జుట్టు.. గడ్డిలా అవుతోంది

ఆఫీసు, ఇంటి పనితో జుట్టు మీద దృష్టి పెట్టలేక పోతున్నా. అదేమో గడ్డిలా తయారవుతోంది, ఊడుతోంది. పరిష్కారమేంటి?

Published : 07 Sep 2021 00:48 IST

ఆఫీసు, ఇంటి పనితో జుట్టు మీద దృష్టి పెట్టలేక పోతున్నా. అదేమో గడ్డిలా తయారవుతోంది, ఊడుతోంది. పరిష్కారమేంటి?

- శాంతి, వైజాగ్‌

ఎండలో ఎక్కువగా బయటికి వెళ్లేవాళ్లకి జుట్టు మృదుత్వం కోల్పోయి బరకగా తయారవుతుంది. వాతావరణంలో ఆకస్మిక మార్పులూ ఇందుకు కారణమవుతాయి. ఒక్కోసారి పోషకాలు తగ్గినా ఇలా అవుతుంది. సరైన ఆహారం, తగిన మోతాదులో నీరు తీసుకోకపోవడం వల్ల ఇది తలెత్తుతుంది. ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారంతోపాటు విటమిన్లు, జింక్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా అందించే పండ్లు, కూరగాయలు, నట్స్‌ను రోజూ తీసుకోవాలి. సప్లిమెంట్ల ద్వారా అయినా అందించాలి. ఇంట్లో ఉన్నప్పుడు జుట్టును గట్టిగా ముడేస్తుంటారు చాలామంది. ఫలితంగా మొదళ్లపై ప్రభావం పడి ఊడుతుంది. మానసిక ఒత్తిడీ, నిద్ర లేకపోవడమూ ఈ సమస్యకు కారణాలే. కాబట్టి శారీరక, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. అతిగా కెమికల్‌ ట్రీట్‌మెంట్లు చేయించుకోవద్దు. కరోనా సహా ఏవైనా వ్యాధులకు గురైనా, రక్తహీనత, పీసీఓడీ ఉన్నా, యాంటీ డిప్రెషన్‌, థైరాయిడ్‌కు మందులు వాడుతున్నా కురులు రాలతాయి.

తడి జుట్టుకి బ్లో డ్రై, ఐరన్‌ వంటివి తరచూ చేయొద్దు. చేయాల్సి వస్తే ఎస్‌పీఎఫ్‌ హీట్‌ ప్రొటెక్షన్‌ సీరమ్‌, స్ప్రేలను తప్పక రాయాలి. అలాగే వేళ్లతోనే చిక్కులు తీయాలి. కండిషనర్‌ తప్పక ఉపయోగించాలి. తల స్నానానికి కనీసం రెండు గంటల ముందు తప్పకుండా ఆయిల్‌తో మసాజ్‌ చేయాలి. గాఢత లేని షాంపూనే ఉపయోగించాలి. వారానికి 2-3 సార్లకు మించి తలస్నానాలొద్దు. ఎక్సర్‌సైజ్‌కీ సమయం కేటాయించాలి. వారానికోసారి.. తేెనె, ఆలివ్‌ నూనె సమపాళ్లలో మిక్స్‌ చేసి తలకుపట్టించి షవర్‌ క్యాప్‌/ కవర్‌ చుట్టాలి. అరగంట తర్వాత షాంపూ చేయాలి. లేదా మెంతులను రాత్రంతా పెరుగులో నానబెట్టి దానిలో మందార పూలు, ఆకులు, కలబంద కలిపి మిక్సీ పట్టాలి. దీన్నీ ప్యాక్‌లా పెట్టుకోవాలి. గంట తర్వాత కడిగేసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని