ఆటో నడిపి... పీహెచ్‌డీ చేయించారు!

పెళ్లయ్యాక.. చదువు. ఎంతో సంకల్పం ఉంటే కానీ సాకారం కాని కల. కానీ అర్థం చేసుకునే భర్త ఉంటే అదేమంత కష్టం కాదని నిరూపించారు ఈపూరి షీల.

Updated : 30 Aug 2023 04:26 IST

పెళ్లయ్యాక.. చదువు. ఎంతో సంకల్పం ఉంటే కానీ సాకారం కాని కల. కానీ అర్థం చేసుకునే భర్త ఉంటే అదేమంత కష్టం కాదని నిరూపించారు ఈపూరి షీల. ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాను అందుకున్న ఆమె తన కల నెరవేర్చుకున్న తీరు వసుంధరకు వివరించారు..

నా మూడో ఏటే అమ్మ చనిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగానే.. మా మేనమామ కరుణాకర్‌తో వివాహం అయింది. ఆయనతో నాకింకా చదువుకోవాలని ఉందన్నప్పుడు.. నా ఆసక్తిని గమనించి కాదనలేకపోయారు. ఆయన ఆటోడ్రైవర్‌. అంతంతమాత్రపు ఆదాయం. అయినా చదివిస్తానని మాటిచ్చారు. డిగ్రీ పూర్తయ్యాక కూడా ఆ మాటనే కొనసాగించారు. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని డిగ్రీతో ఆపేయకుండా ఎంకాం చేశా. ఆ తర్వాత దూరవిద్యలో ఎంహెచ్‌ఆర్‌ఎం(పీజీ) పూర్తి చేశా. ఒక ఎయిడెడ్‌ కళాశాలలో అధ్యాపకురాలి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే.. పీహెచ్‌డీ చేసుండాలనీ, ఏపీ సెట్ పాసై ఉండాలనీ అన్నారు. దాంతో ఏపీ సెట్ (2016) క్వాలిఫై అయ్యా. పీహెచ్‌డీ కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్‌-సెట్ ద్వారా అర్హత సాధించి.. డాక్టర్‌ నంబూరు రత్నకిషోర్‌ వద్ద స్కాలర్‌గా చేరా. సమాజానికి ఉపయోగపడాలని ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత’ను పరిశోధనాంశంగా ఎంచుకున్నా. ప్రభుత్వ వైద్య సేవల్లో పారదర్శకత పెంచటానికి ప్రతి వైద్యశాలకు ఒక యాప్‌ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని సమగ్ర వివరాలతో తెలియచేశా. ప్రస్తుతం తెనాలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో కామర్స్‌ అధ్యాపకురాలిగా పని చేస్తున్నా. ప్రభుత్వ అధ్యాపకురాలు కావాలన్నది నా లక్ష్యం. మాకిద్దరు పిల్లలు. బాబు అరవింద్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. పాప సాత్విక ఇంటర్‌ చదువుతోంది. ఆయన ఉదయం ఏడింటికి ఆటో ఎక్కితే.. ఎప్పుడో రాత్రి 11కు ఇంటికి చేరుకుంటారు. అందుకే నేనేం సాధించినా ఆ ఘనత ఆయనదే. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదోక రూపంలో సాకారం అందుతుంది.

- షేక్‌ అబ్దుల్‌ తాజుద్దీన్‌, సుబ్రహ్మణ్యం, తెనాలి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని