తెల్లవాళ్లతో పోటీపడగలనా అనుకున్నా!

స్టెమ్‌ రంగాల్లోకి వేలమంది మహిళలను నడిపి.. ప్రతిష్ఠాత్మక ‘విమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌’ పురస్కారాన్నీ అందుకున్నారు హిమానీ ఎర్నేని.

Updated : 26 Sep 2023 07:00 IST

స్టెమ్‌ రంగాల్లోకి వేలమంది మహిళలను నడిపి.. ప్రతిష్ఠాత్మక ‘విమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌’ పురస్కారాన్నీ అందుకున్నారు హిమానీ ఎర్నేని. బయాలజీలో పీహెచ్‌డీ అందుకోవాల్సిన ఆమె.. కంప్యూటర్స్‌ వైపు ఎందుకొచ్చారు? ల్యాబ్‌లో పరిశోధనల స్థానంలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లపై ఎలా పనిచేస్తున్నారు? ఆ ప్రయాణం  ఆవిడ మాటల్లోనే..

నాన్నలా డాక్టర్‌ అవ్వాలనుకున్నా. కానీ కుదరక డిగ్రీలో చేరా. డాక్టర్‌ అనిపించుకోవాలని బలంగా కోరుకున్నానేమో పీహెచ్‌డీ వరకూ వెళ్లా. పెళ్లయ్యి అమెరికా వెళ్లడంతో అదీ పూర్తవలేదు. మాది గుంటూరు జిల్లా తడికెలపూడి. మావారు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ అమెరికాలో రిసెర్చర్‌. దీంతో నేనూ అక్కడ రిసెర్చ్‌ కొనసాగించొచ్చు అనుకున్నా. కానీ అసాధ్యమని తేలింది. కారణం.. మావారిది బయోకెమిస్ట్రీ, నాదేమో బయాలజీ. మొక్కలపై పరిశోధనలే అరుదక్కడ. ఏడాది ప్రయత్నమే కాదు.. చదువే వృథా అయ్యింది అనిపించింది. పోనీ అక్కడ ఆదరణ ఉన్నదే నేర్చుకుందాం అనుకున్నప్పుడు ‘ఐటీ’ కనిపించింది. ఎంఐఎస్‌ అనే కోర్సులో చేరా. అంటే బయాలజీ నుంచి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థినయ్యా అన్నమాట.

తొలి విజయం..

పేరుకు చేరా కానీ ఈ తెల్లవాళ్లతో పోటీపడగలనా అన్న సందేహం. అందుకే అందరూ గంట చదివితే నేను 5గంటలు కష్టపడేదాన్ని. అదనపు అసైన్‌మెంట్లనీ చేసేదాన్ని. ఎలాగైతేనేం కోర్సు పూర్తయ్యేనాటికి టాపర్‌గా నిలిచా. నేనూ ఎవరికీ తీసిపోనన్న నమ్మకమొచ్చిన సందర్భమది. చదువు పూర్తవుతూనే ఉద్యోగమొచ్చింది. లిన్‌క్లాన్‌, లీమన్‌ బ్రదర్స్‌ వంటి ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశా. అప్పట్లో వాల్‌ స్ట్రీట్‌ సంస్థల్లో పనిచేయడం గొప్ప. దానిలో చేరాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకున్నా. చివరికి 2008లో లీమన్‌ బ్రదర్స్‌లో చేరడం ద్వారా ఆ కల నెరవేర్చుకోవడమే కాదు.. వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగా. అదీ అంత సులువుగా కాలేదు. విపరీతమైన పోటీ. అందుకే అదీ నా ప్రయాణంలో పెద్ద విజయమే. ప్రస్తుతం ‘ఎక్సెజీ’లో క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌గా చేస్తున్నా. ట్రేడింగ్‌ అనగానే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ గుర్తొస్తాయి కదా! అలాంటి 40 స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లను ఒకే వేదికపై తెస్తూ సాఫ్ట్‌వేర్‌ తయారు చేశాం. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఉపయోగిస్తున్నాయి. దాని పనితీరు గమనించుకోవడం, లోపాలు తలెత్తితే సరిచేయడం మా పని.

వాళ్లకి సాయపడాలని..

‘భలేగా కొత్త కెరియర్‌లో స్థిరపడ్డావ్‌’.. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో చాలామంది నుంచి ఈ మాట వినేదాన్ని. అప్పుడే అమెరికా వచ్చాక చదివిన చదువు పనికిరాక ఖాళీగా ఉండిపోయిన మహిళలు చాలామంది ఉన్నారని అర్థమైంది. వాళ్లకు సాయపడాలనుకున్నా. 2004 నుంచి ఆసక్తి ఉన్నవారికి వారాంతాల్లో బోధన ప్రారంభించా. శిక్షణయ్యాక ఉద్యోగాలూ చూపిస్తా. ఇన్నేళ్లలో నేను సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి నడిపిన మహిళలు 3వేలకు పైమాటే! కెరియర్‌లో పైకి వెళ్లే కొద్దీ మీటింగ్‌ రూముల్లో, కాన్ఫరెన్సుల్లో ఒక్కదాన్నే మహిళని ఉండేదాన్ని. ఇల్లు, పిల్లల బాధ్యతల కోసం ఆడవాళ్లే కెరియర్‌ త్యాగం చేస్తున్నారు. తీరా బాధ్యతలు పూర్తయ్యాక వద్దామన్నా వీలుపడదు. లేదా వెనకపడిపోతారు. అలా కాకూడదని ఎవరైనా కొలువు మానేయాలనుకుంటే ప్రత్యామ్నాయాలు చూపుతూ, వీలైనంత సాయమూ చేస్తుంటా. ఓరోజు ‘విమెన్‌ ఇంపాక్ట్‌’ ప్రతినిధుల నుంచి ఫోనొచ్చింది. అమెరికాలో స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేథ్స్‌) రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతోన్న వారికి ఏటా పురస్కారాలు అందిస్తుందీ సంస్థ. అయితే ఎవరికివారు నామినేట్‌ చేసుకోలేరు. నన్ను నా విద్యార్థులు చేశారట. విని ఆశ్చర్యపోయా. అదనపు సమాచారం తీసుకున్నాక కాన్ఫరెన్స్‌కి ఆహ్వానించారు. అప్పటికా సంగతే మర్చిపోయాన్నేను. ఎందుకంటే వాళ్లు ఈ ప్రక్రియంతా పూర్తి చేసుకోడానికీ, సమాచారం రూఢీ చేసుకోవడానికీ, వడపోతలకీ రెండేళ్లు పట్టింది మరి. అప్పటికీ అవార్డు దక్కుతుందన్న నమ్మకం లేదు. చాలామంది సీఈఓలే. తీరా నా పేరు పిలవగానే ఆశ్చర్యపోయా. 23 ఏళ్ల ప్రయాణం.. నన్ను నిరూపించుకోవాలి, ఇతరులూ నిలదొక్కుకునేలా చేయాలనుకున్నా. కానీ అమెరికా వ్యాప్తంగా వేలమందిని దాటి యాభైమందిలో ఒకరిగా పురస్కారం అందుకోవడం సంతోషమేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని