Updated : 16/03/2021 18:46 IST

అందరిపై అరిచేస్తోంది!

మా చెల్లి నాలుగు నెలల గర్భిణి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎవరూ తన ముందు మాట్లాడుకుంటున్నా, నవ్వినా భరించలేకపోతోంది. వారిపై గట్టిగా అరిచేస్తోంది. అందరూ తనతోనే మాట్లాడాలంటోంది. ఇదేమైనా మానసిక సమస్యా? ఈ సమయంలో ఇలా జరుగుతుందా?

- ఓ సోదరి

గర్భం దాల్చినప్పుడు సాధారణంగా శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తాయి. వీటివల్ల గర్భిణుల్లో కొంత చికాకు, విసుగు, నిద్రపట్టకపోవడం, ఒక్కోసారి ఆందోళనా, దుఃఖం లాంటివి కనిపించొచ్చు. మీ చెల్లిది హార్మోన్లలో మార్పుల వల్ల వచ్చిన తాత్కాలిక సమస్యా? లేదా జన్యుపరంగా వచ్చే తీవ్రమైన మానసిక వ్యాధా.. అనేది తెలుసుకోవాలి. మీరేం చేస్తారంటే మీ కుటుంబంలో జన్యుపరంగా ఎవరికైనా మానసిక వ్యాధి ఉందేమో కనుక్కోండి. అలాగే ఆమె కూడా ఇంతకుముందు ఏదైనా మానసిక వ్యాధితో బాధపడి ఉంటే అది ప్రెగ్నెన్సీ సమయంలో మళ్లీ బయటపడే అవకాశం ఉండొచ్చు.  మీ చెల్లిని ఓసారి మానసిక నిపుణుల వద్దకు తీసుకువెళ్లండి. వారు తనతో మాట్లాడి, తగిన పరీక్షలు చేసి సమస్య ఏమిటో కనుక్కుంటారు. ఒకవేళ ఆమెకు, ఆమె వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే కౌన్సెలింగ్‌ చేసి పంపిస్తారు. అలా కాకుండా తనలో తాను మాట్లాడుకోవడం, చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని చెప్పడం, తనని తాను హింసించుకోవడం, ఇతరులపై అపనమ్మకం, అనుమానం, అకారణంగా కోపం... లాంటివి ‘సైకోసిస్‌’ అనే మానసిక వ్యాధి లక్షణాలు. ఈ సమయంలో ఇలాంటి ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉండొచ్చు. దీనికి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కంగారు పడాల్సిన పనిలేదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్