పట్టుబట్టారు..పరిసరాలను మార్చారు!

సస్టెయినబిలిటీ.. పర్యావరణ హితం.. ఈ పదాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ప్రపంచమంతా ఈమధ్య వీటిపై దృష్టిపెడుతోంది. కానీ వీళ్లు రెండు దశాబ్దాల క్రితమే తాముండే ప్రాంతంలో దాన్నో ఉద్యమంలా ప్రారంభించారు.

Updated : 18 Aug 2023 16:02 IST

సస్టెయినబిలిటీ.. పర్యావరణ హితం.. ఈ పదాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ప్రపంచమంతా ఈమధ్య వీటిపై దృష్టిపెడుతోంది. కానీ వీళ్లు రెండు దశాబ్దాల క్రితమే తాముండే ప్రాంతంలో దాన్నో ఉద్యమంలా ప్రారంభించారు. ‘ఆడవాళ్లు మీరేం చేయగల’రన్న వారితోనే శెభాష్‌ అనిపించుకుని.. వాళ్లూ కలిసి నడిచేలా చేశారు. ఇంతకీ వాళ్లెవరు, ఏం చేశారంటే..

చెత్తే ఎరుగని రోడ్లు, చుట్టూ పచ్చని మొక్కలు, ఫ్లవర్‌ బెడ్స్‌, 24 గంటల పహారా.. పచ్చదనానికి నిలువుటద్దంలా ఉంటుంది ముంబయి బాంద్రా ప్రాంతంలోని పలీ హిల్స్‌. రెండున్నర దశాబ్దాల క్రితం అలా కాదు. చుట్టుపక్కలంతా సారాయి కాచేవారు, డ్రగ్‌ మాఫియా, ఇంటి చుట్టుపక్కల పాన్‌ మరకలు, రోడ్ల పక్కనే చెత్త, తరచూ యాక్సిడెంట్లు, దొంగతనాలు. అనారోగ్యాలకి తోడు అభద్రత.. దీన్నే మార్చాలనుకున్నారు ఎనిమిది మంది మహిళలు. 1998లో జట్టుగా ఏర్పడి పరిశోధన చేసి వివిధ దేశాల్లో పాటించే విధానాలను తెలుసుకున్నారు. ఏం చేయొచ్చన్న దానిమీద ప్రణాళిక రూపొందించి, కాలనీ సభ్యులందరినీ ఓ చోట చేర్చి ఆలోచన పంచుకున్నారు. కానీ ఇదంతా అవ్వని పని అన్నారంతా. వాళ్లు నిరాశపడలేదు.

‘ముందు పలీ హిల్స్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించాం. రోజూ రెండు గంటలు ఇంటింటికీ తిరుగుతూ చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయొద్దనేవాళ్లం. రోడ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించేవాళ్లం. ‘మీకెందుకు ఇవన్నీ, మీ కొద్దిమంది ఏం మార్పు తేగలరు’ అంటూ వ్యతిరేకతలు. అయినా కొనసాగించాం. పిల్లల్ని స్కూలుకి పంపి శుభ్రత కోసం అధికారులు, రక్షణ చర్యల కోసం పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగేవాళ్లం. చెత్త మీరు పడేయొద్దు. మేమే తీసుకెళతామని చెప్పాం. ఇంటి పరిమాణం బట్టి ఏడాదికి రూ.350- రూ.1200 వరకు వసూలు చేసేవాళ్లం. మేం పార్టీలు చేసుకోవడానికి అడుగుతున్నాం అనుకునేవారు. ఓపిగ్గా మాట్లాడి ఒప్పించాం. నెమ్మదిగా మార్పు మొదలైంది’ అంటారీ బృందం. వీళ్ల పనితీరు చూసి, ఒక్కొక్కరూ సొసైటీలో సభ్యులవ్వడం మొదలుపెట్టారు.

సేకరించినదాన్ని తడి, పొడి చెత్తగా వేరు చేసి, ఎరువుగా మార్చడం, రీసైక్లింగ్‌ చేసేవారు. 2018 నుంచి బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకొని కరెంటు ఉత్పత్తి ప్రారంభించారు. ‘దీంతో ఏటా రూ.10లక్షలు ఆదా చేయగలుగుతున్నాం. 24 గంటల సెక్యూరిటీ, సీసీ టీవీ కెమెరాలు, రోడ్లను, పరిసరాలను శుభ్రం చేసే బృందాన్ని ఏర్పరచుకున్నాం. చెట్లు కొట్టడం మా వద్ద నిషేధం. దీంతో ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడుతుంది. బయోగ్యాస్‌తోనే వీధిలైట్లు వెలిగే ఏర్పాట్లు చేసుకున్నా’మనే ఈ బృందంలో ఇప్పుడు మగవారూ సభ్యులే. సెక్రటరీగా మాత్రం బృందంలోని ఆడవాళ్లలో ఎవరో ఒకరు సాగుతున్నారు. వీళ్ల చొరవ, పర్యావరణంపై చూపుతున్న ప్రేమకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి పురస్కారాలూ అందుకున్నారు. జీరో వృథాని సాధించి, స్థానికుల వాహనాలకు తోడ్పడే సీఎన్‌జీ గ్యాస్‌ను ఉచితంగా అందించాలన్నది వీళ్ల లక్ష్యమట. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరనడానికి వీరో ఉదాహరణే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని