక జీవితంలోనూ ఎన్నో కష్టాలు అనుభవించారామె. వాటి నుంచి ధైర్యంగా బయటికి అడుగుపెట్టి, తన అనుభవాలను టెడెక్స్‌ వంటి వేదికలపై పాఠాలుగా చెబుతున్న దివ్యా మాధుర్‌ మనోగతమిది.

Updated : 19 Jul 2023 05:03 IST

బాల్యం అంటే మరవలేని మధురమైన జ్ఞాపకం. ఆమెకు మాత్రం ఓ పీడ కల. వైవాహిక జీవితంలోనూ ఎన్నో కష్టాలు అనుభవించారామె. వాటి నుంచి ధైర్యంగా బయటికి అడుగుపెట్టి, తన అనుభవాలను టెడెక్స్‌ వంటి వేదికలపై పాఠాలుగా చెబుతున్న దివ్యా మాధుర్‌ మనోగతమిది.

డపిల్లకు నేనున్నాననే భరోసానివ్వాల్సిన తండ్రి చేతుల్లోనే వేధింపులకు గురయ్యా. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే వణికేదాన్ని. మేం దిల్లీలో ఉండేవాళ్లం. నా తోటివాళ్లంతా ఆడుకొంటుంటే, ఇంటికొచ్చి నాన్న కొడతాడేమోనని భయంతో గదిలో బిక్కుబిక్కుమని గడిపేదాన్ని. తాగుడుకు బానిసైన ఆయన ఇంటి బాధ్యతలను పట్టించుకొనేవాడు కాదు. దీంతో నాన్న నుంచి అమ్మ విడిపోయింది. అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటే, అక్కడకు దూరపుబంధువు వచ్చి ఎవరూ లేనప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టేవాడు. ఆ తర్వాత అమ్మకు మరోవ్యక్తితో పెళ్లి చేశారు. అతనూ.. రాక్షసుడే. అమ్మనీ, నన్ను వేధింపులకు గురి చేసేవాడు. ఒక రోజు గోళ్ల రంగు వేసుకొన్న నా గోరును వేలి నుంచి పీకేశాడు. బాధతో నేను ఏడుస్తుంటే కొడుతూనే ఉన్నాడు. ఆ సైకో ప్రవర్తన భరించలేక అమ్మ, నేను తిరిగి అమ్మమ్మ వాళ్లింటికి పారిపోయాం. 

పెళ్లైనా... డిగ్రీ చదివి, ఇంటింటికీ తిరిగి పుస్తకాలు అమ్ముతూ, డేకేర్‌ సెంటర్‌లో పనిచేస్తూ ఉండేదాన్ని.  అప్పుడే అమ్మకు తెలిసిన ఓ వ్యక్తితో పెళ్లి చేశారు. జీవితంలో ఇకపై అంతా సంతోషమే అనుకొని ఏడడుగులు వేసిన నాకు అదంతా ఆవిరైంది. నా భర్త పెట్టే వేధింపులకు రాత్రి అంటే భయం మొదలైంది. అసభ్యకరమైన వీడియోలు బలవంతంగా చూపించి నాపై అత్యాచారానికి పాల్పడేవాడు. అసహజ శృంగారంపై ఆసక్తి చూపించేవాడు. అప్పుడే ఆరవ్‌ పుట్టాడు. ఆ తర్వాత నా పరిస్థితి మరింత హీనమైంది. ఓ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి మనిద్దరితో అతడు కూడా ఉంటాడన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. సోషల్‌లైఫ్‌ అంటే ఇంతే అన్నాడు. ఏం చేయాలో తెలియలేదు. ఎదురు తిరిగితే కొట్టి, చంపడానికీ వెనుకాడలేదు. ఆపై ఒకరి నుంచి ఇద్దరు, ముగ్గురిని కూడా పడకగదిలోకి పంపేవాడు. ఈ దారుణానికి తొమ్మిదేళ్లపాటు బలయ్యా. నా కొడుకు కోసం మనసు చంపుకొని నాలుగ్గోడల మధ్య బతికా.

నేనుగా... ఒకరోజు ఇంట్లో ఏడుస్తున్న నన్ను చూసి నువ్వెందుకు ఏడుస్తూనే ఉంటావని ఆరవ్‌ అడిగాడు. బాధపడకుండా ఉంటేనే నీ దగ్గరకు వస్తానని వాడు కోపంగా వెళ్లిపోతుంటే ఆ క్షణం నా మనసు మేల్కొంది. వాడు పెద్దైన తర్వాత నన్ను బలహీనురాలిగానే గుర్తు పెట్టుకుంటాడేమో అనిపించింది. అసలు నేనెందుకు ఏడవాలనుకున్నా. ఈ వైవాహిక బంధానికి దూరంగా ఉంటేనే నాలా నేను బతకగలననిపించింది. దాంతో ఆరవ్‌ను తీసుకొని 2015లో బెంగళూరు వచ్చేశా.

తెలుసుకొని.. అప్పటివరకు ఇతరులకు భయపడుతూ బతికిన నేను నా మనసు చెప్పిందే వినడం మొదలుపెట్టా. నన్ను నేను ప్రేమించడమెలాగో నేర్చుకున్నా. ఉద్యోగం చేస్తూ బాబుని చదివిస్తున్నా. నా కోసం నేనే నిర్ణయాలు తీసుకొంటున్నా. నా చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను అందరికీ చెబుతున్నా. లైఫ్‌ కోచ్‌, టీచర్‌, స్టోరీ టెల్లర్‌, మెంటార్‌, స్పీకర్‌గా మారి టెడెక్స్‌ వంటి పలు వేదికలపై ప్రసంగిస్తున్నా. పరిస్థితులను అర్థం చేసుకొని సర్దుకోవాలని చెప్పే పెంపకం కాకుండా మనసు చెప్పింది వినండని పిల్లలకు నేర్పించాలంటాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని