బెల్టుతో పొట్ట తగ్గుతుందా?

కాన్పు ఎన్నాళ్ల కిందట జరిగింది. ప్రస్తుతం మీ బరువు, బాడీమాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ) ఎంత ఉన్నాయనే వివరాలు కావాలి. పొట్ట పెద్దగా కనపడటానికి చాలా కారణాలుంటాయి. కాన్పు తర్వాత ఎత్తుగా కనిపిస్తోందంటే కండరాలు గర్భధారణ సమయంలో మరీ ఎక్కువగా సాగి డెలివరీ అయ్యాక సాధారణ స్థితికి రాకుండా ఇంకా వదులుగానే

Published : 18 Sep 2021 01:31 IST

నాకిద్దరు పిల్లలు. రెండో బాబు పుట్టిన తర్వాత బాగా లావయ్యా. పొట్ట కూడా పెరిగింది. బెల్టు పెట్టుకుంటే పొట్ట తగ్గుతుందా? దీన్ని ఎలా తగ్గించుకోవాలి?  

- ఓ సోదరి


కాన్పు ఎన్నాళ్ల కిందట జరిగింది. ప్రస్తుతం మీ బరువు, బాడీమాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ) ఎంత ఉన్నాయనే వివరాలు కావాలి. పొట్ట పెద్దగా కనపడటానికి చాలా కారణాలుంటాయి. కాన్పు తర్వాత ఎత్తుగా కనిపిస్తోందంటే కండరాలు గర్భధారణ సమయంలో 

మరీ ఎక్కువగా సాగి డెలివరీ అయ్యాక సాధారణ స్థితికి రాకుండా ఇంకా వదులుగానే ఉండటం ఒక కారణం.

రెండోది.. బరువు పెరగడం వల్ల పొట్టలో  కొవ్వు పేరుకుపోతుంది. మూడో కారణం... గర్భిణిగా ఉన్న సమయంలో కండరాలు పక్కకు తొలగిపోవడం. చివరగా కాన్పు సిజేరియన్‌ ద్వారా జరిగి ఉంటే అక్కడ కణజాల పొరల్లో ఖాళీ ఏర్పడి, కుట్లు సరిగ్గా అతుక్కోక ఆ సందుల్లో నుంచి పొట్ట లోపలి అవయవాలు బయటకు ఉబ్బెత్తుగా రావడం జరగొచ్చు. దీన్ని ఇన్‌సెషనల్‌ హెర్నియాగా పిలుస్తారు. అయితే అత్యంత సాధారణ కారణమైతే కండరాల బలహీనతే. ఏదేమైనా మిమ్మల్ని పరీక్షించి చూస్తే వీటిలో దేనివల్ల మీకు పొట్ట ఎత్తుగా కనిపిస్తోందో అర్థమవుతుంది. బెల్ట్‌ పెట్టుకున్నంత వరకు అది పొట్ట కండరాలకు ఆసరాగా, మీకు సౌకర్యంగా ఉంటుంది. కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. నిజానికి బెల్టు వల్ల పొట్ట తగ్గదు. వదులైన కండరాలు తిరిగి పూర్వపు స్థితికి రావాలంటే  వ్యాయామం తప్పనిసరి. పొట్ట, నడుము దగ్గర ఉండే కోర్‌ మజిల్స్‌ దృఢంగా మారడానికి క్రంచెస్‌, స్ట్రెయిట్‌ లెగ్‌ రైజింగ్‌, ప్లాంక్స్‌ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుంది.

లైపో సెక్షన్‌ ప్రక్రియ ద్వారా అదనపు కొవ్వును తొలగించుకోవచ్చు. హెర్నియా ఉన్న వారికి శస్త్రచికిత్స ఒకటే మార్గం. అయితే  ఇక  సంతానం అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలాంటి సర్జరీలు చేయించుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని