నిజ జీవిత షేర్నీ

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించిన షేర్నీ చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంటే... మరోవైపు సోషల్‌ మీడియాలో అందరూ మహిళా ఐఎఫ్‌ఎస్‌ అధికారి కేఎం అభర్నాను గుర్తు  తెచ్చుకుంటున్నారు.

Updated : 21 Jun 2021 01:06 IST

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించిన షేర్నీ చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంటే... మరోవైపు సోషల్‌ మీడియాలో అందరూ మహిళా ఐఎఫ్‌ఎస్‌ అధికారి కేఎం అభర్నాను గుర్తు  తెచ్చుకుంటున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్యం, స్ఫూర్తి షేర్నీ కథలో కనిపిస్తున్నాయంటున్నారు. వైరల్‌ అవుతోన్న ఈ మహిళాధికారి కథ మనమూ తెలుసుకుందాం.

2013 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా మహారాష్ట్ర అటవీశాఖలోకి అడుగుపెట్టిన అభర్న డిప్యూటీ కన్జెర్వేటర్‌గా తనదైన ముద్ర వేశారు. గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్న ఆడపులి అవని కదలికలను గుర్తించడంలో సాహసోపేతంగా వ్యవహరించారు. ఈమె సేవలకుగాను కజిరంగా నేషనల్‌ పార్కుకు ఇంచార్జిగా పదోన్నతిని అందుకున్నారు.

15 మందిని పొట్టనపెట్టుకుంది

మహారాష్ట్రలోని పంధార్‌కావ్డా డివిజన్‌లో ఆడపులి ‘అవని’ 2018లో తీవ్ర సంచలనం కలిగించింది. దాని నోటికి చిక్కి 15మంది చనిపోయారు. ఆ సమయంలో అభర్న అక్కడ డిప్యూటీ కన్జర్వేటర్‌గా చేరారు. ‘నేనక్కడికి వెళ్లేసరికి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రజలు కోపోద్రేకాలతో ఉన్నారు. ఆ పులిని బంధించడమే నా లక్ష్యమైంది. ఆ మేన్‌ఈటర్‌ సంచరించే ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించా. తొమ్మిది మంది మహిళా గార్డుల బృందాలను నియమించా. వారు ప్రజలను అప్రమత్తం చేసేవారు. ఓ మొబైల్‌ స్క్వాడ్‌ను నియమించా. వీరు కాక టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరుతో 50 మంది కమాండోలు, షార్ప్‌ షూటర్‌, పోలీసులు గాలిస్తూ ఉండేవారు. ఎక్కడికక్కడ బోనులు ఏర్పాటు చేశాం. 12 చోట్ల గుర్రాలు, మేకలను ఎరగా ఉంచాం. కానీ అది చాలా తెలివిగా మా కళ్లుకప్పి దాని పిల్లలకు ఆ ఆహారాన్ని తీసుకెళ్లేది. డ్రోన్‌ కెమెరాతో అడవిని గాలించేవాళ్లం. 2018, నవంబరులో ఒకచోట దాన్ని గుర్తించి చుట్టుముట్టాం. ట్రాన్‌క్విలైజర్‌ తుపాకీతో షూట్‌ చేశా. స్పృహ తప్పి, అంతలోనే లేచి, తప్పించుకుంది. అయితే శరీరంలో మత్తు ఇంకా ఉండటంతో,  దాన్ని వెంటాడాం. ఓ షూటర్‌ దాన్ని షూట్‌ చేశాడు. ఆ గాయంతో అక్కడి నుంచి అడవిలోకి వెళ్లి, ఆ తర్వాత చనిపోయింది. అవని ఆపరేషన్‌కు నేతృత్వం వహించడం ఎప్పటికీ మరవలేను’ అని చెబుతున్న అభర్న ప్రస్తుతం మహారాష్ట్రలో బాంబూ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్