పాతికేళ్ల అమ్మాయిలు.. పెట్టుబడి పాఠాలు చెబుతున్నారు!

‘నా దగ్గరా తగినంత డబ్బు ఉంటేనా..’ ఏదైనా చేయలేకపోయినప్పుడు ఈ మాట అనుకోవడం సహజమే కదూ! కొన్నేళ్ల క్రితం సిమ్రన్‌ కూడా అలానే అనుకునేదట. కానీ ఆ ఆలోచన తప్పని కొద్దిరోజుల్లోనే అర్థమైంది తనకు.

Updated : 13 Jun 2024 15:25 IST

‘నా దగ్గరా తగినంత డబ్బు ఉంటేనా..’ ఏదైనా చేయలేకపోయినప్పుడు ఈ మాట అనుకోవడం సహజమే కదూ! కొన్నేళ్ల క్రితం సిమ్రన్‌ కూడా అలానే అనుకునేదట. కానీ ఆ ఆలోచన తప్పని కొద్దిరోజుల్లోనే అర్థమైంది తనకు. దాంతోపాటే ఆర్థిక విషయాల్లో అమ్మాయిలు ఎంత వెనకబడి ఉన్నారో కూడా తెలిసొచ్చింది. స్నేహితురాలితో కలిసి ఆమె చేసిన ప్రయత్నం పేరు ప్రఖ్యాతులే కాదు.. ఎంతోమందిని ఆర్థికబాటలో నడిపిస్తోంది.

‘అమ్మాయిలు.. డబ్బు విషయాలు మీకెందుకు?’, ‘పెట్టుబడి గురించి మీకేం తెలుస్తుంది?’ ఎంతోమంది అమ్మాయిలకు ఈ ప్రశ్నలు ఎదురవ్వడం సిమ్రన్‌ కౌర్‌ గమనించింది. తను సొంతంగా ఏదైనా చేయాలన్నా ‘నీకెందుకమ్మా నేనున్నాగా’ అనే నాన్న సమాధానం కూడా తనకు నచ్చేది కాదు. ‘నా కాళ్ల మీద నేను నిలబడి బాగా సంపాదించనీ.. అప్పుడు నాకే అడ్డూ ఉండదు’ అనుకునేదట. న్యూజీలాండ్‌లో స్థిరపడిన భారతీయ కుటుంబం వీళ్లది. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్లాండ్‌ నుంచి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్స్, యేల్‌ యూనివర్సిటీ నుంచి ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌లో కోర్సు పూర్తిచేసింది. ‘మిలియన్‌ డాలర్లు సంపాదించాలి’ అని లక్ష్యం పెట్టుకుంది. ఉద్యోగం, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులతో త్వరలోనే సంపాదించేసింది.
‘అప్పుడే నా ఆలోచనకు నేనే సిగ్గుపడ్డా. డబ్బుతో విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించొచ్చు. ఖరీదైన ఆహారం, అయిన వాళ్లందరికీ మంచి బహుమతులు, మెచ్చిన గ్యాడ్జెట్లు అన్నీ వచ్చేస్తాయనుకున్నా. అవసరాలు తీరాయి కానీ.. ఏదో వెలితి గమనించా. బాగా ఆలోచిస్తే ఆనందం లేదని అర్థమైంది. అప్పుడే డబ్బొక మాధ్యమం మాత్రమే అని తెలిసొచ్చింది. ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు... ఎంతోమంది అమ్మాయిలు డబ్బు నిర్వహణలో వెనకబడటం గమనించా. నా స్నేహితురాలు సోనియాతో కలిసి 2020లో ‘గర్ల్స్‌ దట్‌ ఇన్వెస్ట్‌’ ప్రారంభించా’నని గుర్తుచేసుకుంటుంది 25ఏళ్ల సిమ్రన్‌.

పుస్తకం.. పాడ్‌కాస్ట్‌

సోనియా భారతీయ అమ్మాయే. ఇద్దరూ చిన్నప్పట్నుంచీ ప్రాణ స్నేహితులు. సిమ్రన్‌ తన ఆలోచన పంచుకున్నాక ఇద్దరూ కలిసి ఆర్థిక అంశాలపై పరిశోధన చేశారు. మొదట టిక్‌టాక్, తర్వాత ఒక పాడ్‌కాస్ట్‌నీ ప్రారంభించారు. సిమ్రన్‌ ‘గర్ల్స్‌ దట్‌ ఇన్వెస్ట్‌’ పేరుతో పుస్తకాన్నీ రచించింది. ఇది అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలవడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ప్రాణ స్నేహితుల మధ్య చర్చ.. చిన్నచిన్న అంశాలను అర్థమయ్యేలా చెప్పే తీరే ఎంతోమందిని ఆకర్షించాయంటారీ ద్వయం. పెట్టుబడి విషయంలో చేసిన పొరపాట్లు వంటివీ చెబుతారట. 40లక్షల పాడ్‌కాస్ట్‌ డౌన్‌లోడ్స్, 3 లక్షలకుపైగా సోషల్‌మీడియా ఫాలోయర్లున్నారు. ‘మీ ఆర్థిక విషయాలను మీరే నిర్వహించుకోండి అన్న నినాదంతో సాగుతున్నాం. సరదా సంభాషణలతో సాగుతుండటంతోనే ఆదరణ. అందుకే కొంత మొత్తం తీసుకొని చిన్న చిన్న కోర్సులనూ అందిస్తున్నాం. సంపాదించుకుంటూనే ఎందరో ఆడవాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయడం చాలా సంతృప్తినిస్తోంద’నే సిమ్రన్‌ ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30, విమెన్‌ లీడర్‌షిప్‌తోపాటు సోనియాతో కలిసి ఆసియా 30 అండర్‌ 30 జాబితాల్లోనూ నిలిచింది. దక్షిణాసియా మహిళల కోసం ‘ఇండియన్‌ ఫెమినిస్ట్‌’ ప్రారంభించింది. తమ గళాన్ని, సంస్కృతిని చాటిచెప్పే అవకాశమిచ్చే ఈ నెట్‌వర్క్‌లో ప్రియాంక చోప్రా, మోడల్‌ పద్మా లక్ష్మి వంటివారూ సభ్యులే! ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న సిమ్రన్, సోనియా టెడెక్స్‌ స్పీకర్లు కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్