ప్రాణ స్నేహితురాలితో ఇబ్బంది

ఉద్యోగంలో చేరిన కొత్తలో.. నా తర్వాత మూడు నెలలకు ఇంకో అమ్మాయి చేరింది. ఏడాదికే మంచి స్నేహితులమయ్యాం. కొన్నిసార్లు ఒకే బృందంలో ఇంకొన్నిసార్లు వేర్వేరుగా పనిచేశాం. ప్రాణ స్నేహితురాలైన తనవల్లే ఇప్పుడు ఇబ్బందవుతోంది. తన జీవితంలో చిన్న విషయాన్నీ నాతో పంచుకుంటోంది.

Published : 02 Oct 2021 00:58 IST

ఉద్యోగంలో చేరిన కొత్తలో.. నా తర్వాత మూడు నెలలకు ఇంకో అమ్మాయి చేరింది. ఏడాదికే మంచి స్నేహితులమయ్యాం. కొన్నిసార్లు ఒకే బృందంలో ఇంకొన్నిసార్లు వేర్వేరుగా పనిచేశాం. ప్రాణ స్నేహితురాలైన తనవల్లే ఇప్పుడు ఇబ్బందవుతోంది. తన జీవితంలో చిన్న విషయాన్నీ నాతో పంచుకుంటోంది. దానివల్ల ఆఫీసులో కనీసం రెండు గంటల సమయం వృథా అవుతోంది. తను శ్రేయోభిలాషి అని తెలిసినా నాకిది ఇబ్బందిగా ఉంది. ఏం చేయను?

- హేమశ్రీ, హైదరాబాద్‌

ని చేసేచోట ప్రాణ స్నేహితురాలుంటే ఆఫీసుకి వెళ్లడం ఆనందాన్నిస్తుంది. కానీ దానివల్ల ఇబ్బందులూ ఉంటాయి. స్నేహితురాలి కోసం పనిని నిర్లక్ష్యం చేస్తున్నారంటేనే.. మీరు చేసుకోవాల్సిన మార్పుకి సంకేతమది. ముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలను వేసుకోండి. ఈ బంధం కెరియర్‌లో మీరు కోరుకున్న అభివృద్ధికి దగ్గర చేస్తోందా? ఇద్దరమూ ఒకేరకంగా కృషి చేస్తున్నారా? అని! దీంతో మీ జీవితంతో పోలిస్తే అవతలి వారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారా? వారి భావోద్వేగాలు మీపై ఎంత వరకూ ప్రభావం చూపుతున్నాయన్న వాటిపై స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి ఎంతవరకూ మారాలన్న విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అలాగని ఉన్నఫళంగా బంధాన్ని తెంపేసుకోవాల్సిన అవసరం లేదు. కలిసి భోజనానికి నిరాకరించడం లాంటివీ చేయొద్దు. లేదంటే ఒక ముఖ్యమైన ఆసరాని కోల్పోయినవారవుతారు. చిన్న మార్పులు చేసుకుంటే మీ బంధాన్ని సరైన దిశకు మళ్లేలా చేసుకోవచ్చు. నీతో తక్కువ సమయమే గడుపుతానని కచ్చితంగా స్నేహితులతో చెప్పడం కష్టం. కాబట్టి కమ్యూనికేషన్‌ మార్గాన్ని మార్చండి. ఎక్కువగా కలవడం వల్ల సమయం వృథా అవుతోంది కాబట్టి, కాల్స్‌ మాట్లాడతానని చెప్పండి. వీడియో, ఆడియో కాల్స్‌లోనూ సమయం వృథా అవుతోంటే మెసేజ్‌లకు మారండి. మీరు భౌతిక దూరాన్ని పాటించాలనుకుంటున్నారు. కాబట్టి, దీన్ని అలవాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. మీ స్నేహితురాలూ కొంత కష్టంగా భావించొచ్చు. అలాగని మీరు కరిగిపోవద్దు. ఇప్పుడు ఈ చిన్ని హద్దులను విధించకపోతే రేపు ఇద్దరూ నష్టపోవాల్సి వస్తుంది. అవసరమైతే దీనిపై స్పష్టతనూ ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్