కొడుకుతో కలిసి సాధించింది!

‘జీవితమన్నాక సవాళ్లుంటాయి. అవి ఎంత వేగంగా వస్తోంటే... వాటిని అంత ధైర్యంగా ఎదుర్కోవాలి’ అంటారు నీలమ్‌. ఈమెది బెంగళూరు. ఇంజినీరింగ్, ఎంబీఏ పూర్తిచేశారు. ఐటీ రంగంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. పని, కొడుకుతో సరదా సాహసాలు ఆమె వ్యాపకాలు. కొడుక్కి ఎవరెస్ట్‌ ఎక్కాలని కల. ప్రయత్నిద్దామనుకునేంతలో కొవిడ్‌. దానికితోడు ఆమెకు లంబర్‌ డిస్క్‌ జారింది. సర్జరీలు అయ్యాయి.

Published : 04 Jun 2024 01:04 IST

డిస్క్‌ జారింది... వెన్నుకి సర్జరీ అయ్యింది. అలసిపోయే పనులేవీ చేయొద్దన్నారు వైద్యులు. అలాంటివాళ్లు ఎంత జాగ్రత్తగా ఉంటారు? నీలమ్‌ గోయల్‌ మాత్రం ఏకంగా ఎవరెస్ట్‌నే చేరుకున్నారు. అదీ పదకొండేళ్ల కొడుకు సాయంతో!

‘జీవితమన్నాక సవాళ్లుంటాయి. అవి ఎంత వేగంగా వస్తోంటే... వాటిని అంత ధైర్యంగా ఎదుర్కోవాలి’ అంటారు నీలమ్‌. ఈమెది బెంగళూరు. ఇంజినీరింగ్, ఎంబీఏ పూర్తిచేశారు. ఐటీ రంగంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. పని, కొడుకుతో సరదా సాహసాలు ఆమె వ్యాపకాలు. కొడుక్కి ఎవరెస్ట్‌ ఎక్కాలని కల. ప్రయత్నిద్దామనుకునేంతలో కొవిడ్‌. దానికితోడు ఆమెకు లంబర్‌ డిస్క్‌ జారింది. సర్జరీలు అయ్యాయి. శారీరకంగా అలసిపోయే పనులు చేయొద్దన్నారు వైద్యులు. అలాగని కన్నకొడుకు కలని పక్కన పెట్టలేరు. దీంతో నెమ్మదిగా శరీరానికి శ్రమను అలవాటు చేశారు. నడక, తరవాత మెట్లు ఎక్కడం... కాస్త పర్లేదు అనిపించాక చిన్నచిన్న పర్వతాలు ట్రెక్కింగ్‌ కూడా చేశారు. నాలుగేళ్ల సాధన తరవాత ఎవరెస్ట్‌ సాహసం చేశారు. 
‘రోజూ 12కి.మీ. నడక, 12 అంతస్థులు మెట్లు ఎక్కిదిగేవాళ్లం. మధ్యమధ్యలో ట్రెక్కింగ్‌ చేసేవాళ్లం. నా పట్టుదల చూసి మా వైద్యులూ ఆశ్చర్యపోయారు. తట్టుకోగలను అనుకున్నాక ఎవరెస్ట్‌ ప్రయాణం మొదలుపెట్టాం. ఒక్కోరోజూ గడిచేకొద్దీ నడక కష్టమైంది. ఎముకలు కొరికే చలి, శ్వాస ఇబ్బందులు వంటివెన్నో ఎదురయ్యాయి. అయినా నేను, మా బాబు కన్హా అబోతి పోటాపోటీగా ముందుకు సాగాం. 5365మీ. ఎత్తులోని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కి చేరుకున్నాక, అక్కడి ప్రకృతి అందాలను చూశాక ఆ శ్రమంతా మర్చిపోయాం. ట్రెక్కింగ్‌ పెద్దవాళ్లకే! పిల్లలకు కాదంటే ఒప్పుకోను. ఇది పూర్తిగా అవతలివాళ్ల ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. పైగా కన్హాకి ఇది మంచి వ్యాయామం కూడా. ఈ సిద్ధమయ్యే క్రమంలో మేం మామూలుగా కంటే చాలా దగ్గరయ్యాం. సాయపడటం, ఓపికతో సాగడం వంటివెన్నో మా బాబు నేర్చుకున్నాడు కూడా’ అంటూ ఆనందంగా చెబుతారు నీలమ్‌. అంతేకాదు... ‘జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటికి ముందు మానసికంగా సిద్ధమవ్వాలి. అప్పుడు ఎవరెస్ట్‌ అయినా, మరేదైనా సాధించడం సులువవుతుంది’ అంటోన్న నీలమ్‌ ప్రయత్నం స్ఫూర్తిదాయకమే కదూ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్