ఆమె కథ.. సినిమాగా!

12 ఏళ్ల అందమైన అమ్మాయి.. యాసిడ్‌ దాడితో ముఖం చూపించలేని స్థితికి చేరింది. చీదరింపులు.. చనిపోమన్న సలహాలు. గడపదాటి కాలు బయటపెట్టడానికే భయపడిన స్థితి నుంచి స్వరకోకిలగా డాక్టర్‌ మంగళా కపూర్‌ ఎలా మారారో తెలుసుకోవాలంటే.. ఆమె కథ చదవాల్సిందే!

Updated : 21 Nov 2023 10:30 IST

12 ఏళ్ల అందమైన అమ్మాయి.. యాసిడ్‌ దాడితో ముఖం చూపించలేని స్థితికి చేరింది. చీదరింపులు.. చనిపోమన్న సలహాలు. గడపదాటి కాలు బయటపెట్టడానికే భయపడిన స్థితి నుంచి స్వరకోకిలగా డాక్టర్‌ మంగళా కపూర్‌ ఎలా మారారో తెలుసుకోవాలంటే.. ఆమె కథ చదవాల్సిందే!

‘ఎంత బాగా పాడుతున్నారో..’ మంగళా కపూర్‌ గొంతు విన్నవారెవరైనా ఈ మాట అనాల్సిందే! కానీ ఆమె రూపు చూశాకే.. ‘అరెరె.. ఎంత అన్యాయం’ అనేస్తారు. ‘నాన్నది బనారస్‌ చీరల వ్యాపారం. చాలా బాగా సాగేది. అది కొందరికి కంటగింపుగా మారింది. వ్యాపారంపై దెబ్బకొట్టడానికి మా పనివాళ్లనే తమ వైపు తిప్పుకొన్నారు. డబ్బులు ఇచ్చి యాసిడ్‌ దాడి చేయించారు. అర్ధరాత్రి.. అందరూ నిద్రపోవడంతో ఎవరికీ ఏం అర్థం కాలేదు. ఆ చీకట్లో నేను బలయ్యా. విపరీతమైన నొప్పి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. యాసిడ్‌ పోశారన్నారు. ఆ పదం వినడమూ అదే మొదటిసారి. తీరా చూస్తే నా ముఖమంతా కాలి.. నన్ను నేను చూసుకోవడానికీ భయపడ్డా. ఆపరేషన్‌ చేస్తే తిరిగి అందంగా తయారవుతావని డాక్టర్లు చెబితే ఆరేళ్లు ఆసుపత్రిలోనే గడిపా. 37 ఆపరేషన్లు.. బాలికగా వెళ్లి యువతిగా బయటికొచ్చినా పెద్దగా మార్పేమీ లేదు. చదువు ఆగిపోయింది. ఎవరూ నావైపు చూడటానికీ, మాట్లాడటానికీ ఇష్టపడేవారు కాదు’ అని గుర్తు చేసుకుంటారు మంగళ.

వీళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి. అయినవాళ్లు పలకరించకపోగా ‘మేం బంధువులమని ఎవరితోనూ చెప్పకు’ అనేవారు. వాళ్లమ్మకీ ‘ఈమె ఉండటం మీకూ భారమే. కాస్త విషమివ్వండి’ అన్న సలహాలిచ్చేవారట. కానీ అమ్మానాన్నలు మాత్రం అదే ప్రేమను చూపడం ఆవిడకో ఊరట. అందుకే సంగీతం నేర్చుకుంటానంటే ప్రోత్సహించారు. ఆపై చదువుపైనా దృష్టిపెట్టి దూరవిద్యలో పీజీ చేశారు. ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని బనారస్‌ హిందూ యూనివర్సిటీలో సంగీతం, ఆర్ట్స్‌ల్లో పీహెచ్‌డీ చేశారు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్న ఆవిడ ఉద్యోగ ప్రయత్నాలెన్నో చేశారు. అయితే ఇవ్వడానికే ఎవరూ ముందుకు రాలేదు. చివరకు బనారస్‌ విశ్వవిద్యాలయంలోని మహిళా కళాశాలలో ప్రొఫెసర్‌ అయ్యారు.

లతా మంగేష్కర్‌లా..

‘భారం అన్న మాట విన్నాక ఎవరిమీదా ఆధారపడొద్దన్న నిర్ణయానికొచ్చా. నాలుగ్గోడల మధ్యే ఉండిపోకూడదని పాటల పోటీల్లోనూ పాల్గొనేదాన్ని. నా గొంతు నచ్చి తర్వాత్తర్వాత ప్రదర్శన అవకాశాలొచ్చాయి’ అనే 70 ఏళ్ల మంగళ ఇప్పటికి వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చారు. ఈమె గొంతు విన్నవారంతా లతామంగేష్కర్‌లా ఉందంటూ కితాబులిచ్చేవారు. అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడానికి తన ఆత్మకథనే ‘సీరత్‌’ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈవిడ కథ డాక్యుమెంటరీగానూ వచ్చింది. త్వరలో మరాఠీ, హిందీ భాషల్లో సినిమాగానూ తీసుకురానున్నారు. అలా ఈమె గురించి సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ‘ప్రధాని మోదీ ఎదుట పాడటం మర్చిపోలేను. ‘స్వరకోకిల’గా గుర్తింపు తెచ్చుకున్నా. నావల్ల ఎవరికీ ఇబ్బంది అవొద్దు అనుకున్నా కానీ.. కొందరికైనా స్ఫూర్తిగా నిలుస్తుండటం ఆనందం’ అంటారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని