ఆపరేషన్‌ అవసరమా?

నా వయసు 25. బరువు 69 కిలోలు. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉన్నా. నాకు సహజ ప్రసవమవుతుందా? ఆపరేషన్‌ అవసరమా? ఆపరేషన్‌ అంటే భయంగా ఉంది. ఈ రెండింటిలో ఏది సురక్షితం?

Updated : 19 Jul 2021 05:03 IST

నా వయసు 25. బరువు 69 కిలోలు. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉన్నా. నాకు సహజ ప్రసవమవుతుందా? ఆపరేషన్‌ అవసరమా? ఆపరేషన్‌ అంటే భయంగా ఉంది. ఈ రెండింటిలో ఏది సురక్షితం?

- ఓ సోదరి, హైదరాబాద్‌

మీకు సంబంధించిన ఆరోగ్య వివరాలేమీ తెలియకుండా సహజ ప్రసవమవుతుందా లేదా సిజేరియన్‌ అవసరమవుతుందా అన్నది ముందుగా చెప్పడానికి వీలు కాదు. ఈ రోజుల్లో రెండూ సురక్షితమే. సహజ ప్రసవం కోసం ప్రయత్నించడం వల్ల తల్లికి గానీ, బిడ్డకు గానీ హాని జరుగుతుందన్న సూచనలుంటేనే సిజేరియన్‌ చేస్తారు. అలాంటి పరిస్థితులేమీ లేనప్పుడు తప్పకుండా సహజ ప్రసవం కోసమే ప్రయత్నిస్తారు. మీకు, కడుపులోని పాపాయికి ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే సిజేరియన్‌ ఎక్కువ సురక్షితం. తల్లి వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు (రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు), ప్రసవ సమయంలో  కటి వలయంలో చోటు సరిపోకపోవడం వల్ల కాన్పు కష్టమై బిడ్డ చనిపోయే ప్రమాదమున్నా లేదా బిడ్డ మెదడుకు దెబ్బ తగిలే సూచనలున్నా... ఆపరేషన్‌ అవసరమవుతుంది.

బిడ్డ బరువు ఎక్కువగా ఉండి.. తల్లి కటి వలయంలో పట్టదని అనుకున్నప్పుడు, అలాగే శిశువు.. తలతో కాకుండా ఎదురుకాళ్లు, అడ్డంగా ఉన్నా, కవలలున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో బిడ్డకు గర్భంలో ఎదుగుదల సరిగ్గా లేకపోయినా (ఇంట్రా యుటరైన్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌- ఐయూజీఆర్‌) వైద్యులు సి-సెక్షన్‌  చేస్తామంటారు. మాయ ముందుగానే గర్భాశయం నుంచి విడిపోయి రక్తస్రావం జరిగినప్పుడు (అబ్‌రప్షన్‌) లేదా మాయ గర్భాశయ కిందభాగంలో ద్వారంపైన అతుక్కున్నా లేదా మాయలో రక్తం గడ్డలు లేదా కణతులు ఏర్పడినా శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఒక్కోసారి నొప్పులు మొదలైన తర్వాత గర్భాశయ ద్వారం తెరుచుకోకపోయినా, బిడ్డకు ఆక్సిజన్‌ సరిగా సరఫరా కాకుండా హృదయ స్పందన రేటు పడిపోయినా, బిడ్డ గర్భాశయంలోనే మలవిసర్జన చేసినా... ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా సి-సెక్షన్‌ చేయాల్సి రావొచ్చు. అందుకని మీరు అతిగా ఆలోచించడం మానేసి వైద్యులపై భరోసా ఉంచండి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ వారి సలహాలు, సూచనలు పాటించండి. మీకు ఆ సందర్భాన్ని బట్టి ఏది సురక్షితమనేది వైద్యులు నిర్ధరిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని