ప్రేమించకపోతే చంపేస్తానంటున్నాడు...

మాది సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం. ఏడాదిగా ఓ అబ్బాయి ప్రేమించానని వేధిస్తున్నాడు. తనకు దక్కకపోతే చంపేస్తానంటున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే చదువు మాన్పించేస్తారు.

Published : 04 Oct 2021 01:32 IST

మాది సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం. ఏడాదిగా ఓ అబ్బాయి ప్రేమించానని వేధిస్తున్నాడు. తనకు దక్కకపోతే చంపేస్తానంటున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే చదువు మాన్పించేస్తారు. బాగా చదివి, మంచి ఉద్యోగం చేయాలనేది నా కల. ఏమవుతుందోననే భయంతో నిద్రపట్టడం లేదు.

- ఓ సోదరి, ఏలూరు

కుటుంబ సభ్యులు సరిగా పట్టించుకోకపోవడం, విలువలు తెలియకపోవడం, మానసిక ఎదుగుదల లోపించడం లేదా సరైన వ్యక్తిత్వం కాకపోవడం వంటి కారణాలతో కొందరలా తయారవుతారు. ఈ సంగతి చెబితే మీ చదువు ఆపేస్తారేమోనని ఒక కోణంలో నుంచే ఆలోచిస్తున్నారు. కానీ ఇంటికొచ్చి కూడా వేధిస్తున్న సంఘటనలున్నాయి. అతడు వేధిస్తున్నాడే కానీ... ఇందులో మీ తప్పేం లేదుగా! ప్రాణానికి ముప్పు రాకుండా, చదువుకు ఆటంకం కలగకుండా ఉండాలంటే మీరు ధైర్యం చేయాలి. మీ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడం అవసరం.  పోనీ అమ్మానాన్నలు కాకుంటే బంధువుల్లో ధైర్యం, సరైన నిర్ణయం తీసుకోగలిగే నేర్పూ, ఓర్పూ ఉన్నవారికి చెప్పండి. మీ భయాలనూ ప్రస్తావించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోనిబ్బరం కోల్పోవద్దు. ఎంత చేసినా తాను కోరుకున్నది తనకే దక్కాలన్న మూర్ఖత్వంతో ఉన్నాడంటే మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కాలేజీకో, మరెక్కడికో వెళ్తున్నప్పుడు వెంటాడే ప్రమాదమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా తెలుగు రాష్ట్రాల్లో మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్‌, శక్తి బృందాలకూ ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఒత్తిడి నుంచి మీరు బయట పడలేకపోతుంటే మానసిక వైద్యులను ఓసారి కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని