Updated : 15/06/2021 12:44 IST

గోధుమల ఘుమఘుమలు

‘కొంచమే తిన్నా.. కడుపు నిండుగా... మనసంతా హాయిగా ఉండాలి. అలాగే పనిలో పనిగా బోల్డన్ని పోషకాలూ అందాలి’ అనుకుంటున్నారా... అయితే మరో ఆలోచన లేకుండా పెద్ద గోధుమ రవ్వ(దాలియా)ను ఎంచుకోవచ్చు. దీంతో రకరకాల ప్రయోగాలూ చేసి ఆస్వాదించవచ్చు.

కిచిడి

తయారీ: కడాయిలో నెయ్యి వేసి దాలియాను దోరగా వేయించి పక్కన పెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్‌, టొమాటో ముక్కలు, పెసరపప్పు ఒకదాని తర్వాత మరోటి వేయాలి. వీటిని తక్కవ మంట మీద రెండు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన దాలియా వేసి, నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్‌ మూత పెట్టి మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.
కావాల్సినవి: దాలియా- అరకప్పు, అరగంటపాటు నానబెట్టిన పెసరపప్పు- అరకప్పు, నెయ్యి, జీలకర్ర- టీస్పూన్‌ చొప్పున, ఇంగువ- చిటికెడు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి- రెండు, చిన్నగా కోసిన టొమాటో- ఒకటి, బఠానీ, క్యారెట్‌ ముక్కలు- కప్పు చొప్పున, పసుపు- పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్‌, ఉప్పు- తగినంత,

సూప్‌

కావాల్సినవి: దాలియా- కప్పు, చిన్న ముక్కలుగా కోసిన టొమాటోలు- రెండు, సన్నగా తరిగిన క్యారెట్‌- ఒకటి, ఉప్పు- తగినంత, చిన్నగా కోసిన వెల్లుల్లి ముక్కలు- రెండు టీస్పూన్లు, మిరియాల పొడి- టీస్పూన్‌, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ: దాలియాను బాగా కడిగి పావుగంట సేపు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో కప్పు నీళ్లు పోసి టొమాటో, క్యారెట్‌ ముక్కలు వేసి మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీజార్‌లో వేసి మెత్తగా పేస్టు చేయాలి. కడాయిలో నూనె వేడిచేసి వెల్లుల్లి ముక్కలు, నానబెట్టిన దాలియా వేసి వేయించాలి. దీంట్లో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత ఉప్పు వేసి మూతపెట్టి పావుగంటపాటు ఉడికించాలి. ఇప్పుడు టొమాటో, క్యారెట్‌ పేస్టు వేసి అవసరమైతే కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. చివరగా మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి.

ఇడ్లీ

కావాల్సినవి: దాలియా- కప్పు, పెరుగు- అరకప్పు, క్యారెట్‌ తురుము- పావుకప్పు, సన్నగా కోసిన పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర తరుగు- టేబుల్‌స్పూన్‌, కచ్చాపచ్చాగా నలిపిన కరివేపాకు రెబ్బ- ఒకటి, ఉప్పు- తగినంత, తాలింపు కోసం: ఆవాలు- పావు టీస్పూన్‌, మినప్పప్పు- అర టీస్పూన్‌, ఇంగువ- చిటికెడు, నెయ్యి- టేబుల్‌స్పూన్‌.
తయారీ: కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి దాలియాను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మరికాస్త నెయ్యి వేసి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, క్యారెట్‌ వేసి తక్కువ మంట మీద వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేయించిన దాలియాలో వేసి, పెరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు కలపాలి. మిశ్రమం మరీ పలచగా, గట్టిగా లేకుండా చూసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు కలపాలి. దీన్ని అరగంటపాటు పక్కన పెట్టేయాలి. పాత్రలకు నూనె రాసుకుని ఇడ్లీలు వేయాలి. కుక్కర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి పావుగంటపాటు వీటిని ఉడికించాలి. తర్వాత వెంటనే మూత తీయకుండా పది నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఈ ఇడ్లీలను ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి.

హల్వా

కావాల్సినవి: దాలియా- కప్పు, పంచదార పొడి- అరకప్పు, నెయ్యి- అరకప్పు, యాలకులపొడి- చిటికెడు, జీడిపప్పు, పిస్తా పలుకులు- పావుకప్పు, కిస్‌మిస్‌, తురిమిన బాదంలు- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: కడాయిలో నెయ్యి వేడిచేసి తక్కువ మంట మీద దాలియాను వేయించాలి. దీంట్లో పంచదార పొడి, రెండు కప్పుల వేడినీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ వేసి కలుపుతూ ఉండాలి. ఉడికిన తర్వాత హల్వాను వేరే ప్లేటులోకి తీసుకోవాలి. చివరగా బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను పైన చల్లాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్