చిరు వంటకాలు.. చేసి చూపిస్తూ..

చిరుధాన్యాలు మేలు చేస్తాయని తెలుసు. కానీ వాటిని అంత తేలిగ్గా వండుకోలేం అన్నది ఇల్లాళ్ల ఫిర్యాదు. అదేమంత కష్టం కాదు అంటూ.. వాటిని కమ్మగా, తేలిగ్గా వండటంపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు హనుమకొండకు చెందిన కుసుమ కవిత.. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

Updated : 31 Aug 2023 05:32 IST

చిరుధాన్యాలు మేలు చేస్తాయని తెలుసు. కానీ వాటిని అంత తేలిగ్గా వండుకోలేం అన్నది ఇల్లాళ్ల ఫిర్యాదు. అదేమంత కష్టం కాదు అంటూ.. వాటిని కమ్మగా, తేలిగ్గా వండటంపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు హనుమకొండకు చెందిన కుసుమ కవిత..

క్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తన వంతుగా సమాజానికి ఏదైనా మేలు చేయాలనుకున్నారు కవిత. హనుమకొండలోని కుమార్‌పల్లిలో ఉండే కవిత ప్రతి శని, ఆదివారాలు సమీపంలోని కాలనీల్లో అపార్టుమెంట్లు, డివిజన్లకు వెళుతూ పెద్ద ఎత్తున మహిళల్ని కూడగడతారు. వాళ్లకి చిరుధాన్యాలతో వంటకాలు చేసి చూపిస్తున్నారు. కవిత భర్త సురేశ్‌ ‘రికార్డ్‌’ సర్వీస్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించి 20 ఏళ్ల నుంచీ రైతులకు విత్తనాలు, ఇతర సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు చిరుధాన్యాలు పండించాలని వారికి మేలిరకం విత్తనాలు ఉచితంగా అందజేస్తున్నారు. ఆయన ప్రభావంతో పదుల సంఖ్యలో రైతులు మిల్లెట్ల సాగువైపు మళ్లారు. భర్తకు సాయంగా ఉండాలనీ కవిత వంటలను వండి చూపెట్టేవారు. కొర్ర పాయసం, సజ్జల హల్వా, అండుకొర్రల ఉప్మా, సామలు, రాగి ఇడ్లీలు, కిచిడి, ఫ్రైడ్‌ రైస్‌ లాంటివి రుచికరంగా ఎలా చేసుకోవచ్చో ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నారు. మహిళలు అడిగే సందేహాలను తీరుస్తున్నారు. చేసిన వంటలను వేడివేడిగా అక్కడున్న వారందరితో తినిపించడంతో.. ‘భలే రుచిగా ఉన్నాయే.. చిరుధాన్యాల వంటలు ఇంత సులువా?’ అంటూ తమ ఇళ్లల్లోనూ మిల్లెట్లతో వంటకాలను ప్రయత్నిస్తున్నారు. బియ్యం, గోధుమలతో చేసే అన్ని రకాల వంటలూ చిరుధాన్యాలతోనూ చేసుకోవచ్చనీ, ఇంటికి అతిథులెవరొచ్చినా మిల్లెట్ల రుచులే పెడతానని చెబుతున్నారు కవిత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని