సైకిల్‌పై మసాలాలు అమ్మా.. హక్కుల బాట పట్టా!

కుటుంబ పెద్దగా.. అండగా ఉండాల్సిన తండ్రే నడి వీధిలో వదిలేస్తే.. చిన్న వయసులో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నారామె. తనకూ, తల్లికి పట్టిన గతి మరొక స్త్రీకి రాకూడదనుకున్నారు.

Updated : 26 Jul 2023 04:01 IST

కుటుంబ పెద్దగా.. అండగా ఉండాల్సిన తండ్రే నడి వీధిలో వదిలేస్తే.. చిన్న వయసులో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నారామె. తనకూ, తల్లికి పట్టిన గతి మరొక స్త్రీకి రాకూడదనుకున్నారు. సైౖకిల్‌పై మసాలాలు అమ్ముతూనే... లా చదివి, మానవ హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు లలితా నటరాజన్‌. అందుకోసం జీవితాన్నే పణంగా పెట్టారామె. తాజాగా అమెరికా ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘ఇక్బాల్‌ మసీహ్‌’ పురస్కారాన్ని అందుకున్న ఆమె ‘వసుంధర’తో తన అనుభవాలు పంచుకున్నారు...

ఎంతోమంది స్త్రీలు, పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నానంటే అందుకు స్ఫూర్తి నా జీవితమే. తమిళనాడులోని తిరుచ్చి మా సొంతూరు. మధ్య తరగతి కుటుంబం. నాన్న చేతిలో అమ్మ పడని కష్టం లేదు. ఆయన మాతో సరిగా ఉండేవాడు కాదు. నెమ్మదిగా ఇంటికి రావడం మానేశాడు. మేమెలా బతుకుతామని ఆలోచించేవాడే కాదు. నాకు ఊహ తెలిసినప్పట్నుంచి ఇవే కష్టాలు.. కన్నీళ్లు. అందుకే ప్లస్‌టూ చదువుతున్నప్పుడే కుటుంబ బాధ్యత తీసుకున్నా. నేను చుట్టుపక్కల ఇళ్ల నుంచి బట్టలు తెస్తే అమ్మ వాటిని ఇస్త్రీ చేసేది. ఆమె సాంబార్‌, రసం, మసాలా పౌడర్లను చేసిస్తే..  సైకిల్‌మీద వెళ్లి హోటళ్లకు వేసేదాన్ని. అలా దాచిన డబ్బుతో ఇంట్లోనే మెస్‌ పెట్టుకున్నాం. తరచి చూస్తే మాలాంటి వాళ్లు చాలామంది కనిపించారు. పరిస్థితులపై కోపం వచ్చినా.. పరిష్కారం అది కాదుగా అనిపించింది. అందుకే నా మనసు న్యాయవిద్య వైపు మళ్లింది.

వాళ్లలో అమ్మ కనిపించేది..

ఓ పక్క లా చదువుతూనే.. మరోవైపు మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాడే ఎన్జీవోలతో పని చేసేదాన్ని. ఓ ఎన్జీవో ఆర్థికంగా వెన్ను తట్టడంతో పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి మానవహక్కుల అంశంపై పీజీ చేశా. బాగా చదివి బంగారు పతకం సాధించా. మహిళలపై వేధింపులు, బాలకార్మిక సమస్యలు, బాల్య వివాహాలు, పిల్లల హక్కులకు భంగంలాంటి వాటి గురించి లోతుగా ఆలోచించా. పిల్లల మనస్తత్వం, హక్కుల రక్షణపై మద్రాస్‌ యూనివర్సిటీలో కొన్ని డిప్లొమా కోర్సులు చేశా. మొదట్లో తిరుచ్చి, పెరంబదూరు, కరూర్‌, మదురై జిల్లాల ఎన్జీవోలతో పనిచేసి అక్కడి పేదలకు న్యాయసాయం అందించా. అనుభవం వచ్చాక చెన్నై వచ్చేశా. ఓ పక్క మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూనే.. మహిళలు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘ట్రస్ట్‌ ఫర్‌ సోషల్‌ సెన్సింగ్‌’ సంస్థను స్థాపించా. వాళ్లలో చాలామంది దగ్గర కోర్టు ఫీˆజుకూ డబ్బుండేది కాదు. వేధింపులు తట్టుకోలేక ఇంటిక్కూడా వెళ్లేవారు కాదు. తెలిసిన ఎన్జీవోలతో మాట్లాడి వారికి ఆసరా కల్పించేదాన్ని. క్వారీల్లో, మిల్లుల్లో, పరిశ్రమల్లో ఉన్న బాల కార్మికులకి విముక్తి కలిగించినప్పుడూ, మహిళలకు న్యాయం దొరికినప్పుడూ వాళ్ల ఆనందంలో నాకు అమ్మే కనిపించేది. మాకే న్యాయం జరిగిందన్నంతగా సంబరపడేదాన్ని.

మభ్యపెట్టారు.. కానీ..

ఓ స్కూలు వ్యాన్‌ ప్రమాదంలో 3 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. ఆ కేసు వాదించేటప్పుడు యజమాన్యం నుంచి చాలా ఒత్తిడి ఎదురైంది. నేను లెక్క చేయలేదు. ఆ ధైర్యానికి జడ్జే మెచ్చుకున్నారు. 2006లో.. ఓ యాసిడ్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 15ఏళ్ల బాలుడు గాయపడ్డప్పుడూ.. ఇదే పరిస్థితి. యజమాన్యం పట్టించుకోకపోతే ఆసుపత్రిలో చేర్పించి న్యాయ పోరాటం చేశా. కోర్టు రూ.7లక్షల నష్టపరిహారం అందేట్టు చేసింది. ఇప్పుడతను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నై వచ్చినప్పుడల్లా.. ‘అక్కా నీ వల్లే నాకీ జీవితం’ అంటుంటాడు. ఇలా ఎంతోమంది చిన్నారులిప్పుడు చక్కగా చదువుకొనేలా చేస్తున్నాం. నా సేవల్ని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం 2021లో రాష్ట్ర బాలల సంక్షేమ కమిటీలోకి తీసుకుంది. వేధింపుల కేసులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, వారికెలా న్యాయం చేయాలనే కోణంలో పోలీసులకు, అధికారులకూ చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నా. ఈ మధ్యే యూఎస్‌ ప్రభుత్వం పిల్లల హక్కుల కోసం కృషి చేసే వారికిచ్చే ప్రతిష్ఠాత్మక ‘ఇక్బాల్‌ మసీహ్‌ అవార్డు’ అందించింది. దీన్ని ప్రదానం చేస్తూ, ‘మీరే అసలైన విజేత’ అంటూ చెన్నైలోని యూఎస్‌ కాన్సులేట్ జనరల్‌ జుడిత్‌ రవిన్‌ అభినందించడం సంతోషంగా అనిపించింది.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని