Updated : 11/08/2021 12:36 IST

పెళ్లయినా అతనంటే ఇష్టం!

మా పెళ్లై ఆరేళ్లయినా నా భర్త సీరియస్‌గా ఉంటారు. సరదాగా మాట్లాడినా విసుక్కుంటారు. ఇంటా బయటా పని తప్ప సంతోషం లేదు. ఈమధ్య కొత్తగా వచ్చిన కొలీగ్‌తో పరిచయం పెరిగింది. అతనికీ పెళ్లయింది. సరదాగా మాట్లాడుతూ నాకు పనిలో సాయపడుతుంటాడు. నేనతన్ని ఇష్టపడుతున్నాను. నా భర్త నిరాదరణతో ఇతడికి దగ్గరవుతున్నాను అనిపిస్తోంది. అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను.

- ఓ సోదరి, బెంగళూరు

ముభావంగా ఉండటం, నచ్చని పనులు చేస్తే విసుక్కోవడం- అతని వ్యక్తిత్వం. చిన్నప్పటి నుంచీ ఉన్న స్వభావం తేలిగ్గా మారదు. మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనట్టే తనూ మార్చుకోలేడు.  మీ భర్త తీరు మీకు ఆనందాన్నివ్వడం లేదే గానీ తాగడం, వేధించడం లాంటివి లేవు. ఇన్నేళ్లు కాపురం చేశాక, ఇప్పుడు కొలీగ్‌లో నచ్చిన గుణాలు కనిపించాయి. కానీ అతను తన భార్యతో ఎలా ఉంటాడో ఆలోచించండి. మనం ఇంట్లో ఎలా ఉన్నా బయట ఎమోషన్స్‌ను నియంత్రించుకుని మంచిగా కనిపిస్తాం. ఎవరూ అసలు వ్యక్తిత్వాన్ని చూపరు. మీ భర్త కూడా ఆఫీసులో బానే ఉంటాడు. కొలీగ్‌ నైజం అది కాకపోవచ్చు. ఇంకో విషయమేమంటే స్త్రీలు తమ బాధల గురించి ఇతర పురుషులతో చెబితే దాన్ని అవకాశంగా తీసుకుని ఆకర్షించేందుకు చూస్తారు. లేదా మీరే ఆకర్షితులై ఉండొచ్చు. కానీ సమాజంలో కట్టుబాట్లున్నాయి. న్యాయవ్యవస్థ ఉంది. మీ ఆసక్తి చూసి తను ఎడ్వాంటేజ్‌ తీసుకోవచ్చు. అతనితో మీరు చనువుగా ఉన్నట్లు తెలిస్తే మీ భర్త, అతని భార్య కూడా అసహ్యించు కోవచ్చు. కనుక మీ స్నేహం పెరగకుండానే పరిణామాల గురించి ఆలోచించండి. మీ భర్తను అతనితో పోల్చి చూడొద్దు. ఆకర్షితులవుతున్నప్పుడు మీకు మీరే పగ్గాలు వేసుకోవాలి. లేదంటే సమస్య బయటపడలేనంత జటిలమవుతుంది. మీ భర్త అమ్మానాన్నలు లేదా అక్కాచెల్లెళ్లు మీ మానసిక స్థితిని, అతన్నుంచి మీరేం కోరుకుంటున్నారు చెప్పగలిగితే మార్పు వస్తుందేమో చూడండి. లేదా మీరే మాట్లాడండి! తప్పు పడుతున్నట్టు కాకుండా అతనితో కలిసుండాలని ఉందని,  తనెలా ఉంటే మీకు సంతోషమో చెప్పండి. అతను ఒప్పుకొంటే ఇద్దరూ కౌన్సిలింగుకు వెళ్లండి. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని