విరామం మంచిదే!

ఆమెరికాలో మాస్టర్స్‌. ఐఐఎం కోల్‌కతా నుంచి మేనేజ్‌మెంట్‌ పట్టా. ఒరాకిల్‌, సిస్కో, జీఈ, నొవార్టిస్‌ వంటి పెద్ద సంస్థల్లో పనిచేసిన అనుభవం. అంకుర సంస్థలని ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారుగా ముందడుగు.

Updated : 20 Jul 2023 04:06 IST

ఆమెరికాలో మాస్టర్స్‌. ఐఐఎం కోల్‌కతా నుంచి మేనేజ్‌మెంట్‌ పట్టా. ఒరాకిల్‌, సిస్కో, జీఈ, నొవార్టిస్‌ వంటి పెద్ద సంస్థల్లో పనిచేసిన అనుభవం. అంకుర సంస్థలని ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారుగా ముందడుగు. ఈ అనుభవ పాఠాలతో.. వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకుంటున్న తోటి మహిళలకు సాయం చేయాలన్న తలంపుతో మెంటార్‌గానూ రాణిస్తున్నారు రేణుక బొడ్ల. కుటుంబం, కెరియర్‌ రెండింటిని సమన్వయం చేసుకున్న తీరుని ఆమె వసుంధరతో పంచుకున్నారిలా...

మొదట్లో నేను డాక్టర్‌ అవ్వాలనుకున్నా. తెల్లకోటు వేసుకున్న మెడికల్‌ స్టూడెంట్స్‌ని చూసి ముచ్చటపడేదాన్ని. అందుకోసమే ఇంటర్‌లో బైపీసీ కూడా తీసుకున్నా. అలాంటిది వ్యాపారవేత్తగా ఎలా మారానో చెబుతా. మాది వరంగల్‌. నాన్న వీరన్న ఆటోమొబైల్‌ వ్యాపారి. అమ్మ ప్రమీల. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని. బైపీసీలో ప్రయోగాలు చేసేటప్పుడు రక్తం చూస్తే చాలు కళ్లు తిరిగేవి. దానికితోడు ఎంసెట్‌ రాసినప్పుడు కొద్దిమార్కుల తేడాలో ప్రభుత్వ సీటు రాలేదు. దానికోసం ఏడాది ఆగడం ఇష్టం లేక వచ్చిన ఫార్మసీతో సరిపెట్టుకున్నా. అనుకోకుండా చదివిన ఓ పుస్తకం నన్ను కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమా చేయించింది. అలా ఒకేసారి ఫార్మసీ, డిప్లొమా కూడా అయ్యాయి. తర్వాత పెళ్లి. ఆయన ప్రకాష్‌ బొడ్ల. అప్పటికే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. అక్కడకు వెళ్లాక ఆయన ప్రోత్సాహంతోనే ఒక స్టార్టప్‌లో ఇంటర్న్‌గా చేసే అవకాశం వచ్చింది. నా పనితీరు నచ్చి.. దానిలో కొనసాగించారు. ఆ తర్వాత పదోన్నతితో ఒరాకిల్‌, సిస్కో వంటి సంస్థల్లో పనిచేస్తూ టీమ్‌ లీడర్‌ స్థాయికి చేరుకున్నా. అవి చేస్తూనే యూనివర్సిటీ ఆఫ్‌ ఫినిక్స్‌ నుంచి కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ చేశా. బాబు పుట్టాక.. 2004లో బెంగళూరు చేరుకున్నాం. ఆపై జీఈ(జనరల్‌ ఎలక్ట్రిక్స్‌)లో ఎనిమిదేళ్లపాటు ఇన్నోవేటివ్‌ లీడ్‌గా పనిచేశాను. ఆ సమయంలోనే పాప పుట్టింది. ఆ తర్వాత నోవార్టిస్‌ బయోమ్‌ ఇండియాకి హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నా. 

కుటుంబం కోసం..

చాలా మంది చేస్తున్న పనిని వదిలేస్తే ఏమవుతుందో అని దిగులు పడతారు. రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ నేనలా చేయలేదు. బాబు, పాప పుట్టినప్పుడే కాదు... కుటుంబానికి నా అవసరం ఉంది అనుకున్నప్పుడల్లా కెరియర్‌ నుంచి నిర్మొహమాటంగా బ్రేక్‌ తీసుకున్నా. అలాగని నేనేమీ వెనకబడిపోలేదు. పైగా మునుపటి కంటే మంచి స్థానాన్నే సంపాదించుకున్నా. పదింతలు ముందుకెళ్లా. మనం చేసే పనిలో వేగంగా రాణించాలంటే నైపుణ్యాలు చాలా అవసరం. దానికోసమే ఐఐఎం కోల్‌కతాలో సీటు సాధించా. అప్పుడు పాపకి రెండేళ్లు. ఆ సమయంలో తనని ఇంట్లో వదిలి వెళ్లడం ఇబ్బందే. చదువు పూర్తికాగానే ‘ఎర్లీ పాడ్‌’ అనే సంస్థని ప్రారంభించా. స్టార్టప్‌ పెట్టడం తేలిక అనుకుంటారు చాలామంది. కానీ మార్కెట్లో విజయవంతంగా ముందుకెళ్తుందా లేదా అనేది అధ్యయనం చేశాకే... అడుగేయాలి. లేకపోతే నిరాశ పడాల్సి ఉంటుంది. ఎర్లీపాడ్‌లో మేం చేసే రిసెర్చ్‌ అదే. అది చేస్తున్నప్పుడే.. నా అనుభవాలని కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చేవారితో పంచుకుంటే బాగుండు అనిపించింది. అలా మెంటార్‌ అవతారం ఎత్తా. హైదరాబాద్‌ ఏంజెల్స్‌ నెట్‌వర్క్‌, ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ సీడ్‌ ఫండ్‌ గ్రూప్‌లకి మెంటార్‌గానూ, ఇన్వెస్టర్‌గానూ మారా. కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థులకూ మెంటార్‌గా సేవలందించాను.


ఏ అమ్మాయికైనా మంచి భర్త దొరికితే మంచి మెంటార్‌ దొరికినట్టే. మావారు, ఇతర కుటుంబ సభ్యుల సహకారం దొరికింది కాబట్టే కెరియర్‌లో రాణించడం సులువయ్యింది.

 పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది కాకుండా చేస్తున్న పనిని చూసి నేర్చుకుంటారు. మా అబ్బాయి రోహన్‌ ప్లస్‌ వన్‌లో షార్ట్‌ కహానీ పేరుతో ఒక స్టార్టప్‌ పెట్టాడు.

వారాంతాల్లో భగవద్గీత, భాగవతం చదువుతా. అందులో చెప్పినన్ని మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఇంకెక్కడా లేవు మరి. పాడ్‌ కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు వినడం అంటే చాలా ఇష్టం.


ఆడవాళ్లూ రావాలని...

నాకు సాధ్యమైతే ఎవరికైనా సాధ్యమే అని నమ్ముతా. అందుకే కొత్తగా వ్యాపారంలో వచ్చేవారిని ప్రోత్సహించడం కోసం సిల్వర్‌ నీడిల్‌ వెంచర్స్‌ స్థాపించి.. వెంచర్‌ పార్టనర్‌గా మారా. టెక్నాలజీ, కృత్రిమ మేధ, ఈ కామర్స్‌ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నా. మరోపక్క మహిళలు వ్యాపారంలోకి రాకపోవడం నాకు అసంతృప్తిగా అనిపించేది. అందుకే వియ్‌ హబ్‌, ఆహాతో కలిసి ‘సూపర్‌ ఉమెన్‌’ కార్యక్రమం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడులు, మెంటారింగ్‌ సాయం చేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని