ఆ ప్రాంతం పొడిబారుతోంది!

ఈ వయసులో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. ఈ దశను ‘మెనోపాజ్‌ ట్రాన్సిషన్‌’ అంటారు. అంటే పునరుత్పత్తి వయసు నుంచి నెలసరి పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయం అన్నమాట. అండాశయాల నుంచి వచ్చే హార్మోన్లు తగ్గిపోవడంతో మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఫాలికిల్‌ స్టిమ్యులేటింగ్‌....

Published : 04 Sep 2021 02:24 IST

నా వయసు నలభై ఐదు. వెజైనా ప్రాంతంలో ఎప్పుడూ పొడి పొడిగా, వేడిగా అనిపిస్తోంది. ఇదేమైనా అనారోగ్యమా?

- ఓ సోదరి

ఈ వయసులో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. ఈ దశను ‘మెనోపాజ్‌ ట్రాన్సిషన్‌’ అంటారు. అంటే పునరుత్పత్తి వయసు నుంచి నెలసరి పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయం అన్నమాట. అండాశయాల నుంచి వచ్చే హార్మోన్లు తగ్గిపోవడంతో మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఫాలికిల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌)ను ఎక్కువగా తయారు చేస్తుంది. ఈ హార్మోన్‌ ఉద్దేశం అండాశయాలను బాగా ఉత్తేజపరిచి ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లను అధికంగా తయారుచేయడం. అయితే అండాల నిల్వ బాగా తగ్గిపోవడం వల్ల ఈ వయసులో అది సాధ్యం కాదు. వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, రాత్రిపూట మెలకువ రావడం, తరచుగా మూత్ర సమస్యలు తలెత్తడం, అలసట, కండరాల నొప్పులు... ఇవన్నీ కూడా ఈ దశలో కనిపించే సాధారణ లక్షణాలు. అలాగే వెజైనాలోనూ ఈస్ట్రోజెన్‌ రిసెప్టార్స్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ లేకపోవడంతో వెజైనాలోని చర్మం బాగా పలచబడి పోతుంది. అలాగే దాని నుంచి వెలువడే స్రావాలన్నీ ఆగిపోవడంతో అక్కడ పొడి బారుతుంది. ఈ దశను ‘ఎట్రోఫిక్‌ వెజైనైటిస్‌’ అంటారు. ఈ మార్పులన్నీ నెలసరి ఆగిపోవడానికి ముందుగానే మొదలై అయిదు నుంచి పది సంవత్సరాల వరకు కొనసాగుతాయి. దీన్నుంచి ఉపశమనం పొందాలంటే గైనకాలజిస్ట్‌ సలహాతో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ను మాత్రలు లేదా వెజైనల్‌ క్రీమ్‌ల రూపంలో వాడుకోవచ్చు. కలయిక సమయంలో అసౌకర్యంగా అనిపిస్తే, వెజైనల్‌ లూబ్రికెంట్స్‌ వాడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని