వలస జీవితాల్లో వెలుగు.. జ్యోతి!
తన గ్రామం నుంచి వలస వెళ్లి పోతున్న వాళ్లను చూసి చలించిపోయింది జ్యోతి. ‘పట్టణాలలో ఉపాధి దొరికితే డబ్బు వస్తుంది. కానీ.. మన ఊరు వెలవెలబోతుంది, నేల బీడువారుతుందని’ నచ్చచెప్పి ఒప్పించింది.
తన గ్రామం నుంచి వలస వెళ్లి పోతున్న వాళ్లను చూసి చలించిపోయింది జ్యోతి. ‘పట్టణాలలో ఉపాధి దొరికితే డబ్బు వస్తుంది. కానీ.. మన ఊరు వెలవెలబోతుంది, నేల బీడువారుతుందని’ నచ్చచెప్పి ఒప్పించింది. సేంద్రియ వ్యవసాయం దిశగా వాళ్లని నడిపించి వలసలకు అడ్డుకట్ట వేసింది. ఝార్ఖండ్‌లోని కోటింగ్ సెరా గ్రామాన్ని సుసంపన్నం చేసిన ‘జ్యోతి ఖండిత్’ విజయగాథ ఇది..
సెరా గ్రామ వాసులకు కష్టపడి సాగు చేద్దామని ఉన్నా వర్షాలు, వసతులు తక్కువ. ఎంత కష్టపడ్డా దిగుబడి వచ్చేది కాదు. ఇక కొవిడ్ సమయంలో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఏటా సెరా గ్రామం ఉన్న గుమ్లా జిల్లా నుంచి ఐదు లక్షలమంది వలసెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి జ్యోతిలో దిగులు పుట్టించింది. ఇలా ఊరు నుంచి ఒక్కొక్కరూ వ్యవసాయాన్ని విడిచి వలస బాట పడుతుంటే గ్రామంలో ఒక్కరూ మిగలరనుకుంది. వాళ్ల మనసు మార్చడం అంత తేలిక్కాదని తనకీ తెలుసు. తనే రంగంలోకి దిగి వ్యవసాయం లాభసాటిదని నిరూపిస్తే తప్ప ఈ పరిస్థితులు మారవని అనుకుంది. ఖరీదైన రసాయనాల స్థానంలో ప్రకృతి సిద్ధమైన సేంద్రియ విధానాలు ఉపయోగించి సాగు మొదలుపెట్టింది. నైపుణ్యాల కోసం ‘ప్రధాన్ సంస్థాన్’ అనే ఎన్‌జీఓలో చేరింది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన, శిక్షణ అందిస్తారు. ‘క్లాప్’ (కాంప్రహెన్సివ్ లైవ్లీ అడాప్టేషన్ పాత్‌వే) పద్ధతి ద్వారా తక్కువ నీటితో, కొద్దిపాటి స్థలంలో.. ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు పండించడం ఎలానో ఇక్కడ నేర్పుతారు. ‘నేను సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాకా ఖర్చులు తగ్గాయి. ఆదాయం పెరిగింది. నన్ను చూసి మిగిలిన మహిళలూ ఈ సంస్థలో చేరారు. ఈ వ్యవసాయంలో మెలకువలు తెలుసుకున్నారు. ఇప్పుడు మా గ్రామంలో 150 మంది మహిళలు రసాయనాలు లేని సాగు చేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోగలిగారు’ అంటోంది జ్యోతి.
ఆడవాళ్లే ముందుకొచ్చారు..
‘మగవాళ్లు పని వెతుక్కుంటూ నగరాలకు వలస వెళ్లినా గ్రామాల్లో మహిళలు సేంద్రియ వ్యవసాయాన్ని ధైర్యంగా మొదలుపెట్టారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. అది చూసిన మగవాళ్లు వెనక్కి వచ్చి సాగు మొదలుపెట్టారు. ఇలా వలస వెళ్లిన 300 కుటుంబాల మగవాళ్లు నగరాల నుంచి తిరిగి వచ్చేశారు. సేంద్రియ వ్యవసాయ పనుల్లో మహిళలకు సాయం చేస్తున్నారు. ‘ఈ విజయం నా ఒక్కదానిదే కాదు కోటెంగ్ సెరాలోని 150 మంది మహిళలది. సేంద్రియ వ్యవసాయం వల్ల గ్రామం ఆర్థికంగా బలోపేతం అయింది. దీనికి తోడు ప్రభుత్వ సహకారం తోడవ్వడంతో అభివృద్ధి సాధ్యమైంద’ంటున్నారామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.