మట్టి బొమ్మ.. మత సామరస్యం!

నేడు ఊరూరా గణపయ్య విగ్రహాలు కొలువుదీరతాయి. వాటి తయారీలో మహిళలూ పాలు పంచుకోవడం చూస్తున్నాం. అయితే కర్ణాటకలో ఓ ముస్లిం మహిళ వినాయకులను తీర్చిదిద్దుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

Updated : 18 Sep 2023 03:02 IST

నేడు ఊరూరా గణపయ్య విగ్రహాలు కొలువుదీరతాయి. వాటి తయారీలో మహిళలూ పాలు పంచుకోవడం చూస్తున్నాం. అయితే కర్ణాటకలో ఓ ముస్లిం మహిళ వినాయకులను తీర్చిదిద్దుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

సుమన్‌ హవేరిది పేదకుటుంబం. పెరిగిందేమో కర్ణాటకలోని హంగల్‌. పెళ్లయ్యాక బతుకుదెరువు కోసం వీళ్ల కుటుంబం హుబ్బళ్లికి మారింది. భర్తకు సాయంగా ఉండటం కోసం ఏదైనా పనిలో కుదురుకోవాలి అనుకుంటున్న తనకు గణపతి విగ్రహాలు తయారుచేసే చోట అవకాశమొచ్చింది. ‘మొదట నేను చేయనన్నా. హిందూ దేవుళ్లను తయారు చేయడానికి సంకోచించి కాదు. నాకు దానిపై పూర్తి అవగాహన లేదన్న భయం. శిక్షణ ఇస్తామన్నాక సరేనన్నా. తొలిరోజుల్లో అందరూ విచిత్రంగా చూసినా నేను పట్టించుకునే దాన్ని కాదు. ఎంతసేపూ నా దృష్టి అందమైన దేవుని ప్రతిమను తీర్చిదిద్దడంపైనే! రోజుకు 1-2 బొమ్మలను స్వయంగా చేస్తా. ఇతరుల వాటికీ రంగులను అద్ది, అందంగా ఎలా మలచాలా అని ఆలోచిస్తా. అందరూ బాగుందని ప్రశంసిస్తోంటే ఆనందమేస్తుంది. మతాలు వేరైనా మనమంతా ఒకటే అని చాటడమే నా ఉద్దేశ’మనే సుమన్‌ నాలుగేళ్లుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తోంది. అన్నట్టూ ఈమె బృందం రూపొందించేది మట్టి విగ్రహాలు. వాటిని తీర్చిదిద్దడానికి సహజ రంగులనే వాడతారట. దీనికోసం పోరుబందర్‌ నుంచి మట్టి తెప్పించుకుంటారు. ‘గణపతి పూజంటేనే ప్రకృతి హితం, స్థాయి, లింగ భేదాల్లేకుండా అందరూ కలిసి చేసుకునేదని అర్థం. ఆ రెంటినీ మేం పాటిస్తున్నా’మని గర్వంగా చెబుతోందీమె. వీళ్లు తయారు చేసే విగ్రహాలు దేశం మొత్తానికీ పంపిణీ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని