ఒంటరి జీవితాలకు.. తోడూ... నీడా!
తల్లిదండ్రుల్లేని ఓ అమ్మాయి.. భవిష్యత్తు గురించి బంగారు కలలు కనకూడదా? భర్తలేడు... పిల్లలు ఉన్నా ఆదరించరు. అప్పుడు ఆ స్త్రీ ఎవరిపై ఆధారపడాలి? పెళ్లికాని మహిళలు జీవితాంతం నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇలా ఏ తోడూ లేని మహిళలకీ, వాళ్ల పిల్లలకీ అండగా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.
తల్లిదండ్రుల్లేని ఓ అమ్మాయి.. భవిష్యత్తు గురించి బంగారు కలలు కనకూడదా? భర్తలేడు... పిల్లలు ఉన్నా ఆదరించరు. అప్పుడు ఆ స్త్రీ ఎవరిపై ఆధారపడాలి? పెళ్లికాని మహిళలు జీవితాంతం నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇలా ఏ తోడూ లేని మహిళలకీ, వాళ్ల పిల్లలకీ అండగా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఆ వివరాలను ఫ్యూచర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు, ఈ కమిటీలో కీలక సభ్యురాలు కల్యాణంతి సచ్చిదానందం వసుంధరతో పంచుకున్నారు...
వితంతు, ఒంటరి, నిస్సహాయ మహిళలు ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. అదీ లేనివారికి ఎన్జీవోలు కాస్త అండగా ఉంటున్నాయి. అయితే ఆ సంస్థలకు సరైన నిధులు అందకపోతే వాళ్లూ ఏం చేయలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రులని కోల్పోయిన.. వితంతు మహిళల పిల్లలు నేరాలకు పాల్పడుతున్నారు. పట్టించుకునేవారు లేక మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ఇలాంటి వారందరికీ ఒక దారి చూపించేందుకే... గతేడాది సెప్టెంబరులో తమిళనాడు ప్రభుత్వం విడో, డెస్టిట్యూట్ విమెన్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ రంగాల్లో పనిచేసే నిపుణులు, ఎన్జీవో సారథులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సహా 24 మంది కీలకపాత్ర పోషించారు. వీరంతా నిస్సహాయ స్త్రీలకు తోడుగా ఉండటంపై వివిధ ప్రణాళికలు తయారు చేశారు. ఈ తరహా బోర్డు ఏర్పడటం దేశంలోనే తొలిసారి.
ఏ కష్టమొచ్చినా..
వివిధ ప్రజా పథకాల అమలు గురించి ప్రజలతో చర్చిస్తున్నప్పుడు చాలామంది ఒంటరి మహిళలు తమ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. అలా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సామాజిక సంక్షేమ, మహిళా సాధికారతశాఖ మంత్రి, ఈ కమిటీ ఛైర్మన్ పి.గీతాజీవన్‌ల సారథ్యంలో ఈ బోర్డు ఏర్పాటైంది. రాజ్యసభ ఎంపీ కనిమొళి సోము, చెంగల్పట్టు ఎమ్మెల్యే వరలక్ష్మి, మహిళలు, పిల్లల నేర విభాగంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి (ఏడీజీపీ) కల్పనా నాయక్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ఇన్నోసెంట్ దివ్యతో పాటు సేవామార్గంలో నడుస్తున్న మహిళలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఫిర్యాదు అందగానే..
వితంతు, నిస్సహాయ మహిళ నుంచి సాయం కావాలని ఫిర్యాదు అందగానే ఆమె అవసరాలకు అనుగుణంగా వివిధ శాఖల్ని అప్రమత్తం చేసేలా ఏర్పాటు చేస్తున్నాం. ముందు ఆమెకు ఆశ్రయం కల్పించడం, కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే చదువుకొనేలా చేయడం, అర్హతను బట్టి ఉద్యోగం చూపించడం, ఉపాధి అందుకోవడానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం, ఆమెకున్న అర్హతను బట్టి వివిధ పథకాల నుంచి సాయం అందేలా బోర్డు బాధ్యతలు తీసుకుంటుంది. వారి ఆరోగ్యం, వ్యక్తిగత భద్రత కూడా బోర్డు బాధ్యతే. నీడలేనివారికి వన్‌స్టాప్ విమెన్ కేంద్రాలు, హాస్టళ్లు, సేవా కేంద్రాల్లో చేర్పిస్తాం. ఒంటరి మహిళలు, వారి పిల్లల చదువులు, ఇతరత్రా భరోసా ప్రభుత్వ ఖర్చుతోనే పూర్తవుతాయి. శాఖల సమన్వయంతో ఆ పిల్లల్ని రోల్‌మోడల్‌గా మార్చి, వారు మరొకరికి సాయపడే స్థాయిలో ఉద్యోగం, ఉపాధి పొందేలా బోర్డు కార్యాచరణ రూపొందిస్తోంది.
- హిదాయతుల్లా.బి, చెన్నై
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.